- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'విశ్వగురు' విచిత్ర నీతి
'కరోనా తొలి వేవ్‌లో సక్సెస్ అయ్యాం. టీకాల తయారీలో సత్తా చాటాం'అంటూ గొప్పగా చెప్పుకున్న ప్రధాని మోడీ సెకండ్ వేవ్ సంక్షోభంలో మాత్రం తన బాధ్యత నుంచి తప్పుకున్నారు. 'ఆరోగ్యం' రాష్ట్రాల పరిధిలోని అంశమంటూ కట్టడి విషయంలో కాడి ఎత్తేశారు. తొలి వేవ్ సందర్భంగా గతేడాది జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్, అన్‌లాక్, కంటైన్‌మెంట్ జోన్ల మార్గదర్శకాల మొదలు తాజాగా వ్యాక్సిన్ తయారీ వరకు అన్ని నిర్ణయాలనూ మోడీయే తీసుకున్నారు. మొత్తం నియంత్రణను తన దగ్గరే పెట్టుకున్నారు. ఎన్-95 మాస్కు మొదలు పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, హెచ్‌సీక్యూ మాత్రలు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, చివరకు వ్యాక్సిన్ వరకు.. ఇలా అన్నింటిపై నియంత్రణను తన దగ్గరే ఉంచుకున్నారు. కానీ, సునామీలా కరోనా సెకండ్ వేవ్ దూసుకొస్తున్న సంక్షోభ సమయంలో మాత్రం ఒక్కటొక్కటిగా అన్నింటినీ వదిలించుకుంటున్నారు. ఏడాదికాలంలో వచ్చిన ఖ్యాతి మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో నిర్ణయాధికారం కూడా తనదే. ఇప్పటివరకూ ఇచ్చిన ఉచిత టీకాల పంపిణీకి కర్త, కర్మగా వ్యవహరించారు. సుమారు ఏడు కోట్ల డోసులను విదేశాలకు ఇవ్వడం ద్వారా 'విశ్వగురు'అనిపించుకున్నారు. కరోనా కేసులు వేల నుంచి లక్షలలోకి, మృతుల సంఖ్య వందల నుంచి వేలలోకి పెరిగిపోతున్న సమయంలో కట్టడిపై దృష్టి, బరువు బాధ్యతలను రాష్ట్రాలపైకి నెట్టారు. కేంద్ర స్థాయిలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ఉండవని తేల్చిపారేశారు. కేసులు పెరుగుతూ ప్రజలు ఇబ్బందులలో చిక్కుకోవడంతో రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించక తప్పలేదు.
ఒట్టి మాటలేనా?
ప్రధాని మోడీ తరచూ 'సబ్ కే సాథ్... సబ్ కా విశ్వాస్''కోఆపరేటివ్ ఫెడరలిజం''టీమ్ ఇండియా'లాంటి పదాలను వల్లె వేస్తూ ఉంటారు. తొలి వేవ్ సమయంలో అన్నీ తానై వ్యవహరించిన మోడీ ఇపుడు సెకండ్ వేవ్‌ను తుపాను అని చెబుతూనే ఎందుకు బాధ్యత పడడం లేదనేది ప్రశ్నార్థకం. సెకండ్ వేవ్‌లో ఏ రాష్ట్రంలో కేసులు పెరిగినా దానికి తాను జవాబుదారీ కాదని, ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అనే అప్రోచ్ తీసుకున్నారు. 'ఆరోగ్యం స్టేట్ సబ్జెక్ట్'అంటూ చేతులు దులుపుకున్నారు. తొలి వేవ్‌లో వచ్చిన సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మోడీ ఇప్పుడు సెకండ్ వేవ్ సంక్షోభాన్ని మాత్రం రాష్ట్రాల నిర్వాకంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.
