24 ఫ్రేమ్స్: కొత్త తరం ఆవిష్కరణ 'తిథి'

by Ravi |   ( Updated:2023-01-13 19:00:24.0  )
24 ఫ్రేమ్స్: కొత్త తరం ఆవిష్కరణ తిథి
X

అర్థవంతమయిన సినిమాల విషయంలో కన్నడ సినిమా కొంత తన చరిత్రను కొనసాగించే పనిలోవుంది. గతంలో బివి కారంత్, గిరీష్ కర్నాడ్, కాసరవెల్లి, పట్టాభి లాంటి గొప్ప దర్శకుల సినిమాలతో తన విలక్షణతని, అర్థవంతమయిన దృక్పథాన్ని ప్రదర్శించిన కన్నడ సినిమా రంగం... యువకుడయిన రామ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'తిథి' సినిమాతో మరోసారి తన స్థాయిని నిరూపించుకుంది. కొన్ని ఏళ్ల క్రితం సినిమానే అయినప్పటికీ 'తిథి'తో కన్నడ సినిమాల్లో కొత్త తరంతో పాటు నవ్య సినిమాకి ఇంకా స్థానం వుందని నిరూపించింది. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఆ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన మూడు తరాల మనుషులు ప్రవర్తించే తీరు, ఆ నేపథ్యంలో సామాజిక ఆర్థిక స్థితిని ఈ చిత్రం అత్యంత నిజాయితీగా వాస్తవికంగా చిత్రిస్తుంది. ఆ సినిమా మన తెలుగు సినిమా రంగానికి కూడా మార్గదర్శిగా వుండాల్సింది. కానీ మనవాళ్ళు ఇంకా మూస ఛత్రం లోనుంచి బయటకు రాలేకపోతున్నారు. శుష్కమైన ప్లాస్టిక్ ఎడారి లాంటి వర్తమాన సినిమా రంగంలో 'తిథి' ఓ గొప్ప వూరట. ఆన్లైన్‌లో వుంది. మంచి సినిమాల్ని ప్రేమించే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ఇటీవలి సినిమా 'తిథి'.

రోజు ప్రధాన స్రవంతి సినిమా అంటే పెద్ద హంగామా. పాన్ ఇండియన్ అన్న మాట ఇవ్వాళ సినిమా రంగంలో వినిపిస్తున్న మూల మంత్రం. అంతేకాదు వంద కోట్ల సినిమా అన్నది ఇవ్వాళ ప్రచారమే కాదు లక్ష్యం కూడా. అయితే ఎన్ని సినిమాలు ఆ టార్గెట్‌ను అందుకున్నాయన్నది నూరు డాలర్ల ప్రశ్న. దాదాపు అన్ని భారతీయ భాషా సినిమాలు గత రెండు మూడేళ్ళుగా పెట్టుబడికీ, లాభాలకీ, విజయాలకూ ఓటములకూ మధ్య వూగిసలాడుతున్నాయి. కొన్ని పెద్ద సినిమాలన్నవి ఉఫ్ మని కొట్టుకు పోతూవుంటే మరో పక్క కొన్ని సాధారణ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అందుకు ఆరాల్ని వెతికే పనిలో సినిమా రంగం తలములకలయి వుంది.

చరిత్రను కొనసాగించే పనిలో...

అయితే ఆర్థికంగా జయాపజయాలు సంగతి అట్లా వుంటే అర్థవంతమయిన సినిమాల విషయంలో కన్నడ సినిమా కొంత తన చరిత్రను కొనసాగించే పనిలోవుంది. గతంలో బివి కారంత్, గిరీష్ కర్నాడ్, కాసరవెల్లి, పట్టాభి లాంటి గొప్ప దర్శకుల సినిమాలతో తన విలక్షణతని, అర్థవంతమయిన దృక్పథాన్ని ప్రదర్శించిన కన్నడ సినిమా రంగం యువకుడయిన రామ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'తిథి' సినిమాతో మరోసారి తన స్థాయిని నిరూపించుకుంది. కొన్ని ఏళ్ల క్రితం సినిమానే అయినప్పటికీ 'తిథి'తో కన్నడ సినిమాల్లో కొత్త తరంతో పాటు నవ్య సినిమాకి ఇంకా స్థానం వుందని నిరూపించింది. ఆ సినిమా మన తెలుగు సినిమా రంగానికి కూడా మార్గదర్శిగా వుండాల్సింది. కానీ మనవాళ్ళు ఇంకా మూస ఛత్రం లోనుంచి బయటకు రాలేకపోతున్నారు.

మనుషుల అంతరంగాలకు నిలువుటద్దం...

