ఓటరు చైతన్యమే.. ప్రజాస్వామ్యానికి విజయం

by Ravi |   ( Updated:2024-04-20 01:00:51.0  )
ఓటరు చైతన్యమే.. ప్రజాస్వామ్యానికి విజయం
X

నేడు మన తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో జరుగుతున్న పార్లమెంట్‌కు శాసనసభ ఎన్నికల ప్రక్రియలో గల అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహణకు వివిధ పార్టీల అభ్యర్థులు పెట్టే ఖర్చు దేశంలోనే ప్రథమ స్థానంలో తెలుగు రాష్ట్రాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తర భారతదేశంలో అభ్యర్థుల ఖర్చుల కన్నా, దక్షిణ భారతదేశంలోని అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు పదుల రెట్లు ఎక్కువగా ఉన్నాయని పలువురి విశ్లేషణలు, గణాంకాలు మనకు తెలియ జేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఒక పురపాలక సంఘం చైర్మన్ ఎన్నికలకు పెట్టే ఖర్చుతో బీహార్ లాంటి రాష్ట్రంలో ఎంపీగా గెలవచ్చునని ప్రతీతి. హైదరాబాద్ పరిసర మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పెట్టే ఖర్చు, ఉత్తరాదిన ఏ రాష్ట్రంలోనైనా ఎమ్మెల్యేగా గెలవడానికి సరిపోతుందన్నది అనేక సర్వేల వాస్తవం.

మంచోడి స్థానే సంచోడు..

ప్రజాస్వామ్య విధానంలో ప్రత్యక్ష ఎన్నికలే ప్రధాన ఘట్టం. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన పాత్రధారుడు, ముఖ్య వినియోగదారుడు ఓటరు మహాశయుడు మాత్రమే. ఓటరు చైతన్యంతో, విచక్షణతో వ్యవహరించడం ద్వారానే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. అప్పుడే ప్రజాస్వామ్య వాస్తవ ఫలాలు ప్రజలకు చేరువ అవుతాయి. కానీ గత మూడు దశాబ్దాలుగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజకీయాల్లో అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు పథకం ప్రకారం ఎన్నికల ఖర్చును పెంచి, సామాన్యుడు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు కుట్ర కొనసాగుతుంది. అభ్యర్థుల ఎంపికలో కూడా గుణగణాల కన్న ఆర్థిక స్థోమతలే ప్రామాణికంగా ముందుకు సాగుతున్నాయి.

ఎన్నికల సమయంలో కూడా ఓటర్లను మరింతగా ప్రలోభ పెట్టే విధానాల్లో భాగంగా మద్యంతో పాటు ఓటు కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నేడు దానినే ఎన్నికల ఆనవాయితీగా, ఆచారంగా, సంప్రదాయంగా మార్చివేశారు. అందువలన ఒక్క డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన ఎస్సీ, ఎస్టీ, నియోజకవర్గాలలో మాత్రమే రాజకీయ పార్టీలు తప్పని సరై ఆయా వర్గాల అభ్యర్థులను కొనసాగిస్తున్నారన్నది మనం గమనించాలి. మిగిలిన అన్ని నియోజకవర్గాలలో రాజకీయ పార్టీలు మంచోడికి బదులుగా సంచోడి కోసం వెతుకుతున్నాయి. డబ్బుల సంచి లేనందున, ఎంత మంచి అభ్యర్థులైనా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు తాముగా విరమించుకుని అనర్హులుగా మిగిలిపోయి అభ్యర్థులకు అనుచరులుగానే మిగిలిపోతున్నారు.

ప్రశ్నించే హక్కు కోల్పోతూ

అలాగే అభ్యర్థుల చరిత్రలను సైతం పరిశీలిస్తే, అవినీతికి దగ్గరగా, నిజాయితీకి దూరంగా అన్ని పార్టీల అభ్యర్థులు మెజారిటీగా ఉన్నారన్నది వాస్తవం. ఇది నేరుగా వారికి వారే, వారి ప్రసంగాలలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలలో స్పష్టంగా మనకు తెలుస్తున్నది. మరి ఇలాంటి పరిస్థితిలో అభ్యంతరం చెప్పలేక గత్యంతరం లేని ఓటర్లు ఒకవైపు ఉంటే, ఆయా పార్టీలు మావే అన్నట్టు అంకితమైన అమాయకపు కార్యకర్తలు మరోవైపు ఉన్నారు. వీరిని గెలుపే ధ్యేయంగా అనేక ప్రలోభాలతో మభ్యపెడుతూ, ఉసిగొల్పుతున్న పార్టీ నాయకత్వాలు. అంతేకాక వారి గెలుపు కోసం అభ్యర్థులు చేస్తున్న శుష్క వాగ్దానాలతో, ఉచిత పథకాల నినాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు. తమ ఓటుకు రేటు పెంచి ఓటర్లను తికమక పెడుతున్న పార్టీల తీరు ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.

డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుకు ఉన్న విలువ(గౌరవం) పెరగవలసిన దశలో దాని విలువ(ధర)ను పెంచుతున్న పార్టీల తీరులో అభ్యర్థులు, ఓటర్లు ఎవరికివారు సమర్థించుకుంటున్నారు. అభ్యర్థి మాటల్లో ఓటరు ఓటుకు డబ్బులు అడుగుతున్నాడు మేము ఇస్తున్నాము అని అభ్యర్థులు అంటుంటే... ఓటరు మాత్రం ఐదేళ్ల వరకూ మళ్లీ కనిపించని అభ్యర్థి దగ్గర ఇదన్నా పొందుదాం అని, అభ్యర్థి ఇస్తున్నాడు కాబట్టే మేము తీసుకుంటున్నాము అని ఓటరు అంటున్నాడు. వెరసి కొనుక్కొన్న ఓట్లతో గెలిచిన అభ్యర్థి ఈ ఎమ్మెల్యే,ఎంపీ పదవి తన ఇష్టారాజ్య పాలనకు,ఆర్థిక దోపిడీకి ప్రజలు ఐదేళ్లకు తనకు ఇచ్చిన అనుమతి గా భావిస్తున్నారు. వందకు,వెయ్యికి,మందుకు,మాంసానికి తలొగ్గిన ఓటర్లు ఐదేళ్ల కాలంలో గెలిచిన అభ్యర్థిని వారి,వారి అవసరాల కోసం ప్రశ్నించడానికి గల అర్హతను కోల్పోతున్నారు.

ఎన్ని చట్టాలు తెచ్చినా..

నేటి సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు,ఆయా అభ్యర్థుల అర్హతలు, అనర్హతలను బట్టి ఓటు వేసేందుకు నిర్ణయించుకునే ప్రక్రియలో ఓటరు పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎన్నికల గంపలో ఉన్న కాయలన్నీ రకరకాలుగా చెడిపోయి ఉన్న స్థితిగా ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒకటి ఏరుకునేందుకు వెదుకులాటలో ఉన్న ఓటరు, తక్కువ చెడిపోయిన కాయను వెతుక్కునే పనిలో ఉన్నారన్నది వాస్తవం అంటే ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు ఒకరికి ఒకరు తీసిపోని అవినీతి, అక్రమాలతో ఉన్నవారైనపుడు ఓటరు దానిలో కూడా తక్కువ ప్రమాదం, తక్కువ అవినీతి ఉన్న అభ్యర్థి వైపు చూస్తారన్నది మనం గమనించాలి. మరింతగా ఆలోచిస్తే ఎన్నికల్లో అభ్యర్థులందరూ డబ్బులు పంచుతున్నారు కాబట్టి, మా కుటుంబంలో ఓట్లను కూడా ఆన్నిపార్టీలకు పంచుతామంటున్న కొంతమంది ఓటర్ల తీరు కూడా గెలుపు, ఓటములను తారుమారు చేస్తాయన్నది కూడా మనం గమనించాలి.

ఎన్నికల ప్రక్రియలో ఓటు చేర్పులు నుండి, ఓటు తొలగింపు, ఓటు వినియోగం వరకు గల అనేక అక్రమాలు, ఎన్నికలలో అవినీతి, నేరస్థుల ప్రవేశం, ఓటర్ల కొనుగోలు, వివిధ వాగ్దానాలతో అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెట్టే తీరు, దొంగ ఓట్లు పోలింగ్, తదితర ఎన్నికల అక్రమాలను కట్టడి చేయడంలో గత దశాబ్దాలుగా ఎన్ని చట్టాలు తెచ్చినా అక్రమాలను నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతూనే ఉన్నదనడం ముమ్మాటికీ వాస్తవం.

నిజాయితీగా ఓటు వినియోగించుకోండి!

ఓటు కోసం ఓటరుకు అభ్యర్థి డబ్బు పంచడాన్ని నేరం అంటూ తప్పుపడుతున్న ఎన్నికల సంఘం, అదే సమయంలో పాలక, ప్రతిపక్ష పార్టీలు, నేతలు మేము గెలిస్తే, మమ్మల్ని గెలిపిస్తే ప్రతివారికి పెన్షన్ ఐదు వేలు ఇస్తాం, జీతాలు పెంచుతాం, ఉద్యోగాలు ఇస్తాం, బాకీలు రద్దు చేస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తాం అంటూ అనేక హామీలు ఇవ్వడాన్ని ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రక్రియగా ఎందుకు భావించడం లేదో సమాధానం లేని వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది.

వ్యవసాయంలో రైతు సరైన విత్తనం ఎంపికలోనే మంచి పంటతోపాటు తన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే మంచి కోర్సు ఎంపికలోనే విద్యార్థి బంగారు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే ఎన్నికలలో మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం ద్వారా మాత్రమే ఆయా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, అభ్యున్నతికి దోహద పడుతుందని ప్రజలు, ఓటర్లు గ్రహించాలి. అదే నిజమైన ఓటరు చైతన్యం.మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఆన్నిఅసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో అభ్యర్థుల నుండి వచ్చే తాత్కాలిక ప్రయోజనాలతో కూడిన పథకాల పేరుతో పెట్టే ప్రలోభాలకు తల ఒగ్గకుండా నిర్భయంగా, నిజాయితీగా మంచి అభ్యర్థికి ఓటు వేసి, గెలిపించు కోవాలి.

- జి.వీరభద్రాచారి

గ్రామస్వరాజ్య సాధన సమితి అధ్యక్షుడు

63017 96606

Advertisement

Next Story

Most Viewed