- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయా?
ధరలు పెరగడంతో డైట్ చార్జీలు సరిపోవడం లేదు. ధరల సూచీ ప్రకారం మెస్ చార్జీలు ఎప్పటికప్పుడు పెంచాలి. బిల్లులను ఏ నెలకానెల అందించాలి. వంట వండడానికి ఏజెన్సీల బదులు శాశ్వత నియామకాలు చేపట్టాలి. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లు ప్రభుత్వ ప్రైవేటు హాస్టళ్లను తనిఖీ చేసేలా ఆదేశాలివ్వాలి. ప్రభుత్వం విద్యకు రాష్ట్ర జీడీపీలో 6 శాతం, బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ 1966లో ఇచ్చిన సిఫారసును అమలు చేయాలి. లేదా మేధావులు పౌరసమాజం, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
విద్య ద్వారానే వికాసం కలిగి, మేధస్సు అభివృద్ధి చెంది మనిషి మహోన్నతుడవుతాడు. మానవ ప్రవర్తనలో మార్పు తెచ్చేది విద్య మాత్రమే. 'విద్య లేని వాడు వింత పశువు' అన్నారు పెద్దలు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్యదే కీలక పాత్ర. అందుకే అన్ని దేశాలలో అధిక నిధులు కేటాయించి విద్య అందరికీ అందేలా చూస్తున్నారు. మన దేశంలో మాత్రం విద్యారంగాన్ని పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. తగినన్ని నిధులు కేటాయించడం లేదు. విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి అనేక కమిషన్‌లు వేశారు. అవి చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నా దేశం వంద శాతం అక్షరాస్యత సాధించలేదు. ఇప్పటికీ 26 శాతం అంటే, 35 కోట్ల మంది నిరక్షరాస్యులుగానే ఉన్నారు.
నాసిరకం భోజనం
ప్రపంచవ్యాప్తంగా 78.1 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉంటే, అందులో సగం మన దేశంలోనే ఉన్నారు. ఇక్కడ విద్య నాసిరకంగా, అరకొర వసతులతో అందుతోంది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చాలా మంది బాలకార్మికులుగా ఉన్నారు. విద్యను అందించే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటోంది. ప్రైవేటు విద్యా వ్యాపారం 'మూడు పువ్వులు ఆరు కాయలుగా' దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, యూనివర్సిటీలలో పోషక విలువలు లేని భోజనం అందిస్తున్నారు. పెరిగే వయసులో నాణ్యత లేని ఆహారం ఇచ్చి వారి ఎదుగుదలకు అడ్డుపడుతున్నారు.
నాసిరకం సరుకుల కారణంగా ఎందరో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. నాణ్యమైన ఆహారం, తాగునీరు, వసతులు అందించాలని వారు దీక్షకు దిగే పరిస్థితి తీసుకువచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ, ముథోల్ ట్రైబల్ రెసిడెన్షియల్, ఆదిలాబాద్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్, కాకతీయ విశ్వవిద్యాలయాలలో సైతం క్వాలిటీ ఫుడ్ అందించడం లేదని విద్యార్థులు మెస్‌లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. రోజూ ఏదో ఒక చోట ఇలాంటి ఘటన జరుగుతూనే ఉంది. విద్యార్థుల భద్రతను గాలికి వదిలేశారు. నాసిరకం ఆహారం తినడం వలన జీర్ణకోశ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, హైపటైటిస్-బి వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఒక ట్రిపుల్ ఐటీ విద్యార్థి జీర్ణకోశ వ్యాధితో మృత్యువాత పడటం విషాదకరం.
ఈ దుస్థితికి కారణాలేమిటి?
తెలంగాణ ప్రభుత్వం అన్ని వసతిగృహాలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని గొప్పలు చెప్పి, కొన్ని నెలలు మాత్రమే అమలు చేసింది. గత ఏడాది నవంబర్ నుండి అన్ని వసతిగృహాలకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారు. అందులోనూ పురుగులు, ముక్కిన బియ్యం వస్తున్నాయని పాఠశాలలు, వసతిగృహాల నిర్వాహకులు చెబుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. ఐదేండ్ల ముందు ఖరారు చేసిన మెస్ చార్జీలనే ఇప్పటికి కొనసాగిస్తున్నారు.
ప్రస్తుత మార్కెట్ ధరలతో పోల్చుకుంటే ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో భోజనం నాణ్యత ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయాయి. వంట ఏజెన్సీ లకు బిల్లులు నెలల తరబడి జాప్యం చేయడంతో వారు నాణ్యత లేని సరుకులను వాడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు వసతి గదులు, కిచెన్ గది, సిబ్బంది, శుభ్రమైన పాత్రలు అందుబాటులో ఉండటం లేదు. పర్యవేక్షణ కొరవడింది. ఎప్పుడో ఒకసారి హడావుడి చేసి, ఉద్యోగులను సస్పెండ్ చేసి, చేతులు దులుపుకొని, శాశ్వాత పరిష్కారం చూపకుండా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
పరిష్కార మార్గాలు
ప్రభుత్వం ప్రకటించినట్లు తక్షణమే నాణ్యమైన సన్న బియ్యం అందించాలి. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 35 రూపాయలు, ఇంటర్ ఉంటే 48 రూపాయల చొప్పున డైట్ చార్జీలు ఇస్తున్నారు. వీటితోనే రోజుకు మూడు పూటలు భోజనం అందించాలి. నెలకు నాలుగుసార్లు చికెన్, రెండు సార్లు మటన్, రోజూ గుడ్డు అందించాలి. ధరలు పెరగడంతో డైట్ చార్జీలు సరిపోవడం లేదు. ధరల సూచీ ప్రకారం మెస్ చార్జీలు ఎప్పటికప్పుడు పెంచాలి. బిల్లులను ఏ నెలకానెల అందించాలి. వంట వండడానికి ఏజెన్సీల బదులు శాశ్వత నియామకాలు చేపట్టాలి. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లు ప్రభుత్వ ప్రైవేటు హాస్టళ్లను తనిఖీ చేసేలా ఆదేశాలివ్వాలి. ప్రభుత్వం విద్యకు రాష్ట్ర జీడీపీలో 6 శాతం, బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ 1966లో ఇచ్చిన సిఫారసును అమలు చేయాలి. లేదా మేధావులు పౌరసమాజం, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
తండా సదానందం
టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
మహబూబాబాద్
99895 84665