- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంప్రదాయం:ఆచరణే అతి ముఖ్యం
ఉత్తర భారతదేశంలో హోలీని రెండు రోజుల పండగగా చేసుకుంటారు. మొదటి రోజును 'హోలికా దహన్' లేదా 'ఛోటీ హోలీ' అని, రెండో రోజును 'రంగ్‌వాలీ హోలీ' 'ధులేటి' 'ధుళంది' 'ధూళివందన్' వంటి పేర్లతో పిలుస్తారు. వీరు రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విభేదాలను మరిచి స్నేహం పెంపొందించుకునే సమయంగా కూడా వారు భావిస్తారు. ఈ రోజు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. తెలిసినవారు, కొత్తవారు అనే భేదం లేకుండా అందరినీ వర్ణ ప్లావితం చేయడం జరుగుతుంది. హోలీ లేదా రంగుల పండుగగా మనం జరుపుకునే ఈ పండుగ అసలు పేరు హోలీకా పూర్ణిమ.
ఇది రెండు రోజుల పండుగ అయినందున కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు, మరికొన్ని ప్రాంతాలలో రెండో రోజు చేస్తారు. ఇది ఇపుడు రంగులు చల్లుకునే ఉత్సవంగానే మారిపోయింది గానీ, ఈ రోజున ఆచరించవలసిన వేరే విధి విధానాలు ఉన్నాయి. ఉదయాన్నే కట్టెలు, పిడకలను రాశిగా పోసి నిప్పును రాజేయాలి, దానిపైకి హోలీకా అనే శక్తిని అవహింపజేసి 'శ్రీ హోలీకాయై నమః' అని పూజించాలి. మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణ చేస్తూ 'వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణా శంకరేణచ, అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ' అనే శ్లోకం చదవాలని పెద్దలు చెబుతారు. ఆ తర్వాతే రంగులను చల్లడం, రంగు నీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్ర వచనం.
అంతర్జాతీయ పండుగగా
ఈ రంగులు, రంగు నీరు చల్లుకోవడంతో పాటు నృత్యగానాదులతో ఊరేగింపులు నిర్వహించడం, దీనిలో పానీయాలు అందించడం కూడా జరుగుతుంటుంది. కొన్ని ప్రాంతాలలో భంగు కలిపిన పానీయాలు తాగి మైమరచిపోతుంటారు. హిందువుల ప్రాచీన పండుగ అయిన హోలీని దక్షిణాసియాలోని చాలా ప్రాంతాలలో హిందూయేతరులు సరదా పండగగా కూడా చేసుకుంటుంటారు. ముఖ్యంగా భారత్, నేపాల్, ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలలో హిందువులు ఉన్న తావులలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ పండగను యూరప్, అమెరికాలలో సైతం నిర్వహిస్తున్నారు. అక్కడ ఈ పండగను వసంత రుతువులో వచ్చే రంగుల పండగగా అక్కడి భారతీయులు భావిస్తారు. అంతేకాక ఈ రోజు ఇతర దేశాల వారి పండుగలు ఉండటంతో ఇది వాటితో కలిసి అంతర్జాతీయ పండుగగా పేరు పొందింది.
తిరుమల మనోహర్ ఆచార్య
శ్రీ రామానుజ యాగ్నిక పీఠం దక్షిణ భారతదేశ సహాయ కార్యదర్శి
హైదరాబాద్
99890 46210