ఈసారైనా.. బదిలీలు సక్రమంగా సాగేనా?

by Ravi |   ( Updated:2024-06-14 01:00:55.0  )
ఈసారైనా.. బదిలీలు సక్రమంగా సాగేనా?
X

దశాబ్ద కాలం నిరీక్షణకు తెరపడింది. టీచర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయడంతో ఉపాధ్యాయుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుందా? లేదా అన్న అనుమానాలు కూడా టీచర్లను కలవరపెడుతుంది. గత అనుభవాల దృష్ట్యా ఈ ప్రక్రియ ఎప్పుడు సాగుతుందో.. ఎప్పుడు ఆగుతుందో.. తెలియని సందిగ్ధ స్థితిలో టీచర్లు నేడు ఉన్నారు. అందుకే నూతన పాఠశాలలో చేరేదాకా బదిలీలపై నమ్మకం కుదరడం లేదని పలువురు టీచర్లు వాపోతున్నారు.

ఎనిమిదేండ్లుగా పదోన్నతులు, ఆరేండ్లుగా బదిలీ లేక అవస్థలు పడుతున్న ఉపాధ్యాయ లోకంపై రెండేళ్ల క్రితం 317 అనే పిడుగు పడింది. దీంతో చెట్టుకొకరు, పుట్టకొకరుగా విసిరివేయబడిన భార్యాభర్తలు, చదువుకున్న జిల్లాల్లో స్థానికత కోల్పోయి పక్క జిల్లా శాశ్వతంగా విసిరివేయబడిన ఉపాధ్యాయులు. 317 కింద అలాట్ కొత్త జిల్లాకు అలాట్ అయి స్పాజ్ తదితర కారణాల చేత, కోర్టు ఉత్తర్వుల ద్వారా వచ్చిన ఉపాధ్యాయులకు ఆనాటి ఖాళీల్లో పోస్టింగ్ ఇవ్వడం వలన మంచి స్థానాలు కోల్పోయామని ఆందోళన చెందుతున్న కొంతమంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ బదిలీల కింద కేడర్ స్ట్రెంత్ కంటే అదనంగా కేటాయింపులు జరిగి జిల్లా అంతా పదోన్నతులు బదిలీలకు నోచుకోకుండా అయిందని కొందరు, ఇరవై ఏండ్లయినా పదోన్నతులు రాకుండా ఒకే హోదాలో పనిచేస్తున్నామని ఇంకొందరు, తెలుగు, హిందీ అయితే త్వరితంగా పదోన్నతికి చేరుకోవచ్చని భావించి ఆయా డిగ్రీలు పొందిన మరికొందరు.. ఇలా సమస్త ఉపాధ్యాయ లోకం వారి వారి అంచనాలు తలకిందులు కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఎలాగైనా తన సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్న నెపంతో కోర్టు మెట్లు ఎక్కడం ప్రారంభించింది. దీనికి తోడు బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు, మార్గదర్శకాల్లో అనేక తేడాలు ఉండడం, నియామకాలకు ఒక మాదిరిగా, పదోన్నతులకు ఒక మాదిరిగా నిబంధనలు రూపొందించడం, విద్యాహక్కు చట్టం, ఎన్.సి.టీ.ఈ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుపోవడంతో కోర్టుల్లో అనేక కేసులు నమోదవుతున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో విచిత్ర పరిస్థితి!

ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టుకు డీఎడ్/టీటీసి వారే అర్హులని ఒక వర్గం, బీఎడ్ వారు కూడా ఆనాడే నియామకం పొందాం కనుక వారు కూడా అర్హులేనని మరొక వర్గం కోర్టును ఆశ్రయించడం, పండిట్ పీఈటీ అప్ గ్రేడేషన్ పోస్టుల్లో అర్హతలు కలిగిన వారికి పదోన్నతి ఇవ్వాలని న్యాయంగా అవి మాకే రావాలంటూ పండిట్, పీఈటీలు దశాబ్ద కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ కేసుల్లో కోర్టు ఒక్కొక్క మారు ఒక్కొక్క రకంగా తీర్పు ఇచ్చింది. ప్రస్తుత తీర్పులపై అసంతృప్తిగా ఉన్న అనేకమంది సీనియర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాడంతో బదిలీలు పదోన్నతుల కథ మళ్ళీ మొదటి వస్తుందేమోనని ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్నారు.

