సర్దుబాటు కాదు... ఉద్యమబాట కావాలి

by Ravi |   ( Updated:2023-05-16 23:46:16.0  )
సర్దుబాటు కాదు... ఉద్యమబాట కావాలి
X

డు దశాబ్దాల సుదీర్ఘ పోరాట చరిత్ర, ఎన్నో చారిత్రాత్మక పోరాటాలకు వేదిక, ఎన్నో ప్రయోజనాలు సాధించిపెట్టిన అగ్రగామి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల ఉద్యమ సంస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్దండులైన పరిపాలకుల కనుసన్నల్లో మెలిగి, కరకుగా వ్యవహరించి, కనువిప్పు కలిగించిన ఆ సంస్థ నాలుగు స్తంభాలుగా మారి గత స్ఫూర్తిని విస్మరించిందని అపప్రథకు గురైంది.

వందకు పైబడి ప్రభుత్వ శాఖల్లో ఏకైక నాయకత్వంతో రాష్ట్ర స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు విస్తరించి ఉద్యోగులకు దిశానిర్దేశం చేసిన ఆ సంఘం కాలగమనంలో పాలకుల పాచికలకు చిక్కి ముక్కలు చెక్కలైంది. సంఘ నేతల్లోని అతివాదం, మితవాదం, వితండవాదం వెరసి ప్రభుత్వానికి పెరుగన్నం పెట్టి నంజుకునేందుకు చేతికి నిమ్మకాయ ఊరగాయ చేతికందించినట్లైంది. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించిపెట్టిన గత ప్రయోజనాలు కనుమరుగవుతున్నా, కాలం తెచ్చిపెడుతున్న మరెన్నో సమస్యలు డిమాండ్ల జాబితాలో కొండవీటి చెంతాడులా చేరిపోతున్నా పరిష్కార దిశగా పాలక ప్రభుత్వాలు సాచివేత వైఖరి అవలంభిస్తున్నా కేవలం ప్రాతినిధ్యాలు, అరకొర పోరాటాలు ఉద్యోగుల నడ్డి విరుస్తున్నాయి. రాజ్యాంగ పరిధిలో పరిష్కారం చూపాల్సిన సమస్యలపై కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఒక దుస్సాహసం. వాటిని వితర్కించడంలో సంఘాలు విభిన్న వైఖరులను అవలంభిస్తుండడంతో ప్రభుత్వాలు తనదైన శైలిలో అణచివేత, సాచివేత, విడగొట్టి పడగొట్టే విధానాలతో ముందుకెళుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఆయా సంఘాలు నిట్టూర్పులు విడుస్తున్నాయి.. ఆటవిడుపు ఉద్యమాలు అధమ స్థాయి పరిష్కారాలు చూపుతున్నాయి.

ప్రజలకు ప్రభుత్వాలకు వారధులు

సంఘాలు అంటే కేవలం పోరాటం చేయడం కోసం కాదు. సంఘాలు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కాదు. సంఘాలు అంటే ప్రతిపక్షాల చేతిలో అస్త్రాలు కాదు. సంఘాలు ప్రభుత్వ శాఖలు ఒక ఒరలో వుండి కార్యదదక్షతతో పనిచేయిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, అవినీతికి దూరంగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పని చేయాల్సిన వారధి. వాస్తవానికి ప్రభుత్వమంటే ఉద్యోగులే కదా! ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లి ఫలవంతం చేసే ఒక వాహకం. అయితే ఈ లక్ష్యసాధనలో పరిమితులను గుర్తించి ఉద్యోగుల పట్ల ఉదారవాదంతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం పాలకుల విధానంగా ఉండాలి. అయితే ప్రభుత్వాలకు ఉద్యోగ సంఘాలకు మధ్య ఒక కనిపించని అగాథం చాలా కాలం కిందటే ఏర్పడింది. కొందరు నాయకులు ఒక్కో దశలో ఒక్కో ప్రభుత్వంతో అంటకాగుతూ వచ్చారు. మరికొందరు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై లొసుగులను ప్రతిపక్ష నేతలకు ఉప్పందిస్తూ కోవర్టులుగా వ్యవహరించడంతో ఒకరిపై ఒకరికి అపనమ్మకాలు ఏర్పడ్డాయి. ఈ పరంపరలోనే ప్రభుత్వాన్ని శాసించిన నేతలు ఇపుడు చతికిలబడ్డారు. కొందరు తమను నమ్ముకున్న ఉద్యోగుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి, మరికొందరు తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంతో మిలాఖత్ అయిన దాఖలాలున్నాయి. పార్టీలకు సానుభూతిపరులుగా మారి పాలకులకు సానుకూలంగా వ్యవహరించి ఉద్యోగులలో అయోమయం సృష్టించి అనుమానితులుగా నిర్ధారించబడ్డారు.

