- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటు ఆదాయం కాదు.. ఆయుధం!
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యానికి ప్రతీకలుగా ఉన్న ఎన్నికల ప్రక్రియలో ఓటర్లుగా ఉన్న ప్రజలందరూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఓటును తాత్కాలిక ఆదాయ ప్రలోభాలకు లొంగకుండా తమ వాస్తవ సామాజిక, ఆర్థిక స్థితిగతుల మార్పుకోసం పనిచేసే నిజమైన ప్రజాప్రతినిధిని, రాజకీయ పార్టీలను ఎన్నుకొనే ఆయుధంగా ఓటర్లు మార్చుకోవాలి. ఆ దిశగా ఓటర్లు నేటి తెలంగాణా శాసనసభ ఎన్నికలలో అవినీతి, అన్యాయ పాలకులను కట్టడి చేసే విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
దర్శన భాగ్యం కలిగించని నియంతలు!
గత దశాబ్దాలుగా అనేక పార్టీల నేతృత్వంలో నడచిన తెలంగాణా, తన స్వయంపాలనలో గత తొమ్మిదేళ్లుగా సాగిన పాలనకు నేడు ప్రజలు మరలా పట్టం కడతారా? మార్పును కోరుకుంటారా? అన్న సందేహంలో నేడు మొత్తం రాజకీయ విశ్లేషకులు కొట్టుమిట్టాడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులకు వస్తే కొట్లాడి, అనేకమంది ప్రాణ త్యాగాలతో, ఉద్యమాలతో వచ్చిన, తెచ్చుకున్న తెలంగాణాలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు జరగాల్సినంత మేలు జరగలేదన్న ఆవేదన, ఆగ్రహం కూడా ప్రజలలో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయిన తెలంగాణా ఆదాయంలో మెరుగ్గా ఉన్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తాత్కాలిక పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రచారంలో ముందు ప్రగతిలో వెనుకబడిన తీరుగా ఉందని అనేక గణాంకాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణా రాష్ట్ర విభజనలో ప్రధాన నినాదంగా ఉన్న నిధులు, నీళ్ళు, నియామకాలు, అనే ఈ మూడు అంశాలు అమలులో వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. త్యాగాలు చేసిన అనేక మందికి మొండి చెయ్యి చూపి తెలంగాణా విభజనను వ్యతిరేకించిన అనేక మంది నేడు పాలనలో ప్రథమ స్థాయిలో ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కుటుంబ పాలన, వారికోసం కేసీఆర్ తాపత్రయం మరింతగా ప్రభావం నేడు ప్రజలలో వ్యతిరేక భావం కనిపిస్తుంది. సంపన్న రాష్ట్రంగా గొప్పలు చెప్పిన తండ్రీ, కొడుకులు నేడు అప్పులో, ఆంధ్రప్రదేశ్‌తో వెనుక ముందుగా పోటీ పడుతున్నారు. తన తొమ్మిదేళ్ళ పాలనలో ప్రజలకు కనీసం నెలలో ఒక్కసారైనా కలిసే అవకాశం ఇవ్వని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ దేశంలో ప్రథమంగానూ, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారు. వీరిరువురు కూడబలుక్కున్నట్టు కనీసం ఎమ్మెల్యే, ఎంపీలకు, మంత్రులకు కూడా దర్శన భాగ్యం కలిగించని ప్రజాస్వామ్య నియంతలుగా జనం చెప్పుకుంటున్నారు. వెనకటికి రాజుల కాలంలో ప్రజా ఫిర్యాదుల కోసం గంట మోగిస్తే రాజు దర్శనంతో సమస్య పరిష్కారం జరిగేది. కానీ నేటి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ అవకాశం ప్రజలకు వీరు ఇవ్వలేదు.
హస్తానికి కలిసొచ్చే అంశం!
