శవాల దారిలో ఓట్ల వేట

by Viswanth |
శవాల దారిలో ఓట్ల వేట
X

కరోనా సెకండ్ వేవ్ ప్రజలను కకావికలం చేస్తూనే ఉన్నది. తెలంగాణలోనే కాదు. దేశమంతా అదే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో రోజువారీ కొత్త కేసులు పదులు, వందలు దాటి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. టెస్టింగ్ కిట్లు, ఆస్పత్రులలో బెడ్‌లు, ఆక్సిజన్, మందులు మొదలు టీకాలదాకా జనం క్యూ కడుతున్నారు. అన్నింటికీ కొరత ఏర్పడింది. చివరకు చనిపోయిన తర్వాత దహనక్రియల కోసం కూడా శ్మశానాలలో వెయిటింగ్ తప్పడంలేదు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులు మాత్రం ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. ఇటు కరోనా మరణాలు.. అటు నేతల ఓట్ల వేట.. ఇదీ రాష్ట్రంలోని తాజా పరిస్థితి. గతేడాది తొలి వేవ్‌ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి ఈసారి మాత్రం ప్రకటనలకే పరిమితమయ్యారు. స్వయంగా ఆయనే కరోనా బారిన పడ్డారు. కాబోయే ముఖ్యమంత్రి అని టీఆర్ఎస్ శ్రేణులు ఒకింత గర్వంగా చెప్పుకునే కేటీఆర్ కూడా క్వారంటైన్‌‌లోనే ఉండిపోయారు. పరిపాలనా వ్యవహారాలను చూసుకునే ప్రధాన కార్యదర్శి సైతం వైరస్ బారిన పడి చాలా రోజులపాటు 'వర్క్ ఫ్రం హోమ్'కే పరిమితమయ్యారు. ఇక వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సైతం రెండు రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. వీరెవ్వరూ మీడియా ద్వారా ప్రజలకు సరైన గైడెన్స్ ఇవ్వడం లేదు. సెకండ్ వేవ్ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలపై మార్గదర్శకాలు కరువయ్యాయి.

బాధ్యత లేని నేతలు

కరోనా సెకండ్ వేవ్‌లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నేతలకు చలనం లేదు. బాధ్యతను విస్మరిస్తున్నారు. ఊపిరి అందక ఆస్పత్రికి వచ్చినవారు మెట్ల దగ్గరే చనిపోతున్నారు. సకాలంలో వైద్యం అందక కన్నతల్లి ఒడిలోనే ఓ కొడుకు కన్నుమూశాడు. ఆస్పత్రులలో బెడ్‌లు దొరకక ఆటోలలో, ఆంబులెన్సులలోనే కొందరు ప్రాణం వదులుతున్నారు. కండ్ల ముందే ఆయువు పోతూ ఉంటే కుటుంబ సభ్యులు నిస్సహాయులవుతున్నారు. పైసలు, పైరవీలు తప్పనిసరి అయింది. చివరకు శవాన్ని తీసుకెళ్లడానికి పరమపద వాహనాలలాంటివి కూడా కరువే. భార్య శవాన్ని భుజం మీదనే శ్మశానందాకా మోసుకెళ్లాడో భర్త. ఆస్పత్రిలో చికిత్స దొరకదనుకుని బిల్డింగు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడో బాధితుడు. ఇంట్లోనూ మాస్కు పెట్టుకోవాల్సిందేనన్న నిబంధన వచ్చేసింది. అయినా ప్రజా ప్రతినిధులకు చీమకుట్టినట్లు కూడా లేదు.

సర్కారు మొద్దు నిద్ర

పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. బాధిత కుటుంబాలతో పలరింపులు లేవు. ప్రభుత్వం నుంచి సాయం లేదు. స్పందించే గుణం అంతకన్నా లేదు. సెకండ్ వేవ్ ఇంతటి ఉత్పాతాన్ని సృష్టిస్తున్నా ఎమ్మెల్యేలు స్వంత నియోజకవర్గాన్ని వదిలి ఎన్నికల ప్రచారానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సర్కారు ఆస్పత్రులలో సౌకర్యాలు లేవు. ప్రైవేటు ఆస్పత్రులలో లక్షల రూపాయల కుమ్మరించుకునే స్థాయి లేదు. పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రజారోగ్య వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. ఓట్ల నాడు దండాలు పెట్టిననేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉందో ముఖ్యమంత్రికి తెలుసా అనే సందేహాలు నెలకొన్నాయి. వాస్తవ పరిస్థితిని అధికారులు వివరించడం లేదా? లేక వివరించడానికి సాహసించడంలేదా? లేక 'అంతా నేను చూసుకుంటాను'అని లైట్‌గా తీసుకున్నారా? క్లారిటీ కరువైంది.

కరువైన ముందుచూపు

సెకండ్ వేవ్ దూసుకొస్తోందంటూ వైద్యారోగ్య శాఖ అధికారులు ముందుగానే అప్రమత్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నప్పుడే సరిహద్దులో జాగ్రత్తలు తీసుకోవాల్సినా మొక్కుబడిగానే ప్రవర్తించారు. నిత్యం వందలాది కేసులు పుట్టుకొస్తున్నాయి. కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు కూడా హెచ్చరించింది. ఆ దిశగా కార్యాచరణ లేదు. చివరకు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో కేసులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ అనే ఫార్ములా గురించి మంత్రి ఈటల రాజేందర్ సహా వైద్యారోగ్య శాఖ అధికారులు గొప్పగా చెప్పుకున్నారు. ప్రాథమిక స్థాయిలోనే టెస్టులు చేస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. టెస్టింగ్ కిట్లకే తీవ్ర కొరత ఏర్పడింది. ముందుగా టోకెన్లు ఇచ్చే విధానం అమలుకు వచ్చింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే విధానం అటకెక్కింది. కంటైన్‌మెంట్ జోన్లు కాగితాలకే పరిమితమయ్యాయి. వివిధ శాఖల మధ్య సమన్వయమే లేకుండా పోయింది. వైద్య మంత్రి ఒకటి చెప్తుంటే అధికారులు దానికి భిన్నంగా చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియడంలేదు.

