- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతుకుతో నాట్యమాడిన రాకేష్ మాస్టర్
సినిమా నృత్య దర్శకులు రాకేశ్ మాస్టర్ ఆకస్మిక మరణం ఒక్కసారిగా ఆయన జీవన వైవిధ్యాలపై, వివాదాలపై తెర లేపింది. ఈ నెల 18న ఆరోగ్యం క్షీణించి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. మధుమేహవ్యాధి తీవ్రమై శరీర అంతర్గత భాగాలు వైఫల్యం చెందడంతో చనిపోయారని వైద్యులు తెలిపారు. పేద కుటుంబంలో పుట్టిన ఆయన బాల్యం నుండే డ్యాన్స్‌కు దగ్గరయ్యారు. చిన్నతనంలో చావు డప్పు వినిపించినా క్లాసులోంచి తప్పించుకొని ఊరేగింపు ముందు గంతులు చేసేవాడినని చెప్పుకున్నారు. ఎలాంటి గురువు శిక్షణ లేకుండానే సినిమాలు చూస్తూ సొంత ప్రతిభతో ఆయన కొత్త నృత్య భంగిమలను సృష్టించి సినిమాలకు కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగారు. దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీతో పాటు నేటి అగ్ర తారలకు స్టెప్పులు నేర్పారు.
మాస్టర్ కష్టాల్లోని..కోణాలు
రాకేష్ మాస్టర్ సుమారు 20 ఏళ్లపాటుగా ఆ వృత్తిలో కొనసాగారు. నేడు సినీ పరిశ్రమలో ఉన్న ఎందరో డ్యాన్స్ మాస్టర్లకు ఆయన గురువు. డ్యాన్స్ అంటే ఇష్టమని వచ్చిన ప్రతి పిల్లాడిని చేరదీసి తిండి పెట్టి, ఇంట్లోనే చోటు ఇచ్చి ప్రాక్టీసు చేయించేవారు. ఈ రకంగా ఆయన జీవితంలో ఎదిగిన తీరు ఎంతో ఆదర్శనీయంగా కనబడుతున్నా, గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ యూట్యూబ్ చానళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతున్న తీరు ఎంతో వివాదాస్పదంగా మారింది. ఆయన మరణం తరవాత సామాజిక మాధ్యమాల్లో ఈ ఇంటర్వ్యూలు చక్కర్లు కొడుతూ సామాన్యుల్లో సైతం ఎవరీయన అని ఆసక్తిని పెంచాయి. సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న రోజుల్లో రాకేష్ మాస్టర్ పెద్ద ఇంట్లో కిరాయికి ఉండేవారు. ఆయనకు నాలుగు కార్లు ఉండేవి. చేతి నిండా డబ్బుతో ఎవరేది అడిగినా కాదనేవారు కాదు. అయితే సినీ పరిశ్రమలో కాలం ఒక్కలా ఉండదు. బాగా బతుకుతున్నపుడే సాధ్యమయినంత కూడబెట్టుకోవాలి. ఈ సూత్రాన్ని పట్టించుకోనివారు చివరకు కష్టాల పాలవుతారని ఎన్నో రుజువులున్నాయి. రాకేష్ మాస్టర్ విషయంలో ఇదొక్కటే కాకుండా మరిన్ని కోణాలున్నాయి. ఆయనకు దయాగుణంతో పాటు మాటలపై అదుపు లేదు. ఛానళ్ల ముందు ఏది చెప్పాలి, ఎలా చెప్పాలి, భాష ఎలా ఉండాలి, మానసిక స్థితి సంగతేమిటి అనే జాగ్రత్తలు, విచక్షణ లేకుండా పోవడం ఆయన చాలా ఇంటర్వ్యూలలో కనబడుతుంది. వీటిని చూస్తుంటే ఆయన వెంటపడిన యూట్యూబ్ చానళ్ళు కనీస నియమాలను పాటించనట్లు అనిపిస్తుంది. రాకేష్ మాస్టర్ మద్యం మత్తులో ఉండి నోటికొచ్చిన మాటలు అంటుంటే వాటిని ప్రసారం చేయవలసిన అవసరమేముంది? ఆయన మద్యం సీసాను చూయిస్తూ అనే మాటలకు ఏ ప్రయోజనం ఉంటుంది! వాటి ప్రసారం చట్ట అతిక్రమణ కాదా? ఆ ఇంటర్వ్యూలను చూసేవారు వేలల్లో ఉండి ఛానల్‌కు తగిన లాభం రావచ్చునేమో గాని రాకేష్ మాస్టర్‌కు అవి వ్యక్తిగతంగా తీరని నష్టాన్ని చేశాయి. ఎవరి పేర్లయితే ఆయన ఆయా ఇంటర్వ్యూలలో ప్రస్తావించారో వాళ్లంతా ఆయనకు దూరమయ్యారు.
