- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలకుల్లోనే పాపిష్టులు..
ప్రపంచ ఆధునికతను అందుకుంటూ దేశం ఎంత ముందుకు వెళ్తున్నా.. మానవ విలువలు అదే రీతిలో పతనమవుతూ వస్తున్నాయి. దేశంలో అవినీతి, అక్రమాలు, నేరాలు, లంచాలతో సమాజాన్ని, సామాన్య జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడకుండా చేసేవారు పెరిగిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలుకొని చట్టాలు చేసే ప్రజాప్రతినిధుల దాకా ఈ పరిధి విస్తరించి ఉంది. అందుకే న్యాయం జరగాల్సిన చోటా... లంచానికి న్యాయం అమ్ముడుపోయి అన్యాయం విర్రవీగుతుంది. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు నీతి తప్పితే ఇక సామాన్యుల బతుకులు ఎప్పుడు బాగుపడతాయి.
నేర చరిత్ర ఉన్నవారు పాలకులైతే..?
దేశంలో అవినీతితో పాటు ఈ మధ్య భయంకరంగా పెరిగిపోతున్న లైంగిక దాడులు తీవ్ర భయాందోళనలకు గురిచేసేలా మారాయి. లైంగికదాడులను అరికట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా, అందుకు ఎన్ని చట్టాలు ఉన్నా.. అవి నియంత్రణలోకి రాలేకపోతున్నాయి. ఏదోచోట మహిళలు లైంగిక దాడులకు గురవుతూ, మానసిక వేధింపులకు బలవుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు, చివరికి రక్షించాల్సిన పోలీస్ స్టేషన్లలోనూ ఇటువంటి ఘటనలు జరగడం ఘోరమైన పరిస్థితి. నేరచరిత్ర ఉన్నవారు కూడా యథేచ్ఛగా ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఇక న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటాం? గ్రామ స్థాయిలో సర్పంచిగా ఎన్నికలలో పోటీచేసేందుకు ముగ్గురు సంతానం ఉంటే అర్హత ఉండదు. అలాంటిది మహిళలపై నేరాలకు పాల్పడిన వారు చట్టసభల్లో ఉండడం నిజంగా దౌర్భాగ్యం.
సువిశాల భారతదేశంలో.. నాయకత్వం ఇప్పుడు కొందరికి ఆస్తులు కాపాడుకోవడానికి మరికొందరికి ఆస్తులు సమకూర్చుకోవడానికి వేదికగా మారినట్లు తయారైంది. దేశంలో ఓ వైపు ఆకలి కేకలు పెరిగిపోతుంటే అంతే స్థాయిలో అవినీతి, దోపిడి రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా పేదోడు ఆకలితో యుద్ధం చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితులు దాపురించాయి. వారి సంక్షేమం కోసం ఎన్ని పథకాలు తెచ్చినా.. అవి పేదోడికి అందాల్సినంత అందడం లేదు.
రాజకీయ వ్యవస్థ బాగుపడనంత కాలం..
దేశంలో హత్యాచార ఘటనలు నిత్యం ఏదో చోట జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో 151 మంది ప్రజాప్రతినిధులుగా ఎంపికై వివిధ హోదాల్లో చట్టసభల్లో ఉన్నారు. అందులో 135 మంది ఎమ్మెల్యేలు ఉండగా 16 మంది ఎంపీలుగా ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ నివేదిక తెలియజెప్పింది. రాజకీయ పార్టీలు వారిపై ఎన్ని కేసులున్నా వారికే టికెట్లు ఇచ్చి అభ్యర్థులుగా బరిలో నిలబెడతాయి. మనం వారిని గెలిపిస్తే వారు ప్రజాప్రతి నిధులుగా ఎన్నికై వారి పాపాలను చెరిపేసుకునే పనిలో ఉన్నారు. అందుకే దేశంలో రాజకీయ వ్యవస్థ బాగుపడనంత కాలం.. సమాజంలో గుణాత్మక మార్పును తీసుకురాలేం. నేరాలను అదుపు చేయడానికి ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినా వారిలో మార్పు రాకుండా సమాజంలో మార్పు వస్తుందనుకోవడం భ్రమ. టెక్నాలజీలో ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న మనం మానవ విలువలు కోల్పోతున్నాం. అంతరిక్షానికి ఎక్కడాన్ని నేర్చుకుంటున్న మనం భూమి మీద మనుషులుగా ఎలా వ్యవహరించాలో మరిచి బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాం. మనం ఇప్పటికైనా సమాజం పట్ల పౌరులుగా బాధ్యతతో వ్యవహరించాలి. అవినీతిని అడ్డుకొని, నీతిలేని రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పకుంటే.. మనం మనసున్న మనుషులం కానే కాదు.
సంపత్ గడ్డం
78933 03516