హోదా వారిది.. అధికారం వీళ్ళది!

by Ravi |   ( Updated:2023-05-30 05:31:56.0  )
హోదా వారిది.. అధికారం వీళ్ళది!
X

ఆంగ్లేయుల కాలంలో నిర్మించినటువంటి పార్లమెంటు భవనాన్ని నూరు సంవత్సరాల తర్వాత ప్రస్తుత అవసరాలు డిమాండ్లను పరిపుష్టి చేయడానికి నూతన పార్లమెంట్ భవనం అనివార్యమని ప్రభుత్వం భావించి నిర్మాణం చేసుకోవడం కాలానుగుణమైన అభివృద్ధిలో భాగమే. కానీ దాని ప్రారంభోత్సవ కార్యక్రమమే పెద్ద వివాదాస్పదం కావడంతో పాలకుల, న్యాయవ్యవస్థ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పింది. భారత ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగ అధిపతిగా రాష్ట్రపతి కొనసాగడం అనేది నిర్వివాదాంశం, దీనిని న్యాయవ్యవస్థ కూడా అంగీకరించినదే. కానీ పరిపాలనకు సంబంధించిన సందర్భంలో మాత్రం పార్లమెంటుకు అధిపతి ప్రధానమంత్రి అని సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఒక రకంగా రాష్ట్రపతి గౌరవాన్ని తగ్గించడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో పాలకులు తమ హయంలో ఏదో ఒక ప్రత్యేకత సాధించాలని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, శిలాఫలకాలతో సార్థకత చేకూర్చుకోవాలని చరిత్ర సృష్టించాలని ఆశపడుతున్నారు. ఆ రకంగా పరిపాలన మీద ఒక ఆధిపత్యాన్ని సాధించాలనే సిద్ధాంతంతో ఇదంతా చేస్తున్నట్టు కనిపిస్తుంది. చివరికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మాత్రమే అనేలాగా వీరి చర్యలు ఉన్నాయి.

మొక్కుబడిగా రాజ్యాంగ అధిపతి!

నిజానికి నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవమే ఒక చరిత్రాత్మక రోజు ప్రారంభించకుండా హిందూత్వానికి ప్రతినిధిగా ఉన్న వీర్ సావర్కర్ జయంతి రోజును ఎంపిక చేసుకోవడమే పెద్ద విమర్శలకు తావిచ్చింది. పైగా రాష్ట్రపతి చేతుల మీద నుండి కాకుండా కేవలం ప్రసంగ పాఠం మాత్రమే చదివి వినిపించడం దారుణం. దీనిని బట్టి బీజేపీ ప్రభుత్వం అణగారిన వర్గాల వారికి పదవులు కట్టబెట్టి అధికారాన్ని, హోదాను మాత్రం అనుభవించకుండా చేస్తున్నారు. గతంలో దళిత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని కూడా సూర్య దేవాలయానికి, రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఇప్పుడు ఆదివాసీ అయిన ముర్ముని ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు. నిజానికి పార్లమెంటు భవనానికి అందులో జరిగే కార్యకలాపాలకు అధినేత రాష్ట్రపతి. బిల్లులను ఆమోదించడం, సభలను ప్రోరోగ్ చేయడం, ఇతర పరిపాలనాపరమైన అనేక అంశాలలో రాష్ట్రపతి క్రియాశీలక పాత్ర పోషిస్తారు. కానీ సర్వోన్నత న్యాయస్థానం సైతం ఈ విషయంపై ఇది ప్రభుత్వం చూసుకోవాలని తీర్పునివ్వడం విడ్డూరం. పైగా లోక్‌సభ, రాజ్యసభ స్పీకర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్వహణకు ప్రారంభకులుగా ప్రధానిని ఎంపిక చేయడం విచిత్రం. ఇప్పటికే ఓ వైపు గవర్నర్ వ్యవస్థ లోపభూయిష్టమని చర్చలు జరుగుతుంటే, చట్టసభల సభ్యుల ద్వారా ఎన్నుకోబడినటువంటి రాష్ట్రపతిని కూడా ఈ దేశంలో మొక్కుబడిగానే చూడడం అత్యంత ఆందోళనకరమైన విషయం.

పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతి లేకుండానే జరుగుతుందని ప్రభుత్వం ఆకస్మికంగా ప్రకటించినట్లుగానే, తమిళనాడులో తయారు చేసిన రాజదండాన్ని కూడా పార్లమెంట్‌లోని స్పీకర్ చాంబర్లో ప్రారంభోత్సవం నాడు ఉంచనున్నట్లు ప్రకటించడం కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అధికార మార్పిడికి ఈ రాజదండం చిహ్నమని అందుకే దీనిని పార్లమెంట్‌లోని స్పీకర్ చాంబర్లో ఉంచుతున్నట్లు చెబుతుంది బీజేపీ. కానీ అనేక మంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ రాజదండం స్వాతంత్య్రం వచ్చిన రోజు అధికార మార్పిడికి చిహ్నంగా అందజేయలేదని, నాడు ప్రభుత్వ మార్పిడి సందర్భంగా నెహ్రూకు తమిళనాడులోని పవిత్ర శైవ మఠం ఆధ్యాత్మిక వాదులు దీనిని కానుకగా అందజేశారు. ఒక మత సంస్థ ఇచ్చిన కానుకని అధికార మార్పిడి చిహ్నమని ఎలా ప్