- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత రేటు..
నిరుద్యోగం అనేది భారతదేశ ఆర్థిక రంగాన్ని సవాలు చేస్తూనే ఉన్న ఒక క్లిష్టమైన సమస్య. స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా నేడు నిరుద్యోగ పరిస్థితిని దేశం దారుణంగా ఎదుర్కొంటున్నది. స్వతంత్ర ఆలోచనా సంస్థ అయిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నుండి తాజా డేటా ప్రకారం, భారతదేశంలో నిరుద్యోగిత రేటు 2024 జూన్‌లో 9.2 శాతంగా ఉంది, ఇది 2024 మేలో 7 శాతం నుండి గణనీయంగా పెరిగింది. CMIE యొక్క కన్స్యూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే ప్రకారం జూన్ 2024లో మహిళా నిరుద్యోగం జాతీయ సగటు కంటే 18.5 శాతానికి చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో 15.1 శాతం పెరిగింది. అదే సమయంలో, పురుషుల నిరుద్యోగం 7.8 శాతంగా ఉంది, ఇది జూన్ 2023లో 7.7 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంది.
గ్రామీణ భారతంలో నిరుద్యోగిత రేటు సగటున 7 శాతం కంటే ఎక్కువగా ఉండగా, పట్టణాల్లో 8 నుంచి 10 శాతం ఉన్నట్టు ఈ డేటా వెల్లడించింది. కార్మిక భాగస్వామ్యం కూడా 42.9 నుంచి 39.8 శాతానికి పడిపోవడంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరగడం లేదని, ఏండ్లకేండ్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం, ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతున్నదని CMIE ఆందోళన వ్యక్తం చేసింది. లేబర్ పార్టిసిపేషన్ రేటు (LPR) మేలో 40.8 శాతం నుండి 2024 జూన్‌లో 41.4 శాతానికి, జూన్ 2023లో 39.9 శాతానికి పెరిగింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు మేలో 6.3 శాతం నుంచి జూన్‌లో 9.3 శాతానికి పెరిగింది. పట్టణ నిరుద్యోగిత రేటు 8.6 శాతం నుంచి 8.9 శాతానికి పెరిగింది.
ఉపాధి రంగాలకు బడ్జెట్‌లో కోత...
2024-25 బడ్జెట్‌లో జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధుల కోత పెట్టింది. అదేవిధంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయడంపై శ్రద్ధ చూపకపోవడం, జాతీయ జీవనోపాధి మిషన్, గ్రామీణ గృహ నిర్మాణ పథకం, తదితర సంక్షేమ రంగాలకు కూడా కేంద్రం బడ్జెట్ కేటాయింపుల ప్రభావం ఉపాధి కల్పనపై తీవ్రంగా పడుతోంది. స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా పథకాలు అటకెక్కడంతో నిరుద్యోగిత రేటు అమాంతం పెరిగిపోయింది.
ప్రభుత్వరంగ సంస్థల్లో కోతలు..
కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాల్లో కూడా కోత పెడుతుండటంతో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. దేశంలోని మొత్తం 389 ప్రభుత్వరంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగులు ఉండగా, 2022 లో ఈ సంఖ్య 14.6 లక్షలకు తగ్గింది. ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌లోనే గత తొమ్మిదేండ్లలో లక్షా 81వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయా రు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటూ ఇచ్చిన హామీ ప్రకారం లెక్కేసుకున్నా.. గడిచిన పదేండ్లలో కొత్తగా 20 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాలి. అయితే, ప్రభుత్వ రంగంలో కేంద్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. అంటే ఏడాదికి సగటున 70 వేల పోస్టులను మాత్రమే నింపింది. ఇచ్చిన హామీలో ఇది 0.35 శాతం కూడా కాదు
నిరుద్యోగ భారతం ఇలా..
భారతదేశ జనాభా 140 కోట్లు, పనిచేయగల మొత్తం శ్రామికశక్తి 85 కోట్లు. అర్హతకు తగిన ఉద్యోగం కోసం వేచిచూస్తూ ఇతర పనులు చేస్తున్నవారు 32.8 కోట్లు, పనికి తగిన వేతనం పొందుతున్న వారు 30.4 కోట్లు, డిగ్రీ పూర్తయ్యి ఇప్పటికిప్పుడు ఉద్యోగం కావలసినవారు 21.8 కోట్లు... డిగ్రీ పూర్తయిన 42% మందికి ఉద్యోగాలు లేనే లేవు. పదేండ్లలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం అక్షరాల 7 లక్షలు . కేవలం 5 కిలోల ఉచిత రేషన్ నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపుతుందో అర్థం చేసుకోవాలి.
ఉపాధిని అందించే రంగాలు...
ఉపాధిని అందించేవి ప్రధానంగా మూడు రంగాలు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు. ప్రైమరీ సెక్టార్‌లో వ్యవసాయం, సెకండరీ సెక్టార్‌లో తయారీ, తృతీయ రంగంలో సేవలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో, త్రిభుజాకార ప్రాథమిక రంగంలో ఉపాధి తక్కువగా, ద్వితీయ, తృతీయ రంగాల్లో ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతుంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే, భారత ప్రభుత్వం క్రోనీ క్యాపిటలిస్ట్ విధానమే, దీనివల్లే భారత దేశంలో తయారీ రంగం చాలా బలంగా మారడం లేదు. MSME రంగానికి వ్యాపారాన్ని సులభతరం చేయడం అతిపెద్ద సమస్యగా మారుతోంది.
నిరుద్యోగ పరిష్కార వ్యూహాలు..
విద్య నైపుణ్యాభివృద్ధి నాణ్యమైన విద్య, వృత్తి శిక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం, డిమాండ్ నైపుణ్యాలపై దృష్టి సారించడం. అలాగే ఆర్థిక వైవిధ్యం వ్యవసాయంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి తయారీ, పర్యాటకం సేవల వంటి రంగాలలో వృద్ధిని ప్రోత్సహించడం. అలాగే జాబ్ క్రియేషన్ ఇనిషియేటివ్స్ ఉపా ధి అవకాశాలను పెంచడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను చిత్త శుద్ధితో అమలు చేయాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయాలి, నిర్మాణరంగం, సంబంధిత పరిశ్రమలలో ఉద్యోగాలను సృష్టించాలి. గ్రామీణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సేవలలో ఉద్యోగాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, పౌర సమాజం మధ్య సమన్వయం అవసరం. నిరుద్యోగం మూల కారణాలను పరిష్కరించడం ద్వారా, భారతదేశం మరింత సమగ్రమైన, స్థిరమైన వృద్ధి నమూనా సృష్టించగలదు.
డా. బి. వి. కేశవులు. ఎండి. సైకియాట్రీ.
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659