ఓటరు పండుగ

by Ravi |   ( Updated:2024-05-11 00:30:35.0  )
ఓటరు పండుగ
X

‘‘అన్నా.. మీ ఓటరు స్లిప్పులు చూపించండన్నా’’ అని అడిగారు. ‘‘ఎందుకు’’ అన్నాను. ‘‘స్లిప్పుకు రెండు వేలిస్తున్నామన్నా’’ అన్నారు. వచ్చిన వారిలో నాకు తెలిసిన కుర్రాళ్ళున్నారు. ‘‘ఎప్పుడైనా నేను డబ్బులు తీసుకున్నానా’’ అడిగాను. ‘‘లేదన్నా. తీసుకోలేదు’’ అన్నారు. నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు.

వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి హడావిడిగా మా పనిమనిషి వచ్చి ‘‘ఈపూట పనికి రాలేనమ్మా. వెంటనే వెళ్ళిపోవాలి’’ అంది. ‘‘ఏమి ఎందుకు రావు’’ అంది మా చెల్లెలు. ‘‘సాయంత్రం...పార్టీ వాళ్ళ మీటింగుందమ్మా. మనిషికి అయిదొందలు ఇస్తున్నారంటా’’ అంది. ‘‘సరే’’ అంది మా చెల్లెలు.

సహజంగా మా పనమ్మాయి పలకరిస్తే తప్ప మాట్లాడదు. మర్నాడు పొద్దున్నే పనికి వచ్చిన ఆమె మొహం వెలిగిపోతోంది. నవ్వుతూ పనిచేసేస్తోంది. ‘‘సభకు వెళ్ళావా డబ్బులు ఇచ్చారా’’ అడిగింది మా చెల్లెలు.

‘‘వెళ్ళానమ్మా..నాకు అయిదొందలు ఇచ్చినారు. నా కూతురు పెరుక్కు నేసింది’’ అంది. మా చెల్లెలు కూడా సంతోష పడిపోయింది. ‘‘అంతే కాదమ్మా,, రాత్రి మా ఇంటికొచ్చి ...పార్టీ వాళ్ళొక రెండు వేలు, ...పార్టీ వాళ్ళొక రెండు వేలు ఇచ్చేసి పోయినారు’’ అంది ఆనందపడిపోతూ.. ‘‘మా ఇంటాయనకు నాలుగు వేలు, నాకు నాలుగు వేలు వచ్చినాయమ్మా’’ అంది మళ్ళీ తనే.

ఇలా ‘‘రెండు పార్టీల దగ్గరా డబ్బులు తీసుకుంటే ఇద్దరికీ ఓట్లు ఎట్లా వేస్తావు’’ ప్రశ్నించింది మా చెల్లెలు అమాయకంగా. ఫిలాసఫర్లా ఒక నవ్వు నవ్వేసింది మా పనిమనిషి.

చాలా ఏళ్ళ క్రితం ..

‘‘ఎవరికి ఓటేశావు పెద్దాయన’’ ఓ వ్యక్తిని అడిగాడు పోల్ సర్వే నిర్వహిస్తున్న విలేకరి. ‘ఒకాయన మా ఊరికి రోడ్డు వేయిస్తానన్నాడు. మరొకాయన మా ఊరికి బస్సు వేయిస్తానన్నాడు రోడ్డు ఉంటే కదా బస్సు వచ్చేది. అందుకుని రోడ్డువేయిస్తాను అని చెప్పినాయనకు ముందు ఓటు గుద్దేసినా. ఒట్టి రోడ్డు ఉంటే ఏం లాభం బస్సు ఉంటే కదా రోడ్డు ఉపయోగం. అందుకుని బస్సు వేయిస్తానన్న మరొకాయనకు కూడా ఓటు గుద్దేసినా’ అన్నాడు.

రహస్య ఓటింగ్ కదా. ఓటు ఎవరికి వేసేది తెలియదు మరి!

- రాఘవ శర్మ,

94932 26180

Advertisement

Next Story

Most Viewed