ఆ దుబారా పెట్టుబడే!

by Ravi |   ( Updated:2023-03-17 19:15:01.0  )
ఆ దుబారా పెట్టుబడే!
X

పెళ్లివిందుకు, పార్టీలకు, గృహ ప్రవేశాలకు లక్షలూ, కోట్లు ఖర్చుపెట్టడం, వైభవోపేతంగా పంక్షన్లు చేయడం డబ్బులు వృధా చేయడమే అనేది మామూలు మాట. అంతంత ఖర్చుపెడుతున్నవారు తమ సంపదను ప్రదర్శించుకోవడానికి కాకుండా దాన్ని ఇన్వెస్ట్‌మెంటుగా లెక్కిస్తున్నారు. అది వారి ఆర్థిక స్థితిని తెలపడానికి ఉపయోగపడుతుంది నిజమే. కానీ ఫంక్షన్‌కి హాజరైన కొందరైనా తన బిజినెస్‌కి కస్టమర్లుగా మారే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పెట్టిన ఖర్చు తన శక్తిసామర్ధ్యాలను బహిరంగం చేస్తుంది. అంటే కస్టమర్లకు నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ నమ్మకం కూడా బిజినెస్‌లో ఓ పెట్టుబడే కదా. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి ఈ దుబారా కూడా పెట్టుబడిగా మారుతుందన్న మాట!

టీవల నేను మాదాపూర్‌లో ఓ ఫంక్షన్‌కి వెళ్లాను. 50 మంది మించరేమో అనుకున్నాను. నియర్ అండ్ డియర్స్‌ని మాత్రమే పిలుస్తున్నానని ఆహ్వానితులు చెప్పారు. నాకు కూడా దగ్గరి వాళ్లు కావడంతో ఫ్యామిలీతో వెళ్లాను. అక్కడికి వెళ్లిన తర్వాత 500 మందికి పైగానే హాజరయ్యారు. పూజా కార్యక్రమాలు పూర్తి కాగానే తీర్ధ ప్రసాదాలు.. ఆ తర్వాత ఇంకేముంది జోరుగా దావత్. అది కూడా భారీ స్థాయిలోనే అడిగినోళ్లకు అడిగినంత.. తాగినోళ్లకు తాగినంత. తిన్నోళ్లకు తిన్నంత. అక్కడ లేని వెరైటీ లేదు. అది గృహ ప్రవేశ మహోత్సవమే. అంటే ఇంటిని కొనుగోలు చేసేందుకే భారీగా ఖర్చవుతుంది. ఇక చేతిలో చిల్లిగవ్వ మిగలదు. కానీ ఫంక్షన్ కూడా అదే స్థాయిలో ఖర్చు పెట్టి చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఖర్చు ఇన్వెస్ట్‌మెంట్‌గా మారుతూ..

ఏడాది క్రితమే వాళ్లింట్లో పెళ్లి జరిగింది. అది కూడా రంగరంగ వైభోవమే. దాదాపు ఖర్చు రూ. కోటికి పైగానే. ఏడాది తిరగకముందే ఇల్లు, గృహప్రవేశం.. ఇది ఎలా సాధ్యం? నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్ స్టేటస్ అతి గొప్పదేమీ కాదు. అప్పు చేసి ఇల్లు కొనడం సర్వసాధారణం. నలుగురిని పిలిచి భోజనాలు పెడితే సరిపోతుంది. కానీ ఇంత గొప్పగా ఫంక్షన్ చేయడం వెనుక రహస్యమేంటి? సగటు ఉద్యోగి లేదా వ్యాపారి ఎవరైనా ఖర్చు తగ్గించుకోవడానికి మొగ్గు చూపిస్తారు. వైభవోపేతంగా ఫంక్షన్ చేయడం వెనుక ఆంతర్యమేమిటో బోధ పడలేదు. ఏడాదిలోనే ఇంత మార్పునకు అవకాశాలేమిటి, సంపాదన ఏమిటి? అంటూ నాలో నేనే ప్రశ్నలు వేసుకున్నాను.