2016లో జాతీయ స్థాయిలో ఉత్తమ కన్నడ సినిమా అవార్డుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన తిథి సినిమా మొత్తం నాన్ ప్రొఫెషనల్ నటులతో రూపొంది వాస్తవిక సినిమాల శైలిలో నిలదొక్కుకుంది. కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి కె.సి.రెడ్డి మనవడయిన రామ్ రెడ్డి ప్రేగ్ అంతర్జాతీయ ఫిల్మ్ స్కూల్‌లో శిక్షణ పొందాడు. ఆయన తొలి చిత్రమిది. కర్ణాటక లోని మాండ్యా గ్రామం ఈ సినిమాకు వేదిక. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఆ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన మూడు తరాల మనుషులు ప్రవర్తించే తీరు ఆ నేపథ్యంలో సామాజిక ఆర్థిక స్థితిని ఈ చిత్రం అత్యంత నిజాయితీగా వాస్తవికంగా చిత్రిస్తుంది. చిత్రీకరణ శైలి ఫెల్లినీ, సత్యజిత్ రే లాంటి మహామహుల ఒరవడిని సంతరించుకుంది. అట్లని పూర్తి అనుకరణగా కాకుండా వర్తమాన సమాజానికి సరితూగే రీతిలో సిన్మా నిర్మాణం జరిగింది. సినిమా చాలా సరళంగా సహజంగా సాగుతుంది. పాత్రలన్నీ కాల మాన పరిస్థితులను ప్రతిబింబిస్తూ అన్నీ డీటైల్స్‌తో ముందుకు సాగుతుంది. దర్శకుడి సొంత టోన్‌తో సాగే తిథి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

చిత్ర కథాంశానికి వస్తే 101 ఏళ్ల సెంచరీ గౌడ మరణంతో సినిమా ప్రారంభమవుతుంది. పేరుకు తగట్టే సెంచరీ గౌడ తన జీవితంలో వంద ఏళ్ళు బతకడమే కాకుండా, స్త్రీలోలత్వంతో పాటు అన్నీ విషయాల్లో విలక్షణతను కలిగివుంటాడు. అతని కుమారుడు గడప్ప చింపిరి జుట్టు పెరిగిన గడ్డంతో లోకంతో పనిలేనట్టు దిమ్మరిగా తిరుగుతుంటాడు. దేన్నీ పట్టించుకొని గడప్ప నడకనే నమ్ముకుని తిరగడమే తన ప్రవృత్తిగా మార్చుకుంటాడు. గడప్ప కొడుకు తిమ్మన్న. సెంచరీ గౌడ మరణంతో వూరివారంతా తిమ్మన్నని ఆస్తి విషయంలో ఉసిగొల్పుతారు. ఉన్న భూమి గడప్ప పేర వుంది. దాన్ని తండ్రి పేర నుంచి తన పేరిట మార్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు తిమ్మన్న. కానీ గడప్ప తన తర్వాత నీకే కదా అంటాడు.

భూమి తన పేర మార్చుకునేంతవరకూ నిద్ర పోవద్దనే స్థితిలో తిమ్మన్న తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. గడప్పేమో దొరక్కుండా తిరుగుతూ వుంటాడు. పట్నంలో దొంగ కాగితాలు పుట్టించే అధికారిని కలిసి తిమ్మన్న ఒప్పందం కుదుర్చుకుంటాడు. గడప్ప బతికుండగా అది సాధ్యం కాదంటాడు అధికారి. ఎంత ఖర్చయినా సరే చేయమని ఒప్పందం చేసుకుంటాడు. మరో వైపు ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మకానికి పెడతాడు. గడప్ప డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే గడప్పను వూరిలో వుండకుండా చేయాలని అతను భవిష్యత్తులో ఎవరికి కనిపించకుండా చేయాలని అధికారి చెబితే అప్పులిచ్చే ఓ వ్యాపారి దగ్గర తిమ్మన్న పెద్ద మొత్తం వడ్డీకి అప్పు తీసుకొని తండ్రి గడప్పను దొరకబుచ్చుకొని ' నీకు చాలా రోజుల్నుంచీ తీర్థ యాత్రలు చేయాలనుంది కదా డబ్బు ఇస్తాను వెళ్ళమని బలవంతంగా బయలుదేర దీస్తాడు.

