ఈ పర్యాటక ప్రాంతాలు రాష్ట్రానికి కాసులు కురిపిస్తాయి..

by Ravi |   ( Updated:2024-11-19 01:00:21.0  )
ఈ పర్యాటక ప్రాంతాలు రాష్ట్రానికి కాసులు కురిపిస్తాయి..
X

సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలు, సజీవ నదులు, విశాల సముద్ర తీరంతో అలరారుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ చివర అనంతపురం జిల్లాలో లేపాక్షి మొదలు.. ఆ చివర శ్రీకాకుళం జిల్లాలోని మహేంద్రగిరుల వరకు కనువిందు చేసే అందాలు ఎన్నెన్నో.. నల్లమల్లల సౌందర్యం మధ్య కొలువైన శ్రీశైల మల్లన్న , శేషాచలంపై వెలసిన వెంకన్న, కనుచూపు తిప్పుకోలేనంతగా కట్టిపడేసే పాపి కొండలు, కేరళను కనులముందు సాక్షాత్కరింపచేసే కోనసీమ, ఊటీని తలదన్నేలా అరకు.. కృష్ణమ్మ, గోదారమ్మ పరవళ్ల సవ్వడి చెంత వెలసిన ఎన్నో క్షేత్రాలు, అపురూప దృశ్యాలకు నిలయం మన ఆంధ్రప్రదేశ్.

ఆర్థిక ప్రగతిలో పర్యాటకం ప్రాధాన్యం అంతకంతకు ఎక్కువవుతోంది. ఈ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, విస్తృతంగా ఉపాధి అవకాశాలను సృష్టి స్తోంది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు, కీలకమైన విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు దోహదపడుతోంది. దాంతో పాటు రవాణా, బ్యాంకింగ్, బీమా, హోట ళ్లు, చేనేత, హస్తకళల ఉత్పత్తుల అమ్మకాలు తదితరాలను ఉత్తేజితం చేస్తోంది. టూరిజం దేశంలో వృద్ధి చెందు తున్న తీరు, సంబంధిత ప్రభుత్వ విధానాలతో పాటు అన్ని రకాల యాత్రికులను ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి, స్వయం ఉపాధి ప్రయోజనం కోసం టూరిజం, ఆతిథ్య రంగాలను అనుసంధానించడం, వివిధ ఉపాధి నైపుణ్యాలను సులభతరం చేయడంలో పర్యాటకం కీలకమైన, ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఆర్థిక ఉత్ప్రేరకం..

రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్సుకు సహాయపడే కీలకమైన ఆర్థిక ఉత్ప్రేరకం పర్యాటకం. ఈ రంగం ఉద్యోగాలు సృష్టించగలదు, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలదు. అందుకే స్థానిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుందని, పర్యాటకానికి సాంకేతిక సొబగులు అద్దు తోంది ఏపీ సర్కార్‌. పర్యాటకులకు మరుపురాని అను భూతి పంచేందుకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే విజయవాడ పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్‌’ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విశాఖ తీరం, నాగార్జున‌సాగర్, గోదావరి ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ ఏర్పాటుకు రెండో దశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. బౌద్ధ వారసత్వాన్ని కలిగి ఉన్న నేపథ్యం ధాన్యకటకం (అమరావతి), భట్టిప్రోలులోని మహా స్థూపాలు, గుంటుపల్లిలోని రాతి గుహలు వంటి స్మారక ఆధారాలను ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ వారసత్వ చిహ్నాలు మహాయాన బౌద్దమతానికి జన్మస్థలంగా, 40కి పైగా ముఖ్యమైన స్మారక చిహ్నాలకు ఆంధ్రప్రదేశ్ నిలయం. రాష్ట్రంలో రెండు ప్రధాన బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శ్రీకాకుళం – విశాఖపట్నం మధ్య కళింగపట్నం, ముఖలింగం, శాలి హుండం, రామతీర్థం, తొట్లకొండ, పావురాల కొండ, బావికొండ, బొజ్జన్న కొండ, శంకరం, ఆదుర్రు, కొత్తూరు అదే విధంగా అమరావతి-నాగార్జునకొండ మధ్యలో గుడి వాడ, అమరావతి, జగ్గయ్యపేట, అల్లూరు నాగార్జునకొండ, అనుపు, చోడవరం, ఘంటసాల, ఉండవల్లి, భట్టిప్రోలు, గుంటుపుల్లి తదితర బౌద్ధ రామాల అభివృద్ధి పర్యాటక కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దనుంది.

పర్యాటక రంగానికి ' పరిశ్రమ హోదా!

ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చ డమే లక్ష్యంగా పర్యాటక రంగానికి ' పరిశ్రమ హోదా ' ప్రకటించడంతో, అనేక మంది పెట్టుబడిదారులు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకుముందు, పర్యాటక రంగం సేవా కేటగిరీ కింద ఉంది అందుకే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడానికి పెట్టుబడిదారులను ప్రోత్సహించలేదు. అయితే, కొత్త పర్యాటక విధానం భారీ పెట్టుబడులతో సమీకరణను మారుస్తుందని భావిస్తున్నారు. పరిశ్రమలకు ఇస్తున్న పన్ను ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలలో రాయితీ సహా అన్ని ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన పూర్తిగా అమ్మకం ప్రాతిపదికన భూమిని మంజూరు చేయాలని కూడా ఆలోచిస్తుంది. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒక పెద్ద ఎత్తుగడ

టూరిజం బ్రాండింగ్, ప్రమోషన్

దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఏపీకి రావాలంటే టూరిజం బ్రాండింగ్, ప్రమోషన్ దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉంది. పర్యాటక రంగం ఏపీకి ‘బంగారుగుడ్లు పెట్టే బాతు’ అని జగన్‌ గుర్తించలేకపోయారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించారు. అందుకే ఆయన పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేయబోతున్నారు కనుక ఆయన చెప్పిన్నట్లు భవిష్యత్‌లో పర్యాటక రంగం నుంచి ఏపీకి భారీగా ఆదాయం, ఉపాధి లభించడం ఖాయమే. భవిష్యత్‌‌లో ఏ ఇజాలు ఉండవు కేవలం టూరిజం మాత్రమే ఉంటుంది. సోషలిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం, మార్క్సిజం వంటి అన్నింటినీ టూరిజం ఒక్కటే పక్కకు పెట్టేలా చేస్తుంది అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు అక్షర సత్యాలు పాలకులకు దూరదృష్టి ఉన్నప్పుడే ఆ దేశం, ఆ రాష్ట్రం బాగుపడుతుంది.

- సుధాకర్ వి

99898 55445

Advertisement

Next Story