ఇక ఈ విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాల్సిందేనని అక్కడే బాగా పరిచయం ఉన్న మరొక బంధువును అడిగాను. ఏడాదిలోనే ఇంత ఖర్చు పెట్టి చేయడమంటే డబ్బులు వేస్ట్ చేయడమే కదా అన్నాను. వేస్ట్ ఎలా అవుతుంది అని తిరిగి ప్రశ్నించారు. దిమ్మదిరిగే ఈ సమాధానంతో కూడిన ప్రశ్న పెద్ద చర్చకే దారి తీసింది. ఈ ఖర్చును ఇన్వెస్ట్‌మెంట్ గా ఎందుకు అనుకోకూడదు? తన ఆర్థిక స్థితిగతిని తెలిపేందుకు ఉపయోగపడుతుంది. తాను ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, అది లాభాల బాటన నడిపిస్తుందని వచ్చిన ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు కదా! అంటే ఫంక్షన్‌కి హాజరైన కొందరైనా తన బిజినెస్‌కి కస్టమర్లుగా మారే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పెట్టిన ఖర్చు తన శక్తిసామర్ధ్యాలను బహిరంగం చేస్తుంది. అంటే కస్టమర్లకు నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ నమ్మకం కూడా బిజినెస్‌లో ఓ పెట్టుబడి కాదా అంటూ అసలు విషయాన్ని చెప్పేశారు. తాను చేసే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి ఈ దుబారా కూడా పెట్టుబడిగా మారుతుందన్న మాట!

పెళ్లి వేడుక కూడా.. బలనిరూపణే

కొద్ది రోజుల క్రితం ఎల్బీనగర్ దగ్గరలో ఓ పెళ్లికి వెళ్లాను. ఆదివారం రాత్రి రిసెప్షన్. వేలాది మంది హాజరయ్యారు. రిసెప్షన్ వేదిక దగ్గరి కంటే ఆ పక్కనే ఉన్న హాల్ లోనే వందలాది మంది ఉన్నారు. ప్రతి టేబుల్ దగ్గర ఐదారుగురు ఉన్నారు. లిక్కర్ ఫుల్.. అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ ఐటెమ్స్ సర్వ్ చేశారు. అక్కడి లిక్కర్ ఖర్చు కనీసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది. పెళ్లి రిసెప్షన్‌లోనే అడిగినంత మందు, తిన్నంత తిండి.. అనేక రకాలు. అంతా హైఫై. ఓ అమ్మాయి తండ్రి పెళ్లి చేస్తున్నాడంటే ఖర్చు అధికమన్న భావన కలుగుతుంది. కానీ ఈ పెళ్లిలో మాత్రం హాజరైన ఒక్క మనిషికి రూ.2 వేలకు పైగానే ఖర్చయ్యిందనుకుంటాను. అప్పుడే వామ్మో.. ఇంత వైభవంగా పెళ్లి చేశారంటూ సగటు వ్యక్తులు చర్చించుకున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టడం వెనుక కూడా పెద్ద మతలబే దాగి ఉన్నది. ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు, పెద్ద పెద్ద లీడర్లంతా హాజరయ్యారు. ఆ పెళ్లి ఓ ఉద్యోగ సంఘం నాయకుడి ఇంట్లో కావడంతో ఈ సందడి. అంటే తన బలాన్ని చూపించేందుకు ఈ ఖర్చుకు ఎంత మాత్రం వెనకడుగు వేయలేదన్న మాట. కాలం కలిసొస్తే ఎక్కడి నుంచీ టికెట్ ఇచ్చినా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికేనని అర్థమైంది. ఇంతకంటే బల నిరూపణ మరొకటి ఏం ఉంటుందో చెప్పండి. అంటే ఓ పెళ్లి వేడుక కూడా ఇన్వెస్ట్మెంట్‌గా మారింది. రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కూడా ఈ దుబారా ఖర్చు పెట్టుబడిగా మారింది.

కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకే..