ముక్కుసూటితనంతో పాటు..మద్యం తోడై..
మామూలుగా మనసులో ఒకరి గురించి ఏమనుకున్నా పైకి చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు. కోరి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకని లౌక్యంగా సర్దుకుపోతుంటారు. అయితే రాకేష్ మాస్టర్ మాట్లాడేప్పుడు ఇదేమీ పట్టించుకోకుండా సరాసరి వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ నోటికొచ్చింది అనడంతో ఆయనపై గౌరవం, గురుభావన ఉన్నవారు కూడా ఆ తీరును జీర్ణించుకోలేక పోయారు. తమ గురువుగారు బహిరంగంగా తమ విలువను తీసేలా వీడియోల్లో మాట్లాడడం చూసి ప్రస్తుతం పరిశ్రమలో ఉన్నత స్థితిలో ఉన్న ఆయన శిష్యులు కూడా మనస్తాపం చెంది దూరమయ్యారు. పైగా రాకేష్ మాస్టర్ అన్న మాటలకు మీ జవాబేంటి అని సదరు యూట్యూబ్ చానళ్లు వెంటపడడంతో వారికి మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందనవచ్చు. ఈ వీడియోల కారణంగానే ఆయన మరణం, మృతదేహం సార్థక హోదాను పొందలేకపోయింది. ఆయన చేతులు పట్టుకొని స్టెప్పు నేర్చుకొన్న హీరోలెవ్వరూ ఆయనకు నివాళులు అర్పించలేదు. ఆయనను చివరిసారి చూసేందుకు రాలేదు. ఆయన శవాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించలేదు. కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది శిష్యులు తోడురాగా ఆయన అంతిమయాత్ర సాగింది.
లోకంతో సమీకరణ కుదరకే నిష్క్రమణ
రాకేష్ మాస్టర్‌కు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. కళను తప్ప ఎవరిని లెక్క చేయనితనముంది. తన టాలెంట్‌పై పూర్తి నమ్మకమున్న ఆయన ఏ రోజు సంపాదనను ఆ నాడే ఖర్చు చేసి లేదా అడిగినవారికి ఇచ్చి జేబులు ఖాళీ చేసుకొనేవారు. సంపదనంతా చేయిచాపిన వాళ్ళకిచ్చి అందులో ఆనందాన్ని చూశారు. కుటుంబానికి సొంత ఇంటిని కూడా అందివ్వక చివరకు ఇంటి కిరాయి కోసం తిప్పలు పడ్డారు. అయినా కరోనా సమయంలో వందలాది మందికి తన ఆదాయంతో భోజనాలు ఏర్పాటు చేశారు. చెన్నై నుంచి డ్యాన్స్ మాస్టర్లను రప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, పరిశ్రమలోని పెద్దలను తూలనాడి అందుకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా యూనియన్ సభ్యత్వాన్ని పోగొట్టుకున్నారని అంటారు. ముక్కుసూటితనానికి మద్యం తోడైతే పరిణామాలు ఎలా ఉంటాయో రాకేష్ మాస్టర్ జీవితం దానికి నిదర్శనం. చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయాలని కుటుంబాన్ని కోరారు. ఆయన మాటల్లో మనిషికున్న స్వార్థం పట్ల, మూఢత్వం పట్ల ఏహ్యభావం కనబడుతుంది. మతం, కులాలను వ్యతిరేకిస్తూ మాట్లాడేవారు. మనిషిని ఎంతో ప్రేమించే గుణమున్న రాకేష్ మాస్టర్ ఈ లోకంతో సమీకరణ కుదరకే అర్థాంతరంగా నిష్క్రమించారు.
-బి.నర్సన్,
94401 28169