2022 ఫిబ్రవరి 2న జరిగిన విజయవాడ పీఆర్సీ ఉద్యమం తర్వాతి పరిణామాలతో సంఘాల నాయకులంటేనే అసహ్యం ఏర్పడింది. ఎన్జీఓ సంఘాల వ్యవహారశైలి మూలంగా పీఆర్సీలో ఉద్యోగులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముమ్మాటికీ సంఘ నేతల పనితీరుకు దక్కిన బహుమతే! ఎడతెగని చర్చలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఘాటు విమర్శలతో స్ఫూర్తిని రగిలించిన నేతలు తదనంతరం పాలకుల వద్ద సాగిలపడ్డారు. 70% ఫిట్మెంట్ కోరుతూ వేతన సవరణ సంఘానికి ప్రతిపాదనలు అందించిన అనేక సంఘాలు 23 శాతానికి చేతులెత్తి రావడం ఉద్యోగ, కార్మిక, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు ఆర్ధికంగా ఆత్మహత్యా సదృశ్యమే! 70 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి కనీసం ఏడింటిని కూడా సాధించకుండా, సీపీఎస్ రద్దు అంశాన్ని బుట్టదాఖలు చేసి పీఆర్సీ ఉద్యమాన్ని అటకెక్కించేసిన సంఘాల వైఖరి క్షంతవ్యం కాబోదు. చివరకు పెన్షనర్లకు కూడా చేదు అనుభవం మిగిల్చిన పునాదులపై సంఘాలు విజయసభలు జరుపుకోవడం, ఉద్యోగుల ప్రతిఘటనలకు జంకి పోలీసులను కాపలా పెట్టుకోవడం దయనీయ స్థితికి దర్పణం పడుతోంది. దీనికితోడు రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలు కూడా గణనీయంగా శక్తి పుంజుకోవడం గమనార్హం.

మాట మారింది తీరూ మారింది

ఆ అనుభవాల నేపథ్యంలోనే ఇపుడు ఏపీఎన్‌జీవో సంఘం ఇపుడు పంథా మార్చుకుంది, పేరు మార్చుకుంది, మాట తీరును మార్చుకుంది, అసలు తనను తానే మార్చుకుంది. మౌనమునిగా రూపాంతరం చెందాలని అజెండాను రూపొందించుకుంది. అసలీ సంఘం గురించి ఒకసారి పరిశీలిద్దాం. మొదట్లో ఆంధ్రా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ అధికారుల సంఘం. ఇది 20-2-1950 న ఏలూరులో సొసైటీస్ చట్టం క్రింద రెజి. నం. 21950. కామ్రేడ్ యు.సుబ్బారావు, ఐ.తాయారావు తొలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రారంభమైంది. 1949 నుంచి 2019 దాకా అంటే 70 యేళ్ళ చరిత్రకు ఇప్పుడు మసకలు కమ్మాయి. ఇప్పుడు 20వ అధ్యక్షులుగా బండి శ్రీనివాసరావు కొనసాగుతున్న విషయం విదితమే! ఆంధ్ర రాష్ట్రం 1953 సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు నుండి వేరు చేయబడిన తదనంతరం ఆంధ్ర ప్రభుత్వం G.O.Ms.No.2493 25-11-1954 ప్రకారం 1954 సంవత్సరంలో అసోసియేషన్ గుర్తింపును మంజూరు చేసింది.

