- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడవి తల్లి ఒడిలోనే..ఆదివాసీల పోడుగోస
ఆదివాసీలది, అడవిది అన్యోన్య బంధం. వారికి అది గృహసీమ. చేప జీవనానికి నీరు ఎలాగో వారికి అడవి అలాంటిది. పచ్చని ప్రకృతి గురించి, ఆకాశంలో ఎగిరే పక్షి విహారం దాకా, భల్లూకం, పెద్దపులి వంటి క్రూర మృగాల అడుగుల సవ్వడిని, పాదముద్రికల చరితను ఆదివాసీలు గుర్తించగలరు. వివిధ జాతుల పక్షులను, జంతువులను, వనమూలిక గల మొక్కలను చెప్పగలరు. ఆకు పసరుతో, వన మూలికలతో వైద్యాన్ని అందిస్తూ అపర ధన్యంతరికి తీసిపోని విధంగా నాటువైద్య శాస్త్రవేత్తలుగా వ్యవహరిస్తారు. అడవి తల్లి వెచ్చని ఒడిలో తమ జీవిత గమనాన్ని ఒకరి హక్కులను ఒకరు గౌరవించుకుంటూ సాగిస్తారు. వీరు చరిత్రకందని అపర శక్తులు కలవారు. అనాది నుంచి ఆటవిక జీవనం కలిగిన అడవి దివిటీలు.
Also read: నడుస్తున్న చరిత్ర:పోడు భూముల పంపిణీ చిక్కుముడి
వారు భూ బకాసురులు కాదు
ఆదివాసీలు అడవిని ప్రేమిస్తారు. అడవినే ఆరాధిస్తారు. కేవలం దుంప గడ్డల కోసం 'దుస్సేరు' పొద చుట్టూ షికారు చేస్తారు. కర్ర, పలుగు సాయంతో భూమాతను క్షమించమనే రీతిలో తన కొమ్ము బూరలతో కొలిచి నిరూపిస్తారు. పరిమితికి మించి ఏ ఒక్క చెట్టునూ గొడ్డలికి బలి చెయ్యరు. ఎందుకంటే, ఆదివాసీ ఎల్లప్పుడూ ప్రకృతి బిడ్డే. తొమ్మిది నెలలు కడుపున మోసిన తల్లి కంటే తన జీవన ప్రామాణిక వయస్సు వరకు తనకు అన్ని తానై సాకే అడవినే అమ్మగా ఆరాధిస్తాడు. అందుకే ఏ రకమైన ఆపద వచ్చిన స్పందిస్తాడు, సుస్తీ చేస్తే అలమటిస్తాడు, చొరబాటుదారులకు విల్లంబులు ఎక్కుపెట్టి ప్రతిఘటిస్తాడు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తూ బతుకుదెరువు కోసం పోడు చేస్తున్న ఆదివాసీలు ఆధిపత్య వర్గాలతో, ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
తన మనుగడ కోసం చేస్తున్న పోరాటానికి అడ్డంకులు ఏర్పడటం గర్హనీయం. ఆదివాసీ దట్టమైన అడవి ఉన్నచోట సారవంతమైన భూసారం ఉంటుందని పొడుకు ఉపక్రమిస్తాడు. అడవికి నష్టం కలగకుండా అతి జాగ్రత్తగా నేల మీద ఫలసాయం కోసం చేసే శ్రమ ఆరాటం ఆదివాసీలది. అంతేకానీ వారు 'భూ బకాసురులు' కాదు. తరతరాలుగా అడవిని నమ్ముకుని జీవిస్తున్న అటవి సంరక్షకులు, భూమి పుత్రులు. వారీ జీవనాధారం కోసం నిర్ణీత ప్రదేశంలో చదును చేసి జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు పండిస్తారు. తెలుగు రాష్ట్రాలలో 'పోడు'గా పిలిచే దీనిని మధ్యప్రదేశ్ లో 'పెండా' లేదా 'బేవార్' అని. ఈశాన్య భారతంలో 'జూమ్' అంటారు. వీటన్నిటి మధ్య వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మొత్తం ఆసియా ఖండంలోనే అదీవాసీలలో ఈ మూస పద్ధతి కొనసాగుతోంది.
Also read: పోడుపై రాజకీయ నీడ..
వారు బతకడం ఎలా?
దాదాపు 17 శతాబ్దం నుంచి అడవులనే నమ్మి జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు భూమి ధరలు పెరగడం శాపమైంది అందుకే ఆక్రమణలు మొదలయ్యాయి. స్థానిక నాయకుల ప్రమేయంతో బినామీల పేర పోడు విస్తీర్ణం అమాంతం పెరిగింది. రాష్ట్ర విస్తీర్ణంలో పోడు పేర 2,94,693 హెక్టార్ల అడవి ప్రాంతం ఆక్రమణలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో గిరిజనేతరుల భూమి ఎక్కువగా ఉండటంతో పోడు వివాదం చెలరేగుతున్నది. పైగా ఈ భూముల పైన రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల సమన్వయం లేకపోవడం కూడా ఈ వివాదాలకు దారి తీస్తున్నది. ఈ వివాదాలపై పాలక, ప్రతిపక్షాలు రెండు మూడు రోజులు హడావుడి చేయడమే తప్ప పరిష్కార మార్గం చూపించడం లేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు పట్టాలు ఇవ్వకపోవడంతో అటవీశాఖ అధికారులకు, ఆదివాసీలకు మధ్య వివాదాలు రోజు రోజుకు వివాదాలు ముదిరి నిరసన చేసినప్పుడల్లా లాఠీ చార్జీలు, కాల్పులు జరుగుతున్నాయి.
రాళ్ల దాడులు, చెట్లకు కట్టేసి కొట్టడాలు వంటివి ఈ మధ్యకాలంలో వారి పొలాల వద్ద జరుగుతున్న సంఘటనలు. ఈ ఘటనలు ఇంద్రవెల్లి ఘటనను తలపిస్తున్నాయి. దశాబ్దాలుగా పోడు భూములను నమ్ముకొని కాలం వెల్లదీసుకుంటున్న ఆదివాసీలను తల్లి గర్భం నుండి వేరుచేసినట్టు వారిని వేరు చేయడం అన్యాయం. అవి లేకపోతే వారు ఎలా బతకడం? పోలీసులు, అధికారులు వారి గుడిసెలను ధ్వంసం చేయడం, సాగు భూముల్లో ట్రెంచ్ ఏర్పాటు చేయడం వలన దిక్కుతోచని పరిస్థితిలో వారు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో పొందుపరిచిన గిరిజన హక్కుల చట్టం ప్రకారం వారికి న్యాయం జరగాలి లేకపోతే భవిష్యత్ లో కుమరంభీమ్, ఇంద్రవెల్లి అమరుల పోరాట స్ఫూర్తితో జల్ జంగల్ జమీన్ నినాదం తో మరో పోరాటానికి ఆదివాసీలు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. ఈలోపే వారి పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలని మనవి.
గుమ్మడి గాంధీ,
పినపాక,
భద్రాద్రి కొత్తగూడెం,
73375 33173