ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు..!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-27 00:00:34.0  )
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు..!
X

మానవ సమాజంలో మనుషుల లైంగిక లక్షణాల ఆధారంగా స్త్రీలు, పురుషులు అని సహజమైన విభజన ఉంది. దీన్నే జెండర్ బైనరీ అంటారు. స్త్రీలు, పురుషులతో పాటు ఎలాంటి లైంగిక పరమైన లక్షణాలు లేకపోవడం లేదా క్రోమోజోమ్ లోపం వల్ల స్త్రీ, పురుష లక్షణాలు కలిసి ఒక్కరిలోనే ఉండేవారిని థర్డ్ జెండర్‌గా వ్యవహరిస్తారు. ట్రాన్స్ జెండర్లకు కూడా ఒక గుర్తింపు తెచ్చే విధంగా వారిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి మొదటగా ప్రయోగంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన శిక్షణ మరియు ఎంపిక ప్రక్రియకు పిలవగా 58 మంది హాజరైతే అందులో 44 మంది ఎంపిక అవ్వడం జరిగింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా వీరికి రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు.

వాళ్లకు ఉద్యోగాలిచ్చిన తొలి ప్రభుత్వం

దీంతో వారు కూడా మనుషులేనని.. వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని తెలంగాణ ప్రభుత్వం కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా శిక్షణ ఇచ్చి ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రయోగం విజయవంతం అయితే దేశంలోనే వివిధ రాష్ట్రాలు కూడా ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ట్రాన్స్ జెండర్లు పెళ్లిలో, దుకాణాల వద్ద డబ్బు డిమాండ్ చేయడం, వ్యభిచారం చేయడం గమనించాం వారికి సరైన అవకాశాలు లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే వారు మారతారని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంచలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

థర్డ్ జెండర్ హక్కుల రక్షణ చట్టం..

మూడో లింగం వారి హక్కులను కాపాడటం, సమాన అవకాశాలు కల్పించడం ద ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్ 2019 చట్టం ముఖ్య లక్ష్యం. ఈ చట్టం ద్వారా మూడో లింగం వారికి చట్టబద్ధమైన గుర్తింపు, వివక్షతలకు వ్యతిరేక హక్కు, తల్లిదండ్రులు లేదా కుటుంబంతో నివసించే హక్కును కల్పించింది. ఈ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం కేంద్ర సామాజిక న్యాయం సాధికారిక మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబర్ 25 న నియమ నిబంధనలు రూపొందించింది.

సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే..!

సెక్షన్ 3 ప్రకారం మూడో లింగం వారి పట్ల వివక్షను నిషేధించారు . సెక్షన్ 4 ప్రకారం మూడో లింగం వారికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది. సెక్షన్ 5 ప్రకారం మూడో లింగం వారిని గుర్తించే సర్టిఫికేట్ ను అందిస్తున్నారు. సెక్షన్ 7 ద్వారా ఎవరైనా లింగ మార్పిడి వివరాలను వారి సర్టిఫికెట్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సెక్షన్ 9 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్షత ఉండకూడదు. సెక్షన్ 12 ప్రకారం కుటుంబ సభ్యులతో పాటు నివసించే హక్కును కల్పించారు. సెక్షన్ 14 ప్రకారం వీరికి వృత్తిపరమైన శిక్షణ ,స్వయం ఉపాధి కల్పించాలి. సెక్షన్ 15 ప్రకారం వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. సెక్షన్ 6 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ వీరికి గుర్తింపు కార్డును జారీ చేస్తారు. సెక్షన్ 18 ప్రకారం మూడో లింగం వారితో వెట్టి చాకిరి చేయించినా, ఆరోగ్య భద్రతకు హాని కలిగించేలా శారీరకంగా, మానసికంగా హింసించినా, దూషించినా, లైంగిక దాడికి పాల్పడిన నేరంగా పరిగణిస్తారు. దీనికి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

సంక్షేమ కార్యక్రమాలు గరిమ గృహ

గరిమ గృహ పథకం ముఖ్య ఉద్దేశం కుటుంబం వదిలించుకున్న మూడో లింగం తో పాటు అనాధలకు ప్రాథమిక సౌకర్యాలైన నివాసం, భద్రత ,ఆహారం తదితర సౌకర్యాలు కల్పించడం.

స్కాలర్ షిప్‌లు

ట్రాన్స్ జెండర్స్ విద్యార్థులకు సెకండరీ, సీనియర్ సెకండరీ, డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయిలో స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడాదికి రూ 13,500 అందిస్తున్నారు.

సర్టిఫికెట్లు ఐడెంటిటీ కార్డులు

ట్రాన్స్ జెండర్స్ కు ఐడి కార్డులు అందించేందుకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్ ఫర్ లైవ్లీహుడ్, ఎంటర్ప్రైజ్ అనే పోర్టల్ (నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్ జెండర్ పర్సన్స్) పథకం ద్వారా స్మైల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో ట్రాన్స్ జెండర్ వారి సంక్షేమం, పునరావాస పథకం, బిక్షాటకుల పునరావాస పథకం అనే రెండు ఉప పథకాలు ఉన్నాయి.

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ

ట్రాన్స్ జెండర్స్ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా పీఎం దక్ష అనే పథకంలో భాగంగా నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖలో భాగంగా పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ వారు కూడా వీరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు

సమాన అవకాశాల విధానం

ఈ విధానాన్ని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించింది. ట్రాన్స్ జెండర్ పర్సన్ లేదా మూడో లింగం వారి పట్ల వివక్షత అంతం చేయడం, సమాన అవకాశాలు కల్పించడం, పనిచేసే దగ్గర అన్ని హక్కులతో పాటు గౌరవానికి భంగం కలిగించకుండా చూడడం ఈ విధానం లక్ష్యాలు.

పట్ల నాగరాజు

నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

95055 91826

Advertisement

Next Story

Most Viewed