1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని (ప్రస్తుత తెలంగాణ) విలీనం చేసి భాషా ప్రాతిపదికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 1957లో రాజధాని కర్నూలు నుండి హైదరాబాద్‌కు మార్చారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆకెళ్ల సత్యనారాయణ మూర్తి, ఆమనగంటి శ్రీరాములు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌కు మారిన తర్వాత అసోసియేషన్ పేరు APNGOS అసోసియేషన్‌గా మార్చారు. రాజధాని బ్రాంచ్ తో సహా 15 జిల్లా స్థాయి శాఖలతో కోట్లాది రూపాయల ఆస్తులతో కళకళలాడుతున్నది. అనేక తాలూకా బ్రాంచ్‌లలో కూడా సొంత కార్యాలయాలున్నాయి. అదే దశలో వివిధ కారణాలతో సంఘం నాలుగు ముక్కలైంది. నాయకులకు ఒకరంటే ఒకరికి గిట్టకపోవడంతో ప్రభుత్వ కనుసన్నల్లోనే వుండే సంఘాలు, నాయకులు పురుడుపోసుకున్నారు. ప్రభుత్వంతో సర్దుకొని పోవడానికి పలు కారణాలున్నాయి. నాయకత్వ అస్తిత్వ తగాదాలున్నాయి. స్థిరాస్తుల గొడవలున్నాయి. అవినీతి కేసుల్లో విచారణలున్నాయి. శాఖాపరమైన విచారణలు ఉన్నాయి. వీటన్నిటినీ బూచిగా చూపుతూ ప్రభుత్వం ఆయా నాయకులను అదుపులో ఉంచుకొంటోంది. ఈ దశలో ఎన్జీఓ సంఘాల ముక్కల పంచన అత్యంత శక్తివంతమైన ఉపాధ్యాయ సంఘాలు సభ్య సంఘాలయ్యాయి. పోరాట పటిమ గల సభ్యులు (ఉపాధ్యాయులు) వున్నా ఒంటరిగా పోరాటాలకు వెళ్లలేని స్థితి.

ఆ వైఖరి విడనాడాలి..

రాష్ట్రంలో ఉద్యోగులకు ఆర్ధికంగా ఊపిరాడని పరిస్థితి. ఉపాధ్యాయులు ఉద్యోగం చేయలేని దుస్థితి. నెలాఖరున జీతం అందుకోలేని దుర్భర స్థితి. వీటన్నిటినీ గుర్తించిన కొన్ని సంఘాలు ఉద్యమబాట పట్టగా ప్రధానమైన ఏపీఎన్జీఓ సంఘం సర్దుబాట పట్టింది. విలువలు తగ్గాయో, ఉద్యోగుల్లో విశ్వసనీయత కోల్పోతోందో, పాలకులకు విశ్వాసంగా ఉండాలని భావించిందో తెలియదు కానీ, ఆ సంఘ విధానం మూలంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అభద్రతా భావం నెలకొంది. అదే అదనుగా ప్రభుత్వం పోరాడే సంఘాలను నిర్వీర్యం చేయడానికి చేయదగినంత చేస్తోంది. తమకు దాసోహమనే నాయకులను పెంచి పొషిస్తోంది. వెన్నుతట్టి ప్రోత్సహిస్తపన్నది. ప్రతిపక్ష పార్టీలు సైతం అయ్యో! ఉద్యోగులకు అన్యాయం జరిగిందంటూనే... తమ్ముళ్లూ! ఇప్పుడు బాగుందా అంటూ వెటకారంగా వెకిలిగా ఉపన్యసిస్తూన్నారు. రానున్న ఎన్నికల్లో మీకు మద్దతిస్తాం, సీపీఎస్ రద్దు గురించి మీ గళం చెప్పమని సీపీఎస్ ప్రాతినిధ్య సంఘాలు రాయబారం చేసినా నవ్వి నోటితో మాట చెప్పకుండా తిరుగుదారి చూపించారు ఒక యువనేత! గత శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వం కొలువుదీరడానికి ఉద్యోగులే కారణమని కూడా ఎత్తిపొడుస్తున్నారు. దాదాపు 18 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల దుస్థితిలోకి నెట్టే వైఖరిని విడనాడి సంఘాల సమన్వయానికి నడుం బిగించాల్సిన బాధ్యత ఆయా నాయకులదే!

ప్రభుత్వం, పార్టీ ఏదైనా సహజ రాజధర్మాన్ని పాటించాలి. రాజ్యాంగ సాక్షిగా చేసిన ప్రమాణాన్ని అమలుచేయాలి. ఉద్యోగుల పట్ల ద్వేషభావం ఏమాత్రం మంచిది కాదు. పోరాటాలు ఉద్యోగులకు కొత్త కాదు, ఉద్యమాల ఉద్భవానికి ఉషోదయంతో సంబంధం లేదు.

-మోహన్ దాస్

రాష్ట్ర కౌన్సిలర్, ఏపిటిఎఫ్ 1938

94908 09909

Advertisement

Next Story

Most Viewed