- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ చేతికే అధికారమొస్తే....
నా చుట్టూ పురుషులే ఉన్నారు.. మహిళా ఎంపీలకు స్పేస్ ఎక్కడ.. అంటూ భారత పార్లమెంటు సందర్శన సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గతంలో కామెంట్ చేశారు. జోక్‌గా అన్నానంటూ వివరణ ఇచ్చినా సూటిగా తాను అడగదల్చుకున్నది అడిగేశారు. అప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి దేశంలో చర్చ జరుగుతున్నది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎన్ని పార్టీలు మద్దతు పలుకుతాయి.. ఎన్ని వ్యతిరేకిస్తాయన్నది తేలిపోతుంది.
మాటల్లో ఘనం.. చేతల్లో శూన్యం
దేశానికి నాలుగు దిక్కులా ద్వారపాలకుల్లా మహిళలే ఉన్నారు.. అని ఒకప్పుడు చర్చ జరిగేది. దక్షిణాదిన జయలలిత, ఉత్తరంలో మెహబూబా ముఫ్తీ, తూర్పున మమతా బెనర్జీ, పశ్చిమాన వసుంధరా రాజె.. అంటూ విద్యార్థినులు, యువతులు వారిలో వారు చర్చించుకునేవారు. మహిళా సాధికారికత, రాజ్యాధికారం.. గురించి రాజకీయ నాయకులు ఉపన్యాసాలను గంభీరంగానే ఇస్తూ ఉంటారు. ఆచరణ మాత్రం దానికి విరుద్ధంగానే ఉంటుంది. మనిషి బుద్ధి మాంసం దగ్గర బైటపడుతుందనే చందంగా మహిళలకు రాజకీయాల్లో అవకాశం కల్పించే వారి చిత్తశుద్ధి ఎన్నికల టైమ్‌లో తేలిపోతుంది. ఇప్పటివరకూ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రాక్టీసు అదే.
జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు ‘ఆకాశంలో సగం’ అంటూ వారిపై ప్రశంసలు కురుస్తుంటాయి. వారికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, లింగవివక్షను రూపుమాపాలంటూ ఐక్యరాజ్య సమితి మొదలు జీ-20 వరకు అనేక వేదికల మీద సుదీర్ఘ చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ అది ఆ నాలుగు గోడల మీటింగ్ వరకే పరిమితం. ఆ తర్వాత షరా మామూలే. చట్టసభల్లోకి మహిళలను పంపడానికి రాజకీయ పార్టీలు మానసికంగా సిద్ధపడవు. వారసత్వం, సామాజిక పలుకుబడి, సంపన్నులో అయితేనే అవకాశాలు. దాదాపు అన్ని పార్టీలకూ మహిళా విభాగాలున్నా చట్టసభల్లోకి అవకాశాలు అంతంతమాత్రమే.
మహిళలు..శాసనకర్తలుగా మారితే
మహిళలకు పొలిటికల్ అవకాశాలు కల్పించడానికి చాలా పార్టీలు ధైర్యం చేయవు. ఇందుకు కారణం గెలుపుపై అపనమ్మకమే! అయితే, నిబంధనే లేకపోతే ఎప్పటికీ వారికి అవకాశాలు రావు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్‌కు చట్టం రావడంతో ఇవ్వక తప్పడంలేదు. మహిళలు సర్పంచ్‌లు, పరిషత్ చైర్‌పర్సన్ అయినా వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా.. వారిని నడిపిస్తున్నది భర్త, తమ్ముడు, తండ్రే కదా.. అనే చర్చలు సరేసరి. కానీ అసెంబ్లీ, పార్లమెంటు విషయంలో ఆ తరహా విమర్శలు తక్కువే. ఈ రిజర్వేషన్‌తో మహిళల్లో ఆత్మస్థయిర్యం పెరగడంతో పాటు సామాజిక అవగాహన పెరుగుతుంది.
కొన్ని సమస్యలపై ఆ సెక్షన్ ప్రజలకే పరిజ్ఞానం ఎక్కువ. వారి చేతికే అధికారమిస్తే పరిష్కార మార్గం సులువవుతుందని వారికి చట్టసభల్లో అవకాశం ఇస్తుంటారు. కానీ చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరిగితే సామాజిక అవసరాల్లో ప్రయారిటీకి స్పష్టత ఏర్పడుతుంది. స్త్రీ శిశు సంక్షేమం, శిశు మరణాల నివారణ, అక్షరాస్యత పెంపు లాంటివి గాడిలో పడతాయి. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, సంస్కృతిలో విశృంఖలత్వం, సినిమాల్లో హింస.. ఇలాంటి అనేక రుగ్మతలకు నియంత్రణ, నివారణ బెటర్ అవుతుంది. మహిళలకు స్వేచ్ఛ లభించే అవకాశాలు, అధికారాలు కార్యరూపం దాలుస్తాయి. మాటల నుంచి చేతల్లోకి మార్పు వస్తుంది. ఇంటి నిర్వహణ బాధ్యతల్లో పుష్కలమైన మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్న మహిళలు తటపటాయింపు లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా దేశాల అనుభవాలు దీన్నే రుజువుచేశాయి.
అంత ఈజీగా మార్పు సాధ్యమా?
పురుషాధిక్య భావజాలంతో మహిళలపై వివక్ష చట్టసభల్లోనూ కనిపిస్తున్నది. నోరు జారడం.. ఆ తర్వాత రియలైజ్ అయిన ఘటనలు చాలా ఉన్నాయి. సభలో సగం మంది మహిళలే కనిపిస్తే పురుషుల ఆలోచనల్లో, వ్యవహారం మారిపోతుంది. అది ఆ సభ వరకే పరిమితం కాకుండా కాలక్రమంలో దృక్పథంలోనే మార్పునకు దోహదపడుతుంది. మహిళల్లోనూ కాన్ఫిడెన్స్ పెరిగి చివరకు అది ప్రశ్నించడం, డిమాండ్ చేయడం, సాధించుకోవడం, ఆచరించడం తదితర రూపాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే మహిళలే అయితే ప్రభుత్వ యంత్రాంగంలోనూ జవాబుదారీతనం పెరుగుతుంది.