ఇంటా బయటా.. ఎక్కడైనా డబ్బు వెదజల్లడం ద్వారానే కీర్తిప్రతిష్టలు లభించే కాలమిది. ఏదో ఒక మంచి పని చేయడం ద్వారా, మంచి మాట ద్వారానో విశ్వాసాన్ని పొందలేని దుస్థితి. తన బలమేమిటో ప్రదర్శించడం ద్వారానే ఆకట్టుకునే రోజులివి. అది ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య.. ఏ రంగమైనా సరే. దాని మీద ఆధారపడే వారంతా ఎవరి నమ్మకాన్ని చూరగొనడానికైనా ఈ దుబారా మీదనే ఆధారపడాల్సి వస్తున్నది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దివాలా తీశాడని ప్రచారం జరిగితే ఇంకేమైనా ఉంటుందా మరుసటి రోజే దగ్గరి బంధువులు కూడా అందనంత దూరంగా వెళ్లిపోతారు. ఇక కస్టమర్లంతా ఒక్కసారిగా మీద పడి వేధించడం కామన్. అందుకే ఎంత నష్టాల్లో, ఎంత కష్టాల్లో ఉన్నా తన బలాన్ని ప్రదర్శించడం ద్వారానే కస్టమర్ల నమ్మకాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలోనే చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా రూ.లక్షలు, రూ.కోట్లు వెచ్చించి కార్పొరేట్ ఆఫీసులను నడుపుతున్నాయి. వారి దగ్గర మందీ మార్బలాన్ని రంగంలోకి దించుతున్నాయి. హంగూ ఆర్భాటాలను చూడడంతోనే కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ రియల్ ఎస్టేట్ కార్పొరేట్‌కి వెళ్లినా అవసరానికి మించిన ఉద్యోగులు దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరి వర్క్ స్పేస్ కాస్లీగా కనిపిస్తుంది. ఈ కాస్లీ వేస్ట్ తోనే ఆ కంపెనీ విలువ పెరుగుతున్నది. చౌటుప్పల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కంపెనీలు కూడా హైటెక్స్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోనే కార్పొరేట్ ఆఫీసులు నడిపిస్తున్నాయి. సదాశివపేట దగ్గర ప్లాట్లు అమ్మే సంస్థలు కూడా గచ్చిబౌలి, నానక్ రాంగూడ ప్రాంతాల్లోనే ఆఫీసులు తెరిచాయి. అన్నింటి ముందు రూ. కోట్లు విలువజేసే ఖరీదైన కార్లు దర్శనమిస్తాయి. ఆ దృశ్యాలు, నిర్వహణ.. అంతా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ గానే చూడాలి.

ఆహార్యంతోనూ విలువ

ఉన్నోడికి పెద్ద పీట వేసి కూర్చోబెడతారంటూ పెద్దలు సామెతగా చెప్తుంటారు. కానీ 100 శాతం అది నిజమే. కనీసం ఉన్నోడిలా కనిపించాలి. బలిసినోడిలా మారాలి. అంటే వేషం, భాషలో మార్పు కనబడాలి. ఒంటి మీద డ్రెస్సు కూడా విలువను పెంచుతున్నది. ఎంత కాస్లీ, ఎంత మంచి బట్టలు తొడుక్కుంటే అంత గౌరవాన్ని ఇచ్చే సమాజమిది. నీకు అవసరం లేకపోయినా.. స్థోమత లేకపోయినా అవసరానికి మించి ఖర్చు చేసి ఆహార్యాన్ని మార్చుకోవాల్సిందే. అవునన్నా కాదన్నా ఇదే నిజం. రూ. కోట్లు వెనుకేసుకున్నా, బ్యాంకు లాకర్లతో కిలోల కొద్దీ బంగారం మూలుగుతున్నా నీ డ్రెస్సు బాగా లేకపోతే ఆదరించే, మాట్లాడే వ్యక్తులు ఉంటారనుకోవడం కష్టమే. అందుకే ఇంట్లో ఏం లేకపోయినా ఫర్వాలేదు. కానీ వేసుకునే డ్రెస్సు, చేతిలో ఖరీదైన ఫోన్ ఉండాల్సిందే. ఖరీదైన బైక్ లేదంటే కారులో జర్నీ చేయాల్సిందే. ఎదుటి వ్యక్తిని నమ్మించడం అనడం కంటే మోసగించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు నీ దగ్గరున్నప్పుడే లాభాలు. ఏ రంగంలోనైనా వాస్తవాలను వెల్లడించడం ద్వారా సక్సెస్ అవుతారనుకోవడం అసాధ్యంగా మారుతున్నది. అవతలి వ్యక్తిని నమ్మించడానికి కావాల్సిన మాటలే కాదు.. చేష్టలు కూడా ఇప్పుడు అనివార్యంగా మారింది. ఇది మంచికా, చెడుకా అనేది సమాజానికే వదిలేయాల్సిందే. ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించాల్సింది కూడా సమాజమే. కానీ వాస్తవాలతో అధిక సంపాదన అనేది అవాస్తవం.

శిరందాస్ ప్రవీణ్​కుమార్

8096677450

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story