సెక్స్‌ని సైన్స్‌గా చూడకపోతే?

by Ravi |   ( Updated:2024-09-30 07:32:23.0  )
సెక్స్‌ని సైన్స్‌గా చూడకపోతే?
X

మనిషిలో అనేక రకాల వ్యతిరేక భావోద్వేగాలైన కోపం, భయం, ఉద్వేగం, ఆందోళన, కృంగుబాటు తనం, ఒత్తిడి లాంటివి శృంగార జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యలను సృష్టిస్తాయి. ముఖ్యంగా ఆందోళన అనేక శృంగార సమస్యలకు దారి తీస్తుంది. సెక్స్ పట్ల దంపతుల్లో, టీనేజీ పిల్లల తల్లిదండ్రుల్లో.. టీనేజీ పిల్లల్లో కూడా వచ్చే సందేహాలు భయాలు. ఈ ప్రశ్నలకి సరి అయిన విధంగా శాస్త్రీయ పద్ధతిలో .. ఒక సైన్స్‌లా విశ్లేషించి సమాధానాలు ఇవ్వకపోతే వీరు అరకొర జ్ఞానం ఉన్న నకిలీ వైద్యుల దగ్గరికి వెళ్లి మోసపోతూ ఉంటారు. లేదా విరివిగా సెల్‌ఫోన్‌లో దొరికే పోర్న్ సైట్స్ చూస్తూ అందులో చూపించే నాన్ మెడికల్ అంశాలనే నమ్ముతూ.. అందులోని వికృతమైన అసహజ లైంగిక ధోరణులకు అలవాటు పడతారు. ఇది వారి భావి జీవితాలను సర్వనాశనం చేస్తుంది. జీవితాంతం నరకం అనుభవించడమే కాదు... వాళ్ల జీవన సహచరులను కూడా కష్టపెడతారు.

వీక్‌నెస్ తనకు, శిక్ష నాకూనా?

ప్రశ్న: నా వయసు 34 సంవత్సరాలు. మావారి వయసు 44 సంవత్సరాలు. మాకు వివాహమై 15 సంవత్సరాలయింది. దాంపత్య జీవిత సౌఖ్యాన్ని ఎంతో ఆనందంగా గడిపాం. ప్రత్యేకించి మా వారు నేను శృంగారంలో ఆనందం పొందే విధంగా ఫోర్ ప్లే చేస్తారు. అయితే ఈ మధ్య ఆయన అంగస్తంభన విషయంలో ఆందోళన చెందుతూ... నా సంతృప్తిని గురించి అడిగి తెలుసుకుంటున్నారు. నాకు బాగానే ఉందన్నా ఆయన నమ్మటం లేదు. ఇదే సమయంలో మా బంధువులలో ఒకామె ఈ విషయంలో ఆయన పై అనుమానం కలిగేలా మాట్లాడింది. అలాగే మా వారికి షుగర్ బయటపడింది. మందులు వాడుతున్నారు. నా అనుమానాలకు ఒకసారి బెత్తంతో సమాధానం చెప్పారు. బాధ కలిగింది. రాజీపడ్డాను. ఆయనలో వీక్‌నెస్‌కి నన్ను శిక్షిస్తే ఎలా? నా వక్షోజాలు బిగువులో మార్పు కూడా గమనించాను. అయితే ఈ మధ్య శృంగారంలో కండరాలు బిగుసుకుపోయి నొప్పిగా అన్పించడంతో పాటు అంతకు ముందులా శృంగారంలో పాల్గొనలేకపోతున్నాను. ఎందుకో చెప్పగలరు.

జవాబు: మీరు మీ పక్కింటావిడ చెప్పుడు మాటలు విని మీ వారి సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేశారు. మీవారు సెక్స్‌లో మీరు ఆర్గాజం పొందటానికి ప్రయత్నిస్తూనే ఉంటారని రాశారు. షుగర్, వాటికి వాడే మందులు, మానసిక ఆందోళనల వల్ల మీవారిలో అంగస్తంభన సమస్య వచ్చుంటుంది. మంచి ఆహారం, యోగా, సరైన మందులు వాడటంతో పాటు మీ సహకారం ఉంటే మీవారి సమస్య తీరు తుంది. అలాగే అంగప్రవేశానికి ముందే ఫోర్ ప్లే వల్ల మీరు భావప్రాప్తి (ఆర్గాజమ్) పొందుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి మీవారి సమస్య తీరే వరకు అదే పద్ధతిని పాటించండి. మీ వారిని మంచి సెక్సాలజిస్టును కలవమని చెప్పండి.

సెక్సును అసహ్యించుకోవద్దు

ప్రశ్న: నేను నా భర్తతో లైంగికంగా కలవలేక అయిష్టంగా ఉన్నాను. నా భర్త కలవాలని బలవంతపెడతాడు. దీంతో నాకు సెక్స్ మీద అయిష్టత పెరిగింది. ఎందుకో తెలుపగలరు.- భారతి

జవాబు: సహజీవనంలో భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని శృంగారం మరింత బలపరుస్తుంది. మీరు ముందుగా మీకు సెక్స్ అంటే ఎందుకు అయిష్టతో తెలుసుకోండి. తర్వాత ఆ అయిష్టత సహేతుకమైనదా కాదా అన్నది స్పష్టపరుచుకోండి. సెక్స్ సమయంలో నొప్పి ఏమన్నా కలుగుతోందా? మీ భర్త మీతో ఆ సమయంలో మీ ఇష్టానికి విరుద్ధంగా మోటుగా ప్రవర్తిస్తున్నారా? ఎలా ప్రవర్తిస్తే మీకు బాగుంటుందో మీ భర్తకు తెలపండి. సెక్స్ అనేది అసహ్యించుకోదగ్గది - అశ్లీలమైనదీ కాదు. ఆరోగ్యవంతమైన సెక్స్ భార్యాభర్తలిద్దరూ ఆహ్వానించదగ్గదీ, ప్రేమించదగ్గదీ! ముందైతే మీ భార్యాభర్తలిద్దరూ మంచి సెక్స్ థెరపిస్ట్ దగ్గరకు కౌన్సిలింగ్‌కు వెళ్లండి.

అసహజ ఉద్రేకాలకు మూలం!

ప్రశ్న: డాక్టర్ గారూ, నాకు ఈ మధ్యనే వివాహం అయింది. మా వారికి ఉన్న వింత అలవాటు నాలో ఆయన పట్ల విముఖతను కలిగిస్తోంది. ఆయన సూట్‌కేసులో రకరకాల పెన్నులున్నాయి. అవన్నీ ఆయన స్కూల్ రోజుల నుంచి ఆయన పీజీ అయ్యేంత వరకు తన మహిళా సహోధ్యాయులను అడిగి, లేదా దొంగతనం చేసి సంపాదించుకున్నవట. సమస్య ఏంటంటే శృంగార సమయంలో ఆ సూట్‌కేసును తెరిచి వాటిని చూస్తూ, తాకుతూ ఉద్రే కం పొందుతారు. అవి లేకపోతే (చాలాసార్లు విసిరేశాను) ఆయనకు నా మీద ఎక్కువ ఉద్రేకం కలగ దు. ఈ పరిస్థితి నాకు చాలా అసహ్యంగా ఉంది. దయచేసి ఏం చేయాలో చెప్పగలరు. - సునీత

జవాబు: సునీతగారూ మీ సమస్య ఇబ్బందికరంగానే ఉంది. మీ వారి మనో లైంగిక సమస్యను సైకో సెక్సువల్ డిజార్డర్, ఫెటిషిజం అంటారు. స్త్రీల వస్తువులపై లైంగికాపేక్షను పెంచుకుని వీరు లైంగిక ద్రేకాన్ని పొందుతారు. వీరినే ఫెటిష్‌లు అని కూడా అంటారు. అయితే వస్తువు లేకుండా మీపై శృంగారాసక్తి కలగడం లేదంటే ఆయన లైంగికోద్రేకం జనింప చేసుకోవడానికి మానసికంగా ఎక్కువగా ఆ వస్తువుపైనే ఆధారపడి పోయారు. ఇది సహజ లైంగిక చర్య కాదు. తనతో పాటు మీలో కూడా ఆందోళన పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ వారితో వెంటనే సెక్సాలజిస్టు వద్దకు వెళ్ళి కౌన్సి లింగ్ ఇప్పించండి. వస్తువు లేకుండా మెల్లగా మీపైనే సహజమైన శృంగారాసక్తిని కలిగించే కౌన్సిలింగ్ (అంటే - మనోలైంగిక వ్యాయమాలు, ఇతర సెక్సు థెరపీ) చేస్తారు. తద్వారా తనలో సహజ శృంగారానుభవ ఉద్రేకాన్ని పొందవచ్చునే లైంగిక అవగాహన కలిగించి మీ సమస్యను పరిష్కరిస్తారు.

నొప్పి తగ్గేంత వరకూ సెక్స్ వద్దు!

ప్రశ్న: నాకు వివాహమై మూడు నెలలు అయ్యింది. కలయిక సమయంలో ఇప్పటి దాకా ఎంతో నొప్పిని అనుభవిస్తున్నాను. కారణం ఏమిటి..? నాకు శృంగారం అంటే భయం- అర్థం చేసుకోని మావారంటే కోపం కలుగుతున్నాయి. ఏం చేయాలి?

జవాబు: హైమన్ ముక్కలు లోపల ఉన్న కలయికలో - స్ట్రోక్స్ లేదా కదలికల్లో సాగబడి నొప్పి కలుగుతుంది. అలాగే ఫోర్ ప్లే చేయకుండా - కొద్దిపాటి లూబ్రికేషన్‌లో కలయిక చేయబోయినా నొప్పి కలుగుతుంది. వెజైనా చుట్టూ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా నొప్పి కలుగుతుంది. అలాగే బార్సోలిన్ గ్రంథుల వాపు ఉన్న నొప్పి కలుగుతుంది. గైనకాలజిస్టుని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. మీ భర్తకు వివరంగా చెప్పండి. తీవ్రమైన ఇన్ఫెక్షన్, నొప్పి తగ్గేంత వరకూ శృంగారం వద్దని కచ్చితంగా చెప్పండి. ఆగలేకపోతే బాహ్యస్పర్శలతో ఆనందపడండి. అలాగే మానసికంగా శృంగారం పట్ల వ్యతిరేక ధోరణులు, భయం అసహ్యం ఉన్నా వెజైనిస్మస్‌కి దారి తీసి వెజైనా కండరాలు బిగుసుకుపోయి నొప్పి కలిగి కలయిక సాధ్యం కాదు. భయాన్ని పోగొట్టుకొని ఆనందంగా స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొనటానికి సెక్స్ థెరపిస్ట్‌ని కలవండి. కె.వై.జెల్లీ కూడా వాడవచ్చు. ఫోర్ ప్లే ఎక్కువ సార్లు చెయ్యండి.

- డాక్టర్ భారతి,

సెక్సువల్ హెల్త్ & ఫ్యామిలీ కౌన్సెలర్,

ప్రీ & పోస్ట్ మేరేజ్ & సెక్సువల్‌ కౌన్సెలింగ్

79892 27504

askdoctorbharathi@gmail.com

👉 మరిన్ని సెక్స్ & సైన్స్ వార్తల కోసం సందర్శించండి

Advertisement

Next Story

Most Viewed