- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలిక సాధికారతకు చర్యలేవి?
మనిషి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. స్వేచ్ఛగా జీవించి, ఎదిగే హక్కు బాలుడితో పాటు బాలికకు ఉంది. కానీ, ఇది ఆచరణలో అమలు కావడం లేదు. తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షతను తొలగించి , వారి సమగ్రాభివృద్దే లక్ష్యంగా 2011 నుంచీ ప్రతీ ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం బాలికలు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడం, బాలికల సాధికారత, వారి హక్కుల నెరవేర్చుటపై దృష్టి పెడుతుంది. ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవం "భవిష్యత్తు కోసం బాలికల దృష్టి" అనే ఇతి వృత్తంతో నిర్వహిస్తున్నారు. నేటి బాలికలు బావి స్త్రీలుగా పరిపక్వం చెందుతున్నప్పుడు వారికీ మంచి విద్య, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలి. యుక్తవయసులో సమర్ధవంతంగా మద్దతు ఇస్తే, బాలికలు ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈనాటి సాధికారత కలిగిన బాలికలే రేపటి కార్మిక శక్తిగా, తల్లులుగా, వ్యవస్థాపకులుగా, సలహాదారులుగా, ఇంటి పెద్దలుగా మరియు రాజకీయ నాయకులుగా రాణిస్తారు.
బాలికలు ఎదుర్కొంటున్న వివక్షత..
నేటి ఆధునిక యుగంలో బాలికలు ఆనేక రూపాలలో వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం నేడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఐదు గురు బాలికల్లో ఒకరు లోయర్-సెకండరీ విద్యను, పది మంది బాలికలలో నలుగురు ఉన్నత-సెకండరీ పాఠశాలను విద్యను పూర్తి చేయడం లేదు. తక్కువ-ఆదాయ దేశాలలో దాదాపు 90 శాతం మంది కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు ఇంటర్నెట్‌ను ఉపయోగించడంలేదు, మరోవైపు బాలలు ఆన్‌లైన్‌లో ఉండే అవకాశం రెండింతలుగా ఉంది. ఇదీ ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అవరోధంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5-14 సంవత్సరాల వయస్సున్న బాలలతో పోలిస్తే బాలికలు ప్రతిరోజూ 16కోట్ల కంటే ఎక్కువ గంటలు జీతం లేని ఇంటి పని, సంరక్షణలో గడుపుతున్నారు. ప్రతి నలుగురు కొత్త HIV ఇన్ఫెక్షన్లలో ముగ్గురు కౌమారదశ బాలికలే ఉండడం ఆందోళనకరం. 15-19 సంవత్సరాల వయస్సు గల వివాహితలలో దాదాపు నలుగురిలో ఒకరు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా సన్నిహిత భాగస్వామి నుంచి శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు.
బాలిక అభివృద్ధికి సవాలుగా బాల్యవివాహాలు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారికి ముందు, ఆ తర్వాత కొనసాగుతున్న బాల్యవివాహాలు బాలిక అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయని అధ్యయనం పేర్కొన్నది. భారతదేశ పరిస్థితిని గమనిస్తే... ఇక్కడ అమ్మ గర్భంలో నుంచే బాలికల పట్ల వివక్ష ప్రారంభం అవుతుంది. మగపిల్లవాడు వంశోద్ధారకుడనే సామాజిక అపోహల వల్ల లింగ నిష్పత్తి గాడితప్పుతుంది. 2001 జనాభా లెక్కలు ప్రకారం బాలికల్లో లింగ నిష్పత్తి 1000:927 ఉండగా...అది 2011 నాటికి 1000: 914 పడిపోయింది. దీనికి ప్రధాన కారణం లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు చాప కింద నీరులా కొనసాగడమే. తద్వారా జన్మనిచ్చే మహిలే జన్మ హక్కును కోల్పోవడం జరుగుతుంది. పేదరికం, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, అక్రమ రవాణా బాలిక సాధికారతకి గొడ్డలి పెట్టుగా మారాయి. చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పాక్సో) కింద కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో బాలిక రక్షణ లేని "బేటీ బచావో- బేటి పఢావో ” నినాదం ప్రశ్నార్థకమే. మరోవైపు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 ప్రకారం 146 దేశాలలో భారత్ గతేడాది కన్నా రెండు స్థానాలు దిగజారి 129 స్థానంలో నిలవడం గమనర్హం. భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణిత(STEM) గ్రాడ్యుయేట్స్ లో 43% మంది మహిళలు పాల్గొంటున్నారు. అయితే ఈ రంగంలో మహిళల ఉపాధి రేటు 14% మాత్రమే. అదే ప్రపంచంలో అయితే 29.2 శాతం ఉంది.
అవకాశాలతో వివక్ష తొలగింపు...
బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షతను తొలగించాలంటే భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మరిన్ని బాలిక సాధికారక కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి. భారతదేశంలోని చాలా మంది మహిళలు, బాలికలు లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య భావాల నుంచీ విముక్తి కాలేకపోతున్నారని యునెస్కో స్పష్టం చేసింది. మన దేశంలో గుళ్ళో దేవత పూజలు, ఇంట్లో బాలికపై వివక్ష సంస్కృతి తరతరాల నుంచి కొనసాగుతుంది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే ఎన్నో విపరీత పరిణామాలకు, సాంఘిక ఉత్పాతాలకు దారి తీస్తుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలికల హక్కుల రక్షణలో మొదట బాలికా విద్యను ప్రోత్సహించాలి. ఇది సమాజంలో అసమానతలను తగ్గిస్తుంది. బాలికలకు నాణ్యమైన, సమానత్వంతో కూడిన విద్యను అందించడానికి జాతీయ విద్యా విధానం-2020లో లింగ సమ్మిళిత నిధి(Gender inclusive fund)ని ప్రవేశపెట్టింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలిక అభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ చూపాలి. ముఖ్యంగా బాలికా సంక్షేమానికి సరిపడ నిధులు కేటాయించాలి. సుకన్య సమృద్ధి యోజన, మిషన్ వాత్సల్య వంటి పథకాలు బాలికల భవిష్యత్తుకు పెట్టుబడిగా నిలవాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలను సంస్కృతి, సంప్రదాయాల పరిధిలో బంధించి వారి సాధికారతను అడ్డుకోవద్దు. అబ్బాయిలతో సమానంగా విద్యావకాశాలను కల్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలి. అప్పుడే ఆడపిల్లల పట్ల వివక్ష తొలిగిపోయి లింగ సమానత్వం సాధ్యమవుతుంది. తెలంగాణాలో ఆడపిల్లల పెళ్ళీల కోసం అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేశాయి. మరోవైపు బాలిక విద్య కోసం ప్రత్యేక ఏర్పాటుచేసిన గురుకులాలు వారి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి. ఇలాంటి చొరవను ప్రతి రాష్ట్రం చూపాలి. ప్రభుత్వాలు పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి బాలికలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలి. ఈ చర్యలు బాలిక ఎదుగుదలకు దోహదపడి ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యమైన లింగ సమానత్వానికి దారి తీస్తాయి.
(నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా..)
- సంపతి రమేశ్ మహరాజ్
సామాజిక విశ్లేషకులు
79895 79428