తిరుపతి లడ్డు గిఫ్ట్ ప్యాక్ చేయాలి

by Ravi |   ( Updated:2023-02-07 02:19:18.0  )
తిరుపతి లడ్డు గిఫ్ట్ ప్యాక్ చేయాలి
X

మూడు శతాబ్దాలకి పైగా చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్యత, ప్రత్యేకత అందరికీ తెలిసిందే. తిరుపతి వెళ్లే ప్రతి భక్తునికి దర్శనం మీద కన్నా లడ్డులా మీదే ఎక్కువ ధ్యాస ఉంటుంది. తిరుపతి వెళ్లినవారు తమకి లడ్డూ తెస్తారో, లేదో అని ఎదురుచూసే బంధుమిత్రులు కూడా ఎందరో ఉంటారు. కానీ ఈనాడు తిరుపతి నుండి తమకి ఇష్టమైనవారికి లడ్డూలు తీసుకురావడం అనేది సామాన్య భక్తులకి ఒక ప్రహసనంగా మారింది. కేవలం ఒక చిన్న లడ్డూకే 50 రూపాయల అధిక ధర చెల్లించడంతో పాటు ఒక భక్తునికి నాలుగు కన్నా ఎక్కువ లడ్డూలు ఇవ్వకపోవడం కూడా విచారకరం. పైగా పెద్ద పెద్ద క్యూ లైన్లు, కనీసం కవర్ (ప్యాకింగ్) కూడా ఇవ్వని పరిస్థితి వలన భక్తులు లడ్డూలు కొనుక్కోవడంలో నానా అగచాట్లు పడుతున్నారు.

టీటీడి బోర్డ్‌కి రోజుకి కోట్లల్లో ఆదాయం వస్తున్నప్పటికీ ఒక లడ్డూని తయారీ ధర కన్నా ఎక్కువ ధరకి అమ్మడం అనేది భక్తుల్ని నిలువుగా దోచుకోవడం కాదా? వడ ప్రసాదాన్ని పక్కన పెడితే తిరుప్పొంగమ్, సుఖీయం, అత్తిరసం, అప్పం, జిలేబి లాంటి ఇతర లాభం లేని ప్రసాదాల్ని విక్రయించడంతో పాటు తయారు చేయడం కూడా టీటీడీ బోర్డు ఎప్పుడో ఆపేసింది. ఇప్పటికైనా బోర్డు అధికారులు ప్రసాద విక్రయాల్ని వ్యాపార కోణంలో కాకుండా మానవీయ కోణంలో, భక్తుల్ని ఆధ్యాత్మికంగా అలరించే విధంగా మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే లడ్డూతో పాటు, దేవుని ఫోటో ఇతర ప్రసాదాలు, తిలకధారణకి సంబంధించిన ఇతర వస్తువులు కూడా కలిపి ఒక సరికొత్త 'గిఫ్ట్ ప్యాక్' రూపంలో ప్యాకింగ్ చేసి కొండపైకి వచ్చిన భక్తులకే కాకుండా రాని భక్తులకు కూడా స్పీడ్ పోస్ట్, కొరియర్, ఆన్ లైన్ బుకింగ్ రూపంలో ఒక నిర్ణీత ధరకే ఇంటింటికి అందించి భక్తుల లడ్డూల కష్టాలు తొలగించడంపై దృష్టి సారిస్తే బాగుంటుంది.

పసునూరి శ్రీనివాస్

8801800222

Also Read...

గోరంత హామీ..కొండంత రుణం



Advertisement

Next Story