- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉపాధ్యాయులా.. కూలీలా ..?

దిశ,టేకులపల్లి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వంట పాత్రలు మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీలతో చేయించాల్సిన పనులు విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల ఉపాధ్యాయులు , విద్యార్థులు వంట పాత్రలు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ , మండల పరిషత్ , జిల్లా పరిషత్, గిరిజన పాఠశాలలకు మధ్యాహ్న భోజన వంట పాత్రలను పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే బుధవారం టేకులపల్లి మండలానికి వంట పాత్రలు వచ్చాయి. టేకులపల్లి మండలంలోని మొత్తం 68 పాఠశాలలకు వంట పాత్రలు మంజూరు కాగా.. మండల విద్యాశాఖ అధికారి జగన్ ఆధ్వర్యంలోపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు వంట పాత్రలను అప్పగించారు.
వంట పాత్రలను ప్రత్యేక వాహనాల్లో పాఠశాలలకు పంపించడం కానీ , మధ్యాహ్నం భోజన వర్కర్లను పిలిపించి వారికి అప్పగించడం కానీ చేస్తే బాగుండేది. ఉపాధ్యాయులే కూలీలుగా మారి వంట పాత్రలను మోసుకెళ్లి ద్విచక్ర వాహనాలపై , ఆటోలలో పెట్టుకొని వారి వారి పాఠశాలలకు తీసుకెళ్లారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను సైతం తెచ్చుకుని వారి చేత కూడా వంట పాత్రలను మోయించారు . వంట పాత్రలతో పాటుగా ప్లేట్లు గ్లాసులు కూడా ఇస్తే బాగుండేదని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా స్కూలు నడుస్తున్న సమయంలో ఉపాధ్యాయులను పిలవడం వారికి వంటపాత్రలు అప్పగించడం సరైనది కాదని యుటిఎఫ్ జిల్లా నాయకుడు కిషోర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.