సరదాగా వుండే గడప్ప మేకలు కాసే గుంపులో కలిసిపోతాడు. మరో వైపు సెంచురీ గౌడ 11 వ రోజు తిథి వస్తుంది. అంతా ఘనంగా బతికిన వాడి తిథి గొప్పగా చేయాలని వూరి వాళ్ళ ప్రోద్బలంతో తిమన్న ఏర్పాట్లు చేస్తాడు. ఇక తిమ్మన్న కొడుకు బూతు సినిమాలు చూస్తూ మేకల గుంపులోని ఒక అమ్మాయి వెంట పడతాడు. సెంచురీ గౌడ తిథి కోసం తిమ్మన్న మూడు మేకల్ని కొనుక్కురమ్మని కొడుకును పంపిస్తాడు కానీ దోస్తులతో పేకాడి తాగి ఆ డబ్బును పోగొట్టుకుంటాడు. మిత్రుల సాయంతో మేకల గుంపు నుండి మూడు మేకల్ని ఎత్తుకొచ్చి తిథి ఏర్పాట్లు చేస్తాడు. అక్కడ గుంపులోంచి మేకలు పోవడంతో వాళ్ళల్లో వాళ్ళకు గొడవ జరుగుతుంటే తాను ఆ డబ్బు ఇస్తానని గడప్ప తన వద్ద వున్న ఆ డబ్బును వాళ్ళకు ఇస్తాడు.

మరోవైపు తిమన్న చేసుకున్న ఏర్పాట్లతో దొంగ డెత్ సర్టిఫికేట్ తయారవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనే వాళ్ళను తీసుకొని భూమి వద్దకు వస్తాడు. తిథి జరగడానికి సెంచరీ గౌడ కొడుకు గడప్ప వుండాలని వూరివాళ్లు పట్టు బడతారు. మేకల గుంపుతో వున్న గడప్పను గమనించి పట్టుకొస్తారు. అది గమనించిన తిమ్మన్న యాత్రలకు వెళ్లమన్నాను కదా ఎందుకొచ్చావని తండ్రిని నిలదీస్తాడు. ఇంతలో గడప్ప బతికుండడం దొంగ డెత్ సర్టిఫికేట్ సృష్టించారని తెలుసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి తిమ్మన్నను తిట్టి వెళ్ళిపోతాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి వొత్తిడి వుంటుంది. ఈ మొత్తమ్ నేపథ్యంలో గౌడ తిథి జరిపిస్తారు వూరివాళ్లు. తిమ్మన్న తండ్రిని తిడతాడు.

పల్లె సహజత్వానికి చిత్రిక పట్టి....

ఇలా గడప్ప నిర్వ్యాపకత్వం, తిమన్న స్వార్థం, ఆతని కొడుకు వ్యసన లక్షణంతో పాటు లంచాలు, దొంగ సర్టిఫికేట్‌ల వ్యవహారం, అప్పులు, రియల్ ఎస్టేట్ మోసాలు వ్యవస్థలో లోపాల్ని అత్యంత వాస్తవికంగా తిథి సినిమాలో చిత్రించారు. సినిమా మొత్తం మీద నటీనటులు, గ్రామీణ వాతావరణం అంతా సహజంగా వుండి మనం గ్రామంలో తిరుగుతున్నట్టే వుంటుంది. ఆర్భాటాలూ, భేషజాలూ లేని నిర్మాణ శైలి మరోసారి కన్నడ సినిమాను మాత్రమే కాదు మొత్తంగా భారతీయ సినిమాను రొడ్డ కొట్టుడు కృతక సినిమా సరళి నుండి రియలిస్టిక్ సినిమా వైపునకు 'తిథి' తీసుకెళ్తుంది. చాలా మంచి ప్రయత్నంగా నిలిచిపోయింది.

'తిథి' సినిమా జాతీయ అవార్డుతో పాటు కర్ణాటక రాష్ట్ర అవార్డులు, లోకార్నో, శాన్ ఫ్రాన్సిస్కో, ముంబై, బెంగళూరు, శాంగాయి లాంటి అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు అందుకుంది. శుష్కమైన ప్లాస్టిక్ ఎడారి లాంటి వర్తమాన సినిమా రంగంలో 'తిథి' ఓ గొప్ప వూరట. ఆన్లైన్‌లో వుంది. మంచి సినిమాల్ని ప్రేమించే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ఇటీవలి సినిమా 'తిథి'.

'తిథి; ( కన్నడ సినిమా 2016) దర్శకత్వం: రామ్ రెడ్డి.రచన: ఎరే గౌడా, రామ్ రెడ్డి, నటీనటులు: తమ్మే గౌడా, చెన్నే గౌడా, అభిషేక్, పూజ మొ. కెమెరా: డోరోన్ తెంపర్ట్

-వారాల ఆనంద్

9440501281

Advertisement

Next Story

Most Viewed