రాష్ట్రం మొత్తం ఒకదారి ఆ జిల్లాది మరోదారి అన్న చందంగా మారింది రంగారెడ్డి జిల్లా పరిస్థితి. 317 అలకేషన్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా నుండి కేడర్ స్ట్రెంత్‌కు మించి ఉపాధ్యాయులు వచ్చి చేరారని, ఎంతమంది ఉపాధ్యాయులు అదనంగా వచ్చారనేది లెక్క తేల్చాలని కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. ఈ జిల్లాలో పదోన్నతుల, బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ షెడ్యూల్‌లోనే తమకు బదిలీలు పదోన్నతులు కల్పించాలని జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్‌ను కలవడంతో ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో.. ఎప్పుడు తమకు పదోన్నతులు దక్కుతాయోమోనని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఏళ్ల తరబడి వాయిదా వేస్తుండడంతో..

కొత్త ప్రభుత్వం 317 పంచాయతీ తెగ్గొడుతుందని భరోసాగా ఉన్న టీచర్లు ఈ బదిలీ, పదోన్నతులు జరిగితే మాకు ఆయా జిల్లాల్లో ఖాళీలు, మంచి స్థానాలు మిగలవని వాపోతుండగా అన్ని రకాల సర్దుబాట్లు హేతుబద్ధీకరణ జరిగితే నూతన నియామకాలకు అవకాశం ఉండదని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఇలా పాయింట్ల మీద, స్పాజ్ కేటగిరి మీద, యూనియన్ పాయింట్ల మీద, మెడికల్ ధ్రువపత్రాల మీద, విద్యార్హతల మీద అనేక అనుమానాలు, ఫిర్యాదుల నడుమ బదిలీ, పదోన్నతుల బండి ముందుకు సాగుతుందా లేదా అన్న సంశయం ప్రతి ఉపాధ్యాయున్ని వేధిస్తున్న మాట నిజం.

విద్యాశాఖలో రాష్ట్ర స్థాయి అధికారులు చాలినంత లేకపోవడం ఒక సమస్య అయితే వారు కోర్టుకు హాజరైవ్వడమే వారి పనిగా మారిపోవడం వలన పరిపాలన, వ్యవస్థీకరణ మీద దృష్టి కేంద్రీకరించి వెసులుబాటు వారికి లభించడం లేదు గత ప్రభుత్వం ఎన్నడూ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన దాఖలాలు లేవు. ఎవరికి వారే, ఎవరి సమస్య పరిష్కారం కోసం వారే రకరకాల మార్గాల్లో వెళ్లడం వల్ల ఆ దారులు ఎక్కడా ఒక చౌరస్తాలో కలుసుకోలేకపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఇతర శాఖలతో పోలిస్తే విద్యాశాఖ లో టీచర్లు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరికి ఏటా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిర్వహించినట్లయితే ఈ పరిస్థితులు ఉద్భవించేవి కావు. ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా ఏళ్ల తరబడి ఈ ప్రక్రియను వాయిదా వేస్తుండడంతోనే ఈ దుస్థితి నెలకొన్నది అనడంలో అతిశయోక్తి లేదు.

సంఘాలు సమన్వయంగా పని చేయాలి!

ఇరవై ఏండ్లయినా పదోన్నతి లేక ఒకే కేడర్లో ఉన్న అంశాన్ని, బదిలీ, పదోన్నతులు యేండ్లకు యేండ్లుగా సాగని అంశాన్ని పరిశీలించి ఉపాధ్యాయ లోకం కోర్టు వ్యాజ్యాలను తగ్గించుకొని మద్య మార్గంలో పయనించాలి. మారుతున్న కాలానికి తగిన నియమ నిబంధనలకు సిద్ధపడే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ప్రభుత్వంతో సంఘాలు సమన్వయంగా పనిచేయాలి. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించే పరిస్థితి కల్పించాలి. సంఘాల ప్రభావం కోసం కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా పార్టీ ఎజెండాల నెత్తికెత్తుకోకూడదు. సంఘాలు నిజంగా ఉపాధ్యాయుడికి, ప్రభుత్వానికి నడుమ నిజమైన వారధిలా పనిచేయాలి. అన్నింటికి మించి ప్రభుత్వాలు జీతం మీద మాత్రమే ఆధారపడిన ఉపాధ్యాయిని జీతభత్యాలు, పీఆర్సీ, డిఏ, ఇతర బిల్లులు పెండింగ్‌లో లేకుండా ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. ప్రతి వేసవికాలంలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించినట్లయితే కోర్టు కేసుల సంఖ్య సద్దుమనిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. భావి భారతాన్ని నిర్మించే పనిలో నిమగ్నమయ్యే ఉన్నత వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుల పట్ల ఉదాసీనత అసలే పనికిరాదు. కొత్త ప్రభుత్వం ఆ దిశగా కొత్త అడుగులు వేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు తదనుగుణంగా సహకరిస్తాయని ఆశిద్దాం.

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

9000674747

Advertisement

Next Story

Most Viewed