వ్యాక్సిన్ పంపిణీలో ద్వంద్వ నీతి
ఇప్పటివరకు జరిగిన ఉచిత వ్యాక్సిన్ పంపిణీ తనతోనే సాధ్యమైందని మోడీ చెప్పుకున్నారు. ఇప్పుడు 18-44 ఏళ్లవారి విషయంలో మాత్రం బాధ్యతను రాష్ట్రాలకు వదిలేశారు. వ్యాక్సిన్ తయారీ, సరఫరా, ధర తదితరాలన్నింటినీ సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలకే వదిలేశారు. వ్యాక్సిన్‌ను అందరికీ అందించాలనే ఉద్దేశమే ఉన్నట్లయితే కేంద్రమే పెద్దన్న పాత్రలో బడ్జెట్‌లో కేటాయించిన రూ. 35వేల కోట్ల నుంచి సమకూర్చవచ్చు గదా అని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ మోడీని ప్రశ్నించడంలేదు. సుమారు 70 కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్ అందించాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను అందించింది. తలా రూ. 500 చొప్పున (రెండు డోసులకు కలిపి) ఖర్చు పెటటి కేంద్రమే ఉచితంగా ఇచ్చే వెసులుబాటు ఉంది. ఇపుడు ఆ బాధ్యత నుంచి తప్పుకుని రాష్ట్రాల ప్రభుత్వాలపై భారం మోపింది.
అప్పడో మాట..ఇప్పుడో మాట
మే ఒకటి నుంచి 18-44 ఏళ్ళ వయసువారు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని మోడీ ప్రకటించారు. ఇందుకనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని సీరం, భారత్ బయోటెక్ సంస్థలను ఆదేశించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోడానికి వీలుగా ఆ రెండు సంస్థలకు రూ. 4,500 కోట్ల ప్రజా ధనాన్ని సాయంగా అందించారు. ప్రైవేటు సంస్థలకు ఏ ప్రాతిపదికన ఆర్థిక సాయం అందించారని ఏ రాష్ట్రమూ ప్రశ్నించలేకపోయింది. ప్రజా అవసరాల కోసమే వ్యాక్సిన్ కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ఆ రెండు సంస్థలను తన నియంత్రణలోకి ఎందుకు తీసుకోలేదు అని కూడా ప్రశ్నించలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి రూ. 150కు ఒక్కో డోసును విక్రయించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అదే ధరలో అందించాలని సీరం సంస్థను మోడీ ఎందుకు ఆదేశించలేకపోయారు? 'టీమ్ ఇండియా'స్ఫూర్తికి అనుగుణంగా ఏ ప్రభుత్వానికి సరఫరా చేసినా ఒకే ధర ఉండాలని ఎందుకు నిర్ణయించలేకపోయారు.
అసాధ్యమనే అనుకున్నారా?
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అనేక 'ఉచితం'పథకాలను ప్రకటిస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్‌ను కూడా ఉచితంగా ఇవ్వాలనుకుంటే రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఆర్థికంగా గుదిబండగా మారుతుంది. కరోనా కష్టకాలంలో అంతంతమాత్రంగా వస్తున్న స్వీయ ఆదాయ వనరుల నుంచి వెచ్చించేంత ఆర్థిక స్థోమత లేదు. ప్రజలే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చినట్లయితే ఓటు బ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే భయం. ఒక వ్యక్తి వ్యాక్సిన్ కోసం రూ. 800 ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రైవేటులోనైతే రూ. 1200 జేబులో నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసం ఉచితంగా ఇవ్వడమా లేక ప్రజలపైనే భారం వేయడమా అనేది రాష్ట్రాల్లోని అధికార పార్టీలను వేధిస్తోంది. అందరికీ టీకా ఇవ్వడం అసాధ్యం అని తలిచి మోడీ చేతులు ఎత్తేశారా? లేక రాష్ట్రాలను నిస్సహాయ పరిస్థితిలోకి నెట్టి తాను రాజకీయంగా మేలు పొందాలనుకున్నారా? మరి ఈ రాజకీయ వైకుంఠపాళిలో కరోనా పాములు మింగుతున్న సామాన్యలు పరిస్థితి ఏమిటి? వారి అమూల్య ప్రాణాలకు జవాబుదారీ ఎవ్వరు?