ధర్మ రక్షణలో..రాజీలేని పోరు..!

by Ravi |   ( Updated:2024-09-18 00:45:57.0  )
ధర్మ రక్షణలో..రాజీలేని పోరు..!
X

విశ్వహిందూ పరిషత్... ఈ పేరు వినగానే ప్రతి హిందువుకు మది సంబరపడుతోంది. ప్రపంచంలో ఏ మూలాన ఉన్నా.. హిందువు అనే వాడు విశ్వహిందూ పరిషత్ తన గొడుగు అని భావిస్తాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని సంరక్షించాలనే ఏకైక లక్ష్యంతో పురుడు పోసుకున్న సంస్థ విశ్వహిందూ పరిషత్. 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్.. 2024 శ్రీకృష్ణ జన్మాష్టమికి షష్టిపూర్తి పూర్తి చేసుకుంది.

హిందువుల స్వాభిమానం కోసం.. హిందువుల హక్కుల సాధన కోసం కోసం ఆవిర్భవించిన సంస్థ విశ్వహిందూ పరిషత్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయోధ్య ఉద్యమంలో దేశవ్యాప్తంగా విస్తరించిన సంస్థ.. ప్రతి పల్లెకూ పాకింది. గడిచిన ఆరు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుంది. ఇస్లాం, క్రైస్తవంతో పాటు కమ్యూనిజం బారి నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు వెన్ను చూపని పోరాటం చేస్తూ హిందువులందరికీ పెద్దన్నగా నిలబడింది.

వీహెచ్‌పీ ఉద్యమాలు..

‘హిందువునని గర్వించు- హిందువుగా జీవించు’ అనే నినాదంతో విశ్వహిందూ పరిషత్ అనేక ఉద్యమాలు చేపట్టి, విజయాలు సాధించింది. హిందూ స్వాభిమానాన్ని కాపాడే క్రమంలో లెక్కకు మించి ఉద్యమాలు నిర్వహించింది. అందులో ప్రధానంగా ప్రపంచానికి తెలిసిన అయోధ్య ఉద్యమం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. ఈ పోరాటం యావత్ హిందూ సమాజాన్ని ఏకతాటిపై నడిపించి, ఐక్యతను చాటుకుంది. కులాలు, వర్గాలు, ప్రాంతాలవారీగా ఎవరికి వారు చీలికలు, పేలికలుగా ఉన్న హిందువులంతా సంఘటితమై జైశ్రీరామ్ నినాదాలతో కదం తొక్కారు. కరసేవ పేరుతో కలిసికట్టుగా ముందుకు సాగారు. తన మన, ధన పూర్వకంగా ఉద్యమంలో పోరాట పటిమ ప్రదర్శించారు. 1984లో సాధువు సంతుల సారథ్యంలో అయోధ్య ఉద్యమానికి బీజం పడింది. నాటి నుంచి తీర్పు వచ్చేవరకు న్యాయ పోరాటం చేసి, భారత అత్యున్నత న్యాయస్థానంలో విజయం సాధించింది. రామ శిలా పూజ, రామ జ్యోతి, శ్రీరామ జయ జయ రామ అనే మహామంత్రం జపం, హనుమాన్ చాలీసా పారాయణం వంటి అనేక ఉద్యమాలు చేపట్టింది. 1990, 1992లలో కరసేవ నిర్వహించి రామభక్తులు హిందూ శక్తి ప్రదర్శించారు. దేశంలోని ప్రతి పల్లెలో హిందూ చైతన్య జ్యోతిని రగిలించిన అయోధ్య ఉద్యమం అజరామరం. లక్షలాది మంది కరసేవకులు అయోధ్య చేరుకొని పోరాటంలో పాల్గొనగా.. కోట్లాది మంది హిందువులు వారికి మద్దతుగా నిలవడం గొప్ప విషయం. అసంఖ్యాకంగా కర సేవకులను హత్యలు చేసినా.. వెన్ను చూపని సంకల్పంతో ముందుకేగి విజయం సాధించిన గొప్ప ఉద్యమం అయోధ్య పోరాటమని చెప్పడం గర్వకారణం.

ఏడుకొండలను కాపాడి..

హిందువుల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించిన నిర్ణయంపై విశ్వహిందూ పరిషత్ మండిపడింది. ఏడు కొండల వైభవాన్ని దెబ్బతీసేలా విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా పోరుబాట పట్టింది. ఏడుకొండలను మూడు కొండలుగా మారుస్తామంటూ విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకునే దాకా ఉద్యమించింది. తిరుమల తిరుపతి పవిత్రతను ఎప్పటికప్పుడు కాపాడుతూ ఏడు కొండల వైభవాన్ని దేదీప్యమానంగా దిశ దశల వ్యాప్తి చేస్తోంది. అలాగే తెలంగాణలో అత్యంత పవిత్రమైన యాదాద్రి మందిర నిర్మాణంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణాలు చేపడితే.. తీవ్ర ఆందోళన చేపట్టిన విశ్వహిందూ పరిషత్.. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేసింది. ఇది గొప్ప విజయంగా చెప్పవచ్చు.

హిందూ సమాజానికి వెన్నుదన్నుగా..

హైందవజాతి సంరక్షణకే ప్రాధాన్యమిస్తూ హిందూ సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది విశ్వహిందూ పరిషత్. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ.. అనునిత్యం సుశిక్షితులైన లక్షల మంది కార్యకర్తలతో సమాజంలో పనిచేస్తోంది. మతమార్పిడి, లవ్ జిహాద్, గో రక్ష, సత్సంగ్, దేవాలయాల పరిరక్షణ, భారతీయ సంస్కృతి సంప్రదాయాల రక్షణ విషయంలో రాజీలేని పోరాటం చేస్తూ హిందూ సమాజానికి విశ్వహిందూ పరిషత్ వెన్ను దన్నుగా నిలుస్తోంది. ప్రతి వ్యక్తిలో హిందుత్వం స్వాభిమానాన్ని రగిలింపజేసే భారతీయ విలువలకు ఊరిపోస్తోంది. హిందువులు మనుగడ సాధించాలంటే.. భారత్‌లో బంగ్లాదేశ్ పరిస్థితి ఏర్పడక ముందే ప్రతి హిందువు చైతన్యవంతం కావాలని కోరుకుంటుంది. హైందవ గొప్పతనం గుర్తెరిగి హిందూ జీవన విధానం విశ్వవ్యాప్తం చేయాలని వీహెచ్‌పీ విజ్ఞప్తి చేస్తుంది.

- పగుడాకుల బాలస్వామి

99129 75753

Advertisement

Next Story