అడుగడుగునా ఉల్లంఘనలు

మాస్కులు లేకుంటే వెయ్యి రూపాయల ఫైన్ అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ డిస్టెన్స్ అంటూ ప్రజలకు నీతులు చెప్పింది. నేతలే దాన్ని బుట్టదాఖలా చేశారు. నెల రోజుల వ్యవధిలో కేవలం నాలుగు కేసులే పోలీసులు నమోదు చేశారంటే ఎంత చిత్తశుద్ధితో ఇది అమలవుతుందో అర్థమవుతోంది. ఎన్నికల పేరుతో వందలాది మందిని పార్టీల నేతలు సమీకరిస్తున్నారు. వ్యాన్ మీద నుంచి మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రచారం చేస్తున్నారు. అమలు చేయాల్సిన పోలీసులు పక్కనే ఉంటున్నారు. నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. 'కొవిడ్ నిబంధనలు' అంటూ సర్క్యులర్ జారీ చేసిన ఎన్నికల సంఘమూ ప్రేక్షకపాత్రే వహిస్తోంది. వేలాది మందిని వైరస్ బాధితులుగా చేస్తోంది. నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వమే నిర్లక్ష్యంగా ఉంది.

ప్రజలకు భరోసా ఏది?

ప్రతీ నియోజకవర్గంలో పదుల సంఖ్యలో ప్రజలు కరోనాతో చనిపోతున్నారు. ఆపదలో, ఆందోళనలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించే నేతలు కరువయ్యారు. ఆక్సిజన్ కోసం, బెడ్‌ల కోసం, రెమిడెసివిర్ మందుల కోసం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో కేటీఆర్, కవిత తదితరులకు ట్విట్టర్ ద్వారా వెళ్తున్న సందేశాలే నిదర్శనం. ఇన్ని సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా 'ప్రభుత్వం అండగా ఉంటుంది'అనే ధీమాను కల్పించలేకపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను శిరోధార్యంగా పాటించే ప్రజలకు కూడా ఈసారి అలాంటి భరోసా కరువైంది. తొలివేవ్ సందర్భంగా కేసీఆర్ టీవీల ద్వారా ధైర్యం కల్పించారు. ఈసారి అలాంటిది కరువైంది. కరోనా వచ్చినా ఏంకాదు.. భయమే సగం చంపేస్తోంది.. వైరస్‌కంటే భయంతోనే చనిపోతున్నారు.. అంటూ వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ప్రజలలో నెలకొన్న భయాన్ని తొలగించడానికి ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ ఇప్పటివరకు చొరవ తీసుకోలేదు. ఎన్నికల ప్రచారం ఫొటోలను, వీడియోలను నిత్యం ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా షేర్ చేసుకునే ఎమ్మెల్యేలు 'భయపడకండి.. అండగా ఉంటాం..'అని వీడియో సందేశం ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం తరఫున ప్రజలను గైడ్ చేసేదెవరు అనే సందేహం తలెత్తింది. ముఖ్యమంత్రి మాటను శిరోధార్యంగా భావించే లక్షలాది మంది ప్రజలు ఆ సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు.

హైకోర్టు కోపగించినా

రాష్ట్రంలోని తాజా పరిస్థితులేంటో ప్రజలకే కాదు హైకోర్టుకు కూడా అంతుచిక్కడంలేదు. వాస్తవ పరిస్థితికి ప్రభుత్వం చెప్పే లెక్కలకు పొంతన లేదు. శ్మశానాలలో 24 గంటలూ శవాలు కాలుతూనే ఉన్నాయి. తప్పుడు నివేదికలు, గోల్‌మాల్ లెక్కలు అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు తూర్పారపట్టింది. నైట్ కర్ఫ్యూ పెడతారా లేక నిర్ణయం తీసుకోమంటారా అని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పటిదాకా కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటివి ఉండవంటూ వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్, మరికొద్దిమంది మంత్రుల మాటలు పటాపంచలయ్యాయి. లాక్‌డౌన్ విషయంలోనూఇప్పుడు అలాంటి అనుమానాలే నెలకొన్నాయి. అందుకే నెల రోజులకు సరిపడా రేషన్‌ నిల్వ చేసుకుంటున్నారు. మే నెల మొదటి వారంలో లాక్‌డౌన్ ఉంటుందని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. 'ప్రజలే మా బాస్‌‌లు' అనే సీఎం కేసీఆర్, కేటీఆర్ లాంటి మంత్రులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? లాక్‌డౌన్ ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయమే కావచ్చు. ప్రజలే స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. వ్యాపారులే ఆంక్షలు పెట్టుకుంటున్నారు. ఆక్సిజన్, రెమిడెసివిర్ లాంటివి బ్లాక్ మార్కెట్‌ అవుతున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నాయి. బిల్లు కట్టకుంటే డెడ్‌బాడీలు కూడా ఇవ్వడంలేదు. మంత్రి ఈటల రాజేందర్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆవేదనను కోరుకోవడంలేదు. ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు ఎప్పుడొస్తారు? ఎప్పుడు రివ్యూ చేస్తారు? ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎలా ఆదుకుంటారు? ఏం భరోసా కల్పిస్తారు? ఇవీ ఇప్పుడు సామాన్యుల్ని తొలుస్తున్న ప్రశ్నలు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story