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతినైనా ప్రజలు క్షమిస్తారేమో కానీ, వాటి నిర్మాణ నాణ్యత లోపాన్ని, తద్వారా మున్ముందు ప్రమాదాలను ప్రజలు, రైతులు నిశితంగా ఈ ఎన్నికలలో గమనిస్తారన్నది వాస్తవం. ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యం, అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకులు వంటి అనేక అంశాలు నేటి ఎన్నికలలో విద్యార్థులు, నిరుద్యోగులు, వారి కుటుంబాలు గుర్తు చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో పరిపాలనా వికేంద్రీకరణకు నమూనాలుగా ఉన్న పంచాయితీరాజ్ వ్యవస్థ, ఆయా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే నూతన పంచాయితీరాజ్ చట్టం ద్వారా గ్రామ ప్రభుత్వాలను నిర్జీవం చేస్తూ వాటికి నిధులు, విధులు, అధికారాలు లేకుండా అధికారుల కనుసన్నలలో ఉక్కు పాదం మోపిన ప్రస్థుత పాలనను స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులుగా అప్పులు పాలైన, అసువులు బాసిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ ప్రజాప్రతినిధులు నేటి ఈ ఎన్నికలలో వారి పాత్రను స్పష్టం చేయాలి. అవినీతితో మెక్కిన సొమ్ముతో ముందుకొస్తున్న అభ్యర్థులను ప్రజలు గమనించాలి. గత దశాబ్దంగా అధికారం, నాయకత్వం, ఐకమత్యం లేని కాంగ్రెస్ పార్టీ నేడు యువ నాయకుడు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలను, ఓటర్లను జాగృతం చేయడంలో ముందుకు సాగుతున్న తీరు ఆ పార్టీ ముందంజకు దోహదపడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణా రాష్ట్ర ప్రజలలో ఒకింత మనసులో మాట మనం గమనిస్తే వారిలో మెజారిటీ ప్రజల భావన చూస్తే, తెలంగాణా తెచ్చానంటున్న కేసీఆర్‌కు రెండుసార్లు అధికారం ఇచ్చినం కదా? అలాగే తెలంగాణా రాష్ట్రంను ఇచ్చిన, ఇచ్చామంటున్న సోనియమ్మ కాంగ్రెస్‌కు ఒకసారి అధికారం ఇచ్చి రుణం తీర్చుకుందామనే రీతిలో ఆలోచిస్తున్న ప్రజల తీరు కాంగ్రెస్ పార్టీకి కలిసిరావచ్చు.
మన జీవితాన్ని మార్చుకునే ఆయుధం!
అలాగే ఈ ఎన్నికలలో బీజేపీ కూడా ఒక దశలో ముందు ఉన్నప్పటికీ కేసీఆర్, బీజేపీ, ఎంఐఎంల అంతర్గత రాజకీయ ఒడంబడికలు, ఎత్తుగడలు ఆయా పార్టీ క్యాడర్‌నే కాదు నాయకత్వాల నడుం విరిచాయని చెప్పవచ్చు. అంతేకాక ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటలు కూడా నేడు కూలిపోయాయి. ఉనికి కోసం వారి నాయకుల వెంపర్లాట విస్మయాన్ని కలిగిస్తుంది. నేడు కొద్ది, కొద్దిగా బహుజన నినాదంతో నాయకత్వ పటిమతో, బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పుంజుకుంటున్న తీరు కూడా అభినందనీయం. అయితే వచ్చే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ రాజకీయాలపై మాత్రమేకాదు, రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా గట్టిగానే ఉంటుందన్నది మనం గమనించాలి. ఏదీ ఏమైనా ఎన్నికలంటే నెలరోజుల సందడిగా కాకుండా ప్రజలు తమ ఐదేళ్ల భవిష్యత్తుగా ఈ ఎన్నికలను గుర్తించాలి. అనేక రకాలుగా ప్రలోభ పెట్టే, పార్టీలను, నాయకులను పక్కన పెట్టీ, నియోజకవర్గంలో మన సమస్యలకు స్పందించగలిగిన అభ్యర్థిని మనం ఇష్టపడి గెలిపించుకోవాలని గ్రహించాలి. ఈ ఎన్నికలు ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికోసమే అన్నది ఆయావర్గాలు గుర్తించాలి. ఆయా వర్గాలలో విద్యావంతులు, మేధావులు ఆ విధంగా వారిని చైతన్యం చేయాలి. వందకీ, వెయ్యికి, మందుకూ, మాంసానికి లొంగకుండా నీతిగా, నిజాయితీగా ఓటేసి, ఓటు ఆదాయం కోసం కాకుండా మన జీవితాలను మార్చుకునే ఆయుధమని చెప్పిన అంబేడ్కర్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆశిద్దాం.
జి. వీరభద్రాచారి
చైర్మన్, గ్రామస్వరాజ్య సాధన సమితి
63017 96606