- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోటితో పోయేదాన్ని.. గొడ్డలిదాకా గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం విషయంలో జరిగిందేంటి?
తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం పాటు చర్చలను ప్రధాన అస్త్రంగా ఎంచుకున్న కేసీఆర్, రాష్ట్ర గవర్నర్‌తో సఖ్యతగా ఉండే విషయంలో మాత్రం అలాంటి చొరవను ఎందుకు తీసుకోలేకపోయారన్నది ప్రశ్న. 'మై గవర్నమెంట్' అని పలికే గవర్నర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం అనూహ్య పరిణామం. ఇటు ముఖ్యమంత్రి నుంచీ, అటు గవర్నర్ నుంచి వివాదానికి పరిష్కారం కనుగొనడంలో చొరవ తీసుకోకపోవడం కోర్టు మెట్లెక్కడానికి కారణమైంది. వివాదాలు చోటుచేసుకుంటే కోర్టుదాకా వెళ్ళకుండా ఆర్బిట్రేషన్, మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోడానికి ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటైన సందర్భంగా కేసీఆర్.. 'వివాదాలు తలెత్తినప్పుడు వివిధ కారణాలతో కోర్టు దాకా వెళ్ళినా అనుకున్న టైమ్‌కు పరిష్కారం కావడంలేదు.. మీడియేషన్ సెంటర్‌లో పరస్పరం చర్చించుకుని కొలిక్కి రావడానికి వీలవుతుంది..' అని వ్యాఖ్యానించారు. అదే ఫార్ములాను గవర్నర్‌తో తలెత్తిన విభేదాల విషయంలోనూ కేసీఆర్ పాటించి ఉంటే ఇప్పుడు ఇక్కడిదాకా వచ్చేది కాదు. కోర్టు ద్వారా చెప్పించుకునే బదులు వారి స్థాయిలోనే ఇద్దరూ చొరవ తీసుకుని ఉంటే పదిమందిలో పలచన అయ్యే అవకాశమూ ఉండేది కాదు.
పంతాలు పట్టింపులకు పోతే రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ ఎలా ఉంటుందో తెలంగాణలోని తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ లాంటి పలు రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది. ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మధ్య తలెత్తిన భిన్నాభిప్రాయాలతో పరస్పరం ఒకే వేదికను పంచుకోలేకపోతున్నారు. చివరకు గవర్నర్ వ్యవస్థనే తప్పుపట్టాల్సి వస్తున్నది. తప్పొప్పులను ఎత్తిచూపుకుని ప్రయోజనం లేదు. ఒకదానిపై మరో వ్యవస్థ పైచేయి సాధించాలనుకోవడంలో అర్థమూ లేదు. పరస్పరం చర్చించుకునే వాతావరణం ఉంటే ఘర్షణను నివారించడం అసాధ్యమూ కాదు.
గవర్నర్ తన ప్రసంగాల్లో తరచూ 'మై గవర్నమెంట్' అని చెప్తుంటారు. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టునే గవర్నర్ చదవాల్సి ఉంటుంది. పరిపాలనలో గవర్నర్ కూడా ఒక భాగమని, మంత్రివర్గం సూచనలు, సలహాల మేరకే పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వమూ వ్యాఖ్యానిస్తుంటుంది. 'మై గవర్నమెంట్' అని పలికే గవర్నర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం అనూహ్య పరిణామం. నిజానికి గవర్నర్ వ్యవస్థలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవన్న విషయం ప్రభుత్వానికి తెలియందీ కాదు. అదే విషయాన్ని చీఫ్ జస్టిస్ ఉదహరించారు. ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పులా మారిపోయిన పరిస్థితులే ఇందుకు దారితీశాయి.
సంప్రదింపులకు బదులుగా ఘర్షణ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 14 ఏండ్ల పాటు రాజకీయ ఉద్యమం చేశారు. వివిధ పార్టీల నేతలతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అర్థం చేయించారు. జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ఓపికతో పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఒప్పించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఒక ఎంపీగా ఉంటూ పార్లమెంటును కూడా లక్ష్య సాధనకు వేదికగా వాడుకున్నారు. ఎంత ఎక్కువ సహకారం ఉంటే లక్ష్య సాధన అంతగా సాధ్యమవుతుందని నమ్మారు. చర్చల ద్వారా పరిష్కారం కానిదేదీ ఉండదని బలంగా విశ్వసించారు. కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైనా జాతీయ పార్టీలను ఆ దిశగా డ్రైవ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. భగీరథ ప్రయత్నంలో విజయం సాధించారు.
