కట్టప్పలకు'గిరాకీ'రాదు!

by Ravi |   ( Updated:2022-09-03 14:55:07.0  )
కట్టప్పలకుగిరాకీరాదు!
X

టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ, ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ నాయకులని పార్టీలో చేర్చుకున్నారో అప్పటినుంచి రచ్చ మొదలైంది. ఊహించని విధంగా నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో నాయకుల మధ్య గొడవలు నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మాదిరిగా ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పోరులో డబ్బు, అధికారం ఉన్న నేతలు టీఆర్ఎస్​లో ఆధిపత్యం చెలాయిస్తుండగా, పోరులో తట్టుకోలేనివారిని కాంగ్రెస్, బీజేపీ చేరదీస్తున్నది. ఒకప్పుడు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే పార్టీలు మారేవారు. కానీ, ఇప్పుడు కార్యకర్తలు సైతం నోరు వెళ్లబెట్టేలా కప్పదాట్లు ఉంటున్నాయి. ప్రజల మేలు కోసం, ప్రజల మంచికే తాను పార్టీ మారాననే సాకు చెబుతున్నారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో సొంత పార్టీ నుండి ఇద్దరు లేదా ముగ్గురి పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టం. పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా కుటుంబంలో అయినా కేసీఆర్ తనకు తానే సాటి. సమయానుకూలంగా నలుగురికి ప్రయోజనం అనుకున్నప్పుడు మాత్రం పంచభూతాలు అడ్డుపడినా ఇక ఆగడు అనేది జగద్విదితం. కేసీఆర్​కి ఒక లెక్క ఉంటుంది. జనవరి 26న 19 జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలను, మూడు జిల్లాలకు ఎంపీలను, రెండు జిల్లాలకు ఎమ్మెల్సీలను, మూడు జిల్లాలకు జడ్పీ చైర్ పర్సన్ లను , ఒక జిల్లాకు మాజీ ఎమ్మెల్యేను, ఐదు జిల్లాలకు సీనియర్ నాయకులను నియమించారు. పూర్తి కమిటిని ప్రకటించలేదు. పార్టీ అవిర్భవించిన‌ 21 ఏళ్లలో ఒకటి, రెండుసార్లకు మించి పూర్తిస్థాయి జిల్లా కమిటీలు వేయలేదని పార్టీ నేతలే అంటున్నారు. రాష్ట్ర కమిటీ, పొలిట్‌ బ్యూరోను చివరిసారిగా 2010లో ఏర్పాటు చేశారు.

అదే కమిటీ దాదాపు నాలుగేళ్ల పాటు పనిచేసింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం రద్దు చేసింది. చాలాకాలంగా వాయిదాలు వేస్తూ 2017లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీ వేయలేదు. 2009 మాదిరిగానే మరోమారు జిల్లా కమిటీలు లేకుండానే 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి అఖండ విజయాన్ని సాధించింది. ఇందులో నిజం ఎంతోగాని వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ సీట్లు గల్లంతు అవుతాయనే భయంతో, గెలుపు, ఓటమీలపై 'పీకే' ఇచ్చిన లీక్స్​తో పోటాపోటీగా నాయకులను ఆకర్షించే కార్యక్రమం మొదలైంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలలోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి, ఉద్యమంలో కీలకంగా పని చేసి, ఎలాంటి పదవులు లేని నిరుద్యోగ యువతే టార్గెట్​గా పావులు కదుపుతున్నారు.

ఆయన పెట్టిన చిచ్చుతోనే

వ్యూహకర్త ప్రశాంత్​కుమార్ (పీకే) పెట్టిన చిచ్చుతో ప్రతి నియోజకవర్గంలో సిట్టింగులతో పొసగలేని, ప్రాధాన్యం లేని నాయకులు అంగడిలో సరుకుల్లా అమ్ముడుపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ, ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ నాయకులని పార్టీలో చేర్చుకున్నారో అప్పటినుంచి రచ్చ మొదలైంది. ఊహించని విధంగా నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో నాయకుల మధ్య గొడవలు నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మాదిరిగా ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పోరులో డబ్బు, అధికారం ఉన్న నేతలు టీఆర్ఎస్​లో ఆధిపత్యం చెలాయిస్తుండగా, పోరులో తట్టుకోలేనివారిని కాంగ్రెస్, బీజేపీ చేరదీస్తున్నది. ఒకప్పుడు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే పార్టీలు మారేవారు. కానీ, ఇప్పుడు కార్యకర్తలు సైతం నోరు వెళ్లబెట్టేలా కప్పదాట్లు ఉంటున్నాయి.ప్రజల మేలు కోసం, ప్రజల మంచికే తాను పార్టీ మారాననే సాకు చెబుతున్నారు.

