వడ్డెరల బతుకు మారేదెన్నడు !?

by Ravi |   ( Updated:2024-06-15 08:04:58.0  )
వడ్డెరల బతుకు మారేదెన్నడు !?
X

ఆదిమకాలం నుండి రాతి కట్టడాలకు జీవం పోసిన ఆదిమతెగలలో వడ్డెర కులం కూడా ఒకటి. వడ్డెరలు ఊర్లల్లో, పట్టణాల్లో చెరువులు, బావులు, కాలువలు తవ్వకాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. మరికొందరు బండలు కొట్టే వారు, ఎక్కడ పనులు దొరికితే అక్కడకి వలస వెళ్తూ సంచారం చేస్తుంటారు..అయితే, గ్లోబలైజేషన్ వడ్డెరల పనివిధానంలో మార్పులు తీసుకువచ్చింది. జేసీబీ, ట్రాక్టర్, డ్రిల్లింగ్, క్రషర్ మిషన్ అంటూ మిషన్లమీద ఆధారపడుతున్నప్పటికీ, కొందరు మాత్రం నేటికీ అవే పనుల మీద ఆధారపడి బతుకుతున్నారు.

భారతీయ ప్రజాసమూహలన్నీ ఏదో ఒక కుల నిర్మాణపు పోగులో భాగంగా ఉంటాయి. ఈ కుల చట్రంలో అతికొద్ది కులాలకు మాత్రమే ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వేచ్ఛ ఉంటుంది. మిగతా అట్టడుగు కులాలన్నీ అంటరానివిగా ఉంటూ చదువులకు, అభివృద్ధికి దూరంగా జీవిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇల్లు కట్టాలి అంటే ముందుగా రాయి కోసం వడ్డెరలను సంప్రదించేవారు. అదే రాతి కట్టడం అయితే వీరి చేతుల మీదుగానే పూర్తయ్యేది, మంచి నీటి నూతులు వీరు మాత్రమే తవ్వేవారు. కాలంతో మార్పులు జరిగి బోరు బండ్లు, ఆధునిక మిషన్ల ఉపయోగం ఎక్కువైంది.. దీంతో వడ్డెరలు ఆర్థికంగా నిలబడలేక కాలంతో పరిగెత్తలేక ఈ యంత్రాల వినియోగంతో వాళ్ల ఉపాధికి గండి పడుతోంది. ఇలా వలస వెళ్లిన ప్రతిచోట పెద్ద పెద్ద క్వారీల వద్ద, ప్రాజెక్టుల వద్ద, రోడ్ల పక్కన గుడిసెలు వేసుకొని జీవించే వీరి జీవితాలకు రక్షణ లేదు, ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే పట్టించుకునే వారే లేరు, వీరు పనిచేసే ప్రతిచోటా కనీస సౌకర్యాలు కూడా లేక సరైన వైద్యం అందక చనిపోయిన వారు ఎందరో ఉన్నారు, ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి నిస్సహాయులుగా మిగిలిన వారు మరికొందరు. వీరంతా అసంఘటితంగా పనిచేస్తుండటం వీరి దౌర్భాగ్యానికి మరొక కారణం.

తిరుగుబాటు వీరులుగా..

1857 స్వాతంత్ర్య ఉద్యమంలో పాళెగాళ్ల పోరాటయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేసి తన ధైర్య సాహసాలతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన రేనాటి వీరుడు ఒడ్డే ఓబన్న దగ్గరి నుండి గడిచిన తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్న వడ్డెర నాయకులు, మరెందరో యువకులు పాత్ర ఎంతో ఉంది. మొదటి నుండి రాజకీయ, సామాజిక, ఆర్థిక నిర్లక్ష్యానికి గురైన వడ్డెరలు కాలక్రమేణా సంచార జాతిగా మారిపోయారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎరుకల, యానాదుల, లంబాడి, వడ్డెర వంటి సంచార జాతుల కులాలను విముక్త జాతులుగా పరిగణించారు, కాగా కాలక్రమేణా ఎరుకల, యానాదుల, లంబాడి కులాలను 1972లో ఎస్టీ లో చేర్చారు, ఒక్క వడ్డెర కులాన్ని మాత్రం బీసీ-ఏ గా చేర్చారు, అప్పటికే ఆర్థికంగా వెనుకబడిన వడ్డెరలు నాటి నుండి నేటి వరకూ తమను కూడా ఎస్టీలో చేర్చండి, మాకంటూ రిజర్వేషన్ ఇవ్వండి, ఆర్థికంగా ఎదిగే అవకాశం కల్పించండి అంటూ నినదిస్తూనే ఉన్నారు, శ్రమ జీవులుగా బతికే వీరిని ఇప్పటి వరకూ ప్రభుత్వం గుర్తించిందే లేదు.

మాటిచ్చి తప్పిన కేసీఆర్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా వడ్డెరలు వారి ఉనికి కోసం నాటి నుండి నేటి వరకూ ప్రయత్నిస్తూనే ఉన్నారు, ప్రజాస్వామ్య దేశంలో సామాజిక న్యాయం లోపించింది. ఇప్పటి వరకు వడ్డెరల నుండి ఒక ఎమ్మెల్యే, ఎంపీని కాదు కదా ఎమ్ఎల్‌సీని కూడా చూడలేకపోయాం. తెలంగాణ ప్రభుత్వం రాకముందు మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వస్తే వడ్డెర‌లను బీసీ-ఏ నుండి ఎస్టీలోకి చేర్చుతామని మాటిచ్చారు. ఆనాటి నుండి రెండు సంవత్సరాల క్రితం జరిగిన మునుగోడు ఉప ఎన్నికల వరకు కూడా ఇదే మాట చెబుతూ వచ్చారు. కానీ తెలంగాణ వచ్చి అభివృద్ధి అంటూ దశాబ్ది ఉత్సవాలు అయితే జరుపుకున్నారే తప్ప వడ్డెర జీవితాల్లో ఎలాంటి వెలుగు తేలేదు.

కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వడ్డెరలు ఎస్సీలుగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు, తెలంగాణలో మాత్రం వడ్డెర బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చొరవ తీసుకుని వడ్డెరలను బీసీ-ఏ నుండి ఎస్టీ లోకి చేర్చి రిజర్వేషన్ కల్పిస్తే వారి విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి ఆర్థికంగా ఎదగడమే కాకుండా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులను వినియోగించుకొని రాజ్యాధికారం వైపుగా కూడా రేపటి యువత అడుగులు వేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాగానే వడ్డెరలను ఎస్టీలో చేర్చుతామని ఇచ్ఛిన హామీని నిలుపుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వడ్డెరలకు రాజకీయ అవకాశాలను కల్పించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడవలసిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.













ఓర్సు హేమలత అశోక్ వడ్డెర

వడ్డెర సంఘం నాయకులు

ఫోన్ నెంబర్: 94948 12216

Advertisement

Next Story

Most Viewed