ఇప్పుడు గవర్నర్‌తో సైతం ఘర్షణకు బదులుగా చర్చలు, సంప్రదింపులు, పరస్పర విశ్వాసం అనే మార్గాన్ని ఎంచుకుంటే పరిస్థితి ఈ స్థాయి వరకు రాకపోచవ్చేమో! రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో గవర్నర్ నరసింహన్‌తో చాలా సన్నిహిత సంబంధాలనే కొనసాగించారు. ఒక దశలో ప్రభుత్వం ఏ విధాన నిర్ణయం తీసుకోవాలన్నా తొలుత గవర్నర్‌కు చెప్పి ఆయన సలహా మేరకు నడుచుకునేవారని బహిరంగంగానే కామెంట్లు వినిపించాయి. గవర్నర్ ఒక గైడ్ లాగా వ్యవహరించారు. కేసీఆర్ సైతం అంతే గౌరవంతో గవర్నర్‌ను విశ్వాసంలోకి తీసుకున్నారు. గవర్నర్ వ్యవస్థ అవసరం లేదనే అభిప్రాయాన్ని ఏనాడూ వెల్లడించలేదు.
ఆ విమర్శలకు తావిచ్చింది ప్రభుత్వమే..
కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటా కింద ఎమ్మెల్సీ చేయడానికి సంబంధించిన పైల్‌ను గవర్నర్ పక్కన పెట్టడంతో గ్యాప్ మొదలైంది. అదే వివాదానికి కారణమైతే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి గవర్నర్‌తో చర్చించి ఉంటే ఘర్షణకు తావు లేకుండా ఉండేది. తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం పాటు చర్చలను ప్రధాన అస్త్రంగా ఎంచుకున్న కేసీఆర్ గవర్నర్‌తో సఖ్యతగా ఉండే విషయంలో మాత్రం అలాంటి చొరవను ఎందుకు తీసుకోలేకపోయారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. నరసింహన్‌తో కొనసాగించిన స్నేహ సంబంధాలను తమిళిసై విషయంలో ఎందుకు పాటించలేదనే ప్రశ్నలు విపక్షాల నుంచి బహిరంగంగానే వినిపించాయి.
చివరకు మంత్రులు, అధికార పార్టీ ప్రతినిధులు, అధికారులు సైతం రాజ్‌భవన్ వెళ్ళడానికి ముఖం చాటేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే వెళ్ళాల్సి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ ఇవ్వడంలేదని, రాజ్యాంగం నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్నదని గవర్నర్ విమర్శించడానికి ప్రభుత్వ విధానాలే కారణమయ్యాయి. 'మై గవర్నమెంట్' అని చెప్పుకునే గవర్నర్ చివరకు ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీ, చెన్నై నగరాల్లో మీడియా ద్వారానే ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఒక మహిళను అయినందునే తనకు ప్రభుత్వం నుంచి తగిన గౌరవం, గుర్తింపు లేదనే సెంటిమెంట్ అంశాన్ని లేవనెత్తారు. అలాంటి పరిస్థితికి తావిచ్చింది ప్రభుత్వమే.
ఘర్షణతో ఇబ్బందుల్లో సర్కార్
గవర్నర్‌తో ఘర్షణ వాతావరణం ఏర్పడడం ప్రభుత్వానికే సంకటంగా మారింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సకాలంలో గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో అనుకున్న పనులు ప్రారంభం కాలేదు. యూనివర్శిటీలన్నింటిలో ఖాళీ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లుకు గవర్నర్ ఆమోదం రాకపోవడంతో విద్యావ్యవస్థపై ప్రభావం పడింది. ప్రైవేటు వర్సిటీల బిల్లు విషయంలోనూ అదే రిపీట్ కావడంతో వాటికి గుర్తింపు లేకుండా పోయింది. పరీక్షలు రాయడానికి అవకాశం లేకపోయింది. చివరకు ఆ ప్రైవేటు వర్సిటీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రెండు వ్యవస్థల మధ్య పంతాలు పట్టింపులతో మొత్తం మీద విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారింది.
