- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరువు తగ్గనున్న బడి పుస్తకాలు
స్కూల్ పాఠ్య పుస్తకాల బరువు పెరగడంపై తల్లిదండ్రులు, డాక్టర్లు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావి వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పుస్తకాల బరువును తగ్గించే చర్యలు చేపట్టింది. లోపలి పేజీలకి 70 జీఎస్ఎం కాగితం, కవర్ పేజీలకి 200 జీఎస్ఎం మందం గల కాగితం వాడి పాఠ్యపుస్తకాలు ప్రింట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల రాబోయే విద్యా సంవత్సరంలో పుస్తకాల బరువు తగ్గనుంది.
బడులకు వెళ్తున్న విద్యార్థుల స్కూల్ బ్యాగులు చూస్తుంటే తల్లిదండ్రులుగా మనకు చాలా బాధేస్తుంది. ప్రతిరోజు ఇన్ని పుస్తకాలు మోసుకుంటూ బడికి వెళ్లాలా? ఇవన్నీ ప్రతిరోజు వాడుతారా? కొన్ని పుస్తకాలు తగ్గించుకోండి అని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాలను, విద్యార్థులను కోరుతున్న సందర్భాలను మనం చూస్తుంటాం.
ఇది గాడిద మోత బరువు కాదా?
బ్యాగులో పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు పెట్టుకుని ప్రతి విద్యార్థి ఉదయం బడికి వెళ్తారు. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులతో పోల్చుకుంటే ప్రైవేటు బడులకి వెళ్లే విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు ఎక్కువగా ఉంటుంది. బరువు గల పుస్తకాలను మోస్తూ విద్యార్థులు రెండు, మూడు అంతస్తులు ప్రతిరోజు ఎక్కాల్సి వస్తుంది. అధిక బరువు గల పుస్తకాలను మోస్తూ విద్యార్థులు శారీరక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లతో కూడిన స్కూల్ బ్యాగ్ గరిష్ట బరువు 1, 2 తరగతులకు 1.5 కిలోలకు మించకూడదు, 3 నుండి 5 తరగతులకు 2-3 కిలోలు, 6, 7 తరగతులకు 4 కిలోలు, 8, 9 తరగతులకు 4.50 కిలోలు, పదో తరగతి విద్యార్థులకు 5 కిలోలు మాత్రమే ఉండాలి. కానీ ప్రాథమిక స్థాయిలో 7 కిలోల నుంచి 15 కిలోల వరకు, హైస్కూల్ స్థాయిలో 19 కిలోల వరకు బరువున్న బ్యాగులను బడి పిల్లలు ప్రతిరోజు బడికి మోసుకెళ్తున్నారని సమాచారం.
బరువుకు ప్రధాన కారణం
పాఠ్య పుస్తకాల బరువు పెరగడానికి ప్రధాన కారణం పుస్తకాల తయారీలో మందం కాగితం వాడడమే. లోపలి పేజీల్లో 90 జీఎస్‌ఎం (గ్రామ్ ఫర్ స్క్వేర్ మీటర్), కవర్ పేజీలకు 220 జీఎస్ఎం కాగితాన్ని ఇప్పటివరకు వాడుతున్నారు. ఇలా కాగితం అందం పెంచడం వల్ల సుమారుగా ఒక్కొక్క తరగతికి ఒక కిలోగ్రామ్ వరకు బరువు పెరిగింది. దీంతో ప్రభుత్వానికి 50 కోట్ల అదనపు భారం. ప్రస్తుతం ఒకటో తరగతి విద్యార్థి పాఠ్య పుస్తకాలు బరువు 1.991 కి.గ్రా, 5వ తరగతి పార్టీ పుస్తకాల బరువు 2.253 కి.గ్రా,10 వ తరగతి 5.373 కి.గ్రా లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల రాబోయే విద్యా సంవత్సరంలో నూతన పాఠ్యపుస్తకాల బరువు ఒకటవ తరగతి కి 1.408 కి.గ్రా, ఐదో తరగతి కి 1.759 కి.గ్రా, పదవ తరగతి కి 4.19 కి.గ్రా.లుగా ఉండనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులకు పుస్తకాల బరువు 25% నుంచి 30% కి తగ్గనుంది. 3000 మెట్రిక్ టన్నుల పేపర్ వినియోగం కూడా తగ్గనుంది. గత సంవత్సరం 11,000 మెట్రిక్ టన్నుల పేపర్ వాడగా, ఈసారి 8,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వాడనున్నారు. తక్కువ పేపర్ వాడడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
ఏడాదికి రెండుసార్లు అందిస్తే మేలు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం వల్ల విద్యార్థుల సౌలభ్యం కోసం పాఠ్యపుస్తకాలను ద్వి భాషలో అంటే తెలుగు, ఆంగ్లంలతో పాటు పార్ట్ 1, పార్ట్ లుగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఈ పుస్తకాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఏప్రిల్ 30 వరకు పార్ట్ 1 పాఠ్య పుస్తకాలు, జూలై 31 వరకు పార్ట్ 2 పాఠ్యపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతీ పాఠ్యపుస్తకంపై గతంలో వలె క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ పాఠ్యాంశాల వీడియోలను డిజిటల్ కంటెంట్‌ను చూడవచ్చు.
కో కరిక్యులర్ అంశాలు నేర్పాలి!
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేధావులు ఉపాధ్యాయ సంఘాలు, డాక్టర్లు హర్షిస్తున్నారు. ప్రతిరోజు అన్ని పాఠ్య పుస్తకాలు కాకుండా రోజువారీగా కొన్ని పాఠ్య పుస్తకాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ బడుల్లో మాదిరిగా ప్రైవేటు బడుల్లో కూడా ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలే ఉపయోగించేలా చర్యలు తీసుకుంటే ప్రైవేటు బడుల్లో చదివే విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతీ నెల నాలుగో శనివారం విధిగా నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించి కో కరిక్యులర్ అంశాలు కూడా విద్యార్థులకు నేర్పేలా చర్యలు తీసుకోవాలి.
పాకాల శంకర్ గౌడ్
98483 77734