ఈసారి ప్రతి నియోజకవర్గంలో సొంత పార్టీ నుండి ఇద్దరు లేదా ముగ్గురి పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. 'హ్యాట్రిక్' కొట్టి పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అడ్డదారులలో అసమ్మతివాదులకు అధికారం, అవకాశం, ఆసరా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయని తెలుస్తోంది. గంపెడు (దింపుడుకల్లం) ఆశలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ అసమ్మతి, అవకాశ‌వాదులను పార్టీలో చేర్చుకునేందుకు 20సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఈటలను బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్​గా నియమించింది. వరంగల్ రైతు గర్జన తర్వాత‌ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పుడు ఎన్నికలు లేవు కానీ, ఇక ఎన్నికల సమయంలో ఈ పరిస్థితి మరింత అరాచకంగా ఉంటుందేమో చూడాలి. రేవంత్ వ్యూహంలో కొందరు ఇప్పటికే చిక్కుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ మాత్రం చేరేవరకు గోప్యతను పాటించడం గమనార్హం.

పార్టీ భవిష్యత్తు కోసమే

సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ది పథకాలపై దృష్టి సారిస్తూనే జనవరి 26న అన్నిజిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. అందరు ఊహించినట్లుగా గాకుండా పార్టీ భవిష్యత్తుకు భంగం కలుగకుండా ఉండే సైనికులను, ప్రజాప్రతినిధులనే నియమించారు. కనీసం జిల్లా కార్యవర్గంలోనైనా చోటు దక్కుతుందే మోనని ఆశగా ఎదురుచూస్తున్నా టీఆర్‌ఎస్ పాత‌ సంప్రదాయానికి జీవం పోస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ క్యాడర్ అంతా రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి కుంపటి వారు పెట్టుకొని అదనుకోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు పోటీపడుతున్నారు. పూర్తిస్థాయి జిల్లా కమిటీ వేయడం వలన పార్టీ పొజీషన్స్ అడ్డు పెట్టుకొని బేరసారాలకు దిగే అవకాశం ఉంది.

హోదా ఉండడంతో ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి ఇక్కడ మెజారిటీ నియోజకవర్గాలలో విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఒకవేళ పార్టీ నుంచి ఎవరైనా నేతలు బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పార్టీ పదవి హోదా లేకుంటే ఇతర పార్టీలలో కూడా చేర్చుకోవడం అరుదుగా ఉంటుంది. పార్టీకి ప్రమాదం ఉండదు. అందుకే కేసీఆర్ జిల్లా కమిటీలు, ముందు చూపులో భాగంగా నియమించడం లేదనే గుసగుసలు పార్టీలోని వినపడుచున్నాయి. ఎన్నికల సందడి మొదలు కానుండడంతో అధికార పార్టీలో చిన్న, చితక పొజీషన్స్​లో ఉన్న కట్టప్పలకు భలే గిరాకీ వచ్చేసింది. జంపింగ్ జిలానీలకు పార్టీ ట్యాగ్ లేకుండా చేయడం వలన ఇతర పార్టీల ప్రలోభాలకు గురిచేయరన్న ఉద్దేశంతో కేడర్ మనోధైర్యం కాపాడేందుకు జిల్లా, రాష్ట్ర కమిటీ కూర్పుపై దృష్టి పెట్టలేదనే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయా పార్టీలు ప్రలోభ పెట్టడానికి, నాయకులుగా గుర్తింపు లేకుండా పోయిందనే లోలోన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డా.సంగని మల్లేశ్వర్

జర్నలిజం విభాగాధిపతి

కేయూ, వరంగల్

98662 55355

Advertisement

Next Story

Most Viewed