అయితే ఇది కేవలం మహిళా రిజర్వేషన్‌తోనే సాధ్యం కాదు. రాజకీయ చైతన్యం పెరిగిననాడే సాకారమవుతుంది. ఈ చట్టం అందుకు దోహదపడుతుంది. భూస్వామ్య సంస్కృతి ప్రభావం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అధికారం ఒక మింగుడుపడని వ్యవహారం. ఖాప్ పంచాయతీ, కట్ట పంచాయతీ, రచ్చబండ, ఊరిపెద్ద.. లాంటి రూపాల్లో జరిగే నిర్ణయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మహిళను అందలమెక్కించడానికి ససేమిరా అనే మనస్తత్వం వారిది. మహిళకు ఓటేయడం వారి దృష్టిలో నామోషీ వ్యవహారం. కానీ చట్టమే చెప్తుండడంతో వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అమలు చేయాలనే ఆలోచనలో పడతారు.
సామాజిక మార్పునకు నాందిగా..
మహిళ సొంత నిర్ణయాలతో, స్వతంత్రంగా పనిచేయడం కాకుండా తాము ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకోవాలనేది చాలాచోట్ల కొనసాగుతున్న ప్రాక్టీస్. అటు పురుషులు, ఇటు మహిళలూ ఆ కల్చర్‌కే అలవాటుపడ్డారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇది కొనసాగుతున్నది. ఎన్నికలప్పుడూ భర్త లేదా తండ్రి చెప్పిన పార్టీకే ఓటు వేస్తున్నారు. చెప్పింది చేసే యంత్రాలనే భావన ఉన్నది. పట్టణ-గ్రామీణ ప్రాంతాల మధ్య తేడాలుండొచ్చు. అక్షరాస్యతనుబట్టి ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ఇంటి గడప దాటాలన్నా పురుషుడి అనుమతి తప్పనిసరి అమలయ్యే గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. ఒక్కసారిగా చట్టంతోనే ఈ మార్పులన్నీ సాధ్యమవుతాయన్నది ఊహాజనితమే!
కొన్నిసార్లు చైతన్యంతో ఆలోచనల్లో మార్పు వస్తుంది. పరిణతి పెరుగుతుంది. స్వీయ నియంత్రణ, స్వయం నిర్ణయాధికారంతో ఫలితాలు రానప్పుడు చట్టం ఆ పని చేయిస్తుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ విషయంలోనూ అంతే. పార్టీల నేతలు సొంతగా మహిళలకు టికెట్లు ఇవ్వనప్పుడు చట్టం కారణంగా తప్పనిసరి అవుతుంది. స్వాంతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలైనా చట్టసభల్లో మహిళలు 15% దాటడం లేదు. వారికి దక్కుతున్న అవకాశాలు అంతంతే. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తే పార్లమెంటు, అసెంబ్లీలలో వారి సంఖ్య పెరుగుతుంది. మహిళలు గొంతెత్తడంతోపాటు పురుషులు బాధ్యతగా వ్యవహరించడం మొదలవుతుంది.
టికెట్ల కేటాయింపు ఎలా?
మహిళా రిజర్వేషన్ చట్టంతో అటు ప్రజల, ఇటు పార్టీల నేతల ఆలోచనల్లో మార్పు అనివార్యం. పురుష ఓటర్లే అయినా అనివార్యంగా మహిళలను ఎన్నుకోక తప్పదు. పార్టీలూ మహిళలకు టికెట్ ఇవ్వడం తప్పదు. సాంస్కృతికంగా రావాల్సిన చైతన్యానికి బదులు చట్టం ద్వారా నిర్బంధ పద్ధతుల్లో సాధ్యమవుతున్నది. చాలా పార్టీల నేతలు ఇంత కాలం మహిళలకు తగిన అవకాశాలు ఇవ్వలేదు. రాజకీయంగా వారిని ఎదగనివ్వలేదు. చిన్నచూపు, వివక్షే ఇందుకు కారణం. ఇప్పుడు చట్టం కారణంగా వారసులు, సంపన్నులు, పలుకుబడి ఉన్న మహిళలతో పాటు భవిష్యత్తులో కొత్తవారికి అవకాశాలు లభిస్తాయి.
ఇప్పటికిప్పుడు కొత్తగా మహిళా అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం అన్ని పార్టీలకూ సవాలు. దక్షిణ భారతంలో అర్బన్ ప్రాంతాలు ఎక్కువ కావడంతో సమస్యలు కాస్త తక్కువ కావచ్చు. మిగిలిన రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు, తక్కువ అక్షరాస్యత, సాంస్కృతిక వెనకబాటు తదితర కారణాలతో పార్టీలకు చిక్కులెక్కువుండొచ్చు. నారీశక్తి, ఉమెన్ పవర్.. అంటూ పార్టీల నేతలు ఎన్ని ఉపన్యాసాలు చేసినా టికెట్ల కేటాయింపులో ఇప్పటివరకూ ఆ చిత్తశుద్ధి లేదు. ఈ చట్టంతో వారి ఆలోచనల్లో మార్పు తప్పనిసరి అవుతుంది. రాజకీయంగా మహిళలనూ ఎదిగించాలన్న కొత్త సంప్రదాయం అనివార్యంగా మారుతుంది.
ఎన్. విశ్వనాథ్
99714 82403