గవర్నర్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించినప్పుడు తెలంగాణ ప్రగతి, స్కీమ్‌ల అమలు ఎలా ఉన్నదో మొదటి టర్ములో ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమైంది. దీనికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత రాజ్యాంగపరంగా ఎలాంటి చిక్కులు ఎదుర్కొంటున్నదో ఇప్పుడు అవగతమవుతున్నది. గవర్నమెంటులో గవర్నర్ భాగమని నమ్మినా ఆమెకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం ఒక అప్రతిష్టగానే భావించాలి. చీఫ్ జస్టిస్ సూచనతో ఇరుపక్షాల తరఫున న్యాయవాదులు చివరకు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావడంతో వివాదం కొలిక్కి వచ్చింది. న్యాయవాదుల స్థాయిలో చర్చలతోనే పరిష్కారం లభించినప్పుడు గవర్నర్, ముఖ్యమంత్రి పరస్పరం ఈ ప్రక్రియనే ఎంచుకుని ఉన్నట్లయితే ఘర్షణకు ఆస్కారమే ఉండేది కాదు.
ఆ ఫార్ములాను కేసీఆర్ పాటించి ఉంటే..
ఒక కుటుంబంలో వివాదాలొస్తే గుట్టుగానే పరిష్కరించుకోవాలని కోరుకుంటారు. రోడ్డుమీదకు ఎక్కొద్దని భావిస్తారు. ఇప్పుడు గవర్నర్‌తో ఏర్పడిన ఘర్షణను సైతం వారి స్థాయిలోనే పరిష్కరించుకుంటే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరమూ ఉండేది కాదు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా వెళ్ళడానికి రెండు వైపులా కారణాలు కనిపిస్తాయి. ప్రతిష్టకు పోవడంతో అటు గవర్నర్, ఇటు ముఖ్యమంత్రి ఎడమొహం పెడమొహంగానే ఉండిపోయారు. రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ చోటుచేసుకుంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయో, పరిపాలనపై ఎలాంటి ప్రభావం పడుతుందో వారికి తెలియందేమీ కాదు. ఇటు ముఖ్యమంత్రి నుంచీ, అటు గవర్నర్ నుంచి వివాదానికి పరిష్కారం కనుగొనడంలో చొరవ తీసుకోకపోవడం కోర్టు మెట్లెక్కడానికి కారణమైంది.
ప్రోటోకాల్ ఇవ్వడంలేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించే బదులు నేరుగా ముఖ్యమంత్రితోనే గవర్నర్ చర్చించి ఉండొచ్చు. బహిరంగ కామెంట్లు చేయడానికి బదులుగా పరస్పర అవగాహనతో సాధించుకునే మార్గాన్ని ఎంచుకుని ఉండాల్సింది. బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకపోతే ముఖ్యమంత్రే డైరెక్టుగా రాజ్‌భవన్ వెళ్ళి ఆమెతో చర్చిస్తే వివాదానికి ఆస్కారం ఉండేది కాదు. నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలో సాధ్యమైనది ఇప్పుడు తమిళిసై టైమ్‌లో ఎందుకు కాదు అని కేసీఆర్ గ్రహించి ఉండాల్సింది. పంతాలు పట్టింపులు ప్రతిష్టకు పోవడానికి బదులుగా చర్చలు, సంప్రదింపులు, స్నేహ సంబంధాలతో సర్దుకుపోయే పరిస్థితి ఉండేది. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా వెళ్ళే పరిస్థితి తలెత్తడానికి రెండు వైపుల నుంచీ కారణాలున్నాయి.
వివాదాలు చోటుచేసుకుంటే కోర్టుదాకా వెళ్ళకుండా ఆర్బిట్రేషన్, మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోడానికి ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటైంది. దీని ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్.. వివాదాలు తలెత్తినప్పుడు వివిధ కారణాలతో కోర్టు దాకా వెళ్ళినా అనుకున్న టైమ్‌కు పరిష్కారం కావడంలేదు.. మీడియేషన్ సెంటర్‌లో పరస్పరం చర్చించుకుని కొలిక్కి రావడానికి వీలవుతుంది.. అని వ్యాఖ్యానించారు. అదే ఫార్ములాను గవర్నర్‌తో తలెత్తిన విభేదాల విషయంలోనూ కేసీఆర్ పాటించి ఉంటే ఇప్పుడు ఇక్కడిదాకా వచ్చేది కాదు. కోర్టు ద్వారా చెప్పించుకునే బదులు వారి స్థాయిలోనే ఇద్దరూ చొరవ తీసుకుని ఉంటే పదిమందిలో పలచన అయ్యే అవకాశమూ ఉండేది కాదు.
ఎన్. విశ్వనాథ్
99714 82403
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
ఆత్మీయత పంచుతూ, ఆత్మస్థైర్యం నింపుతూ..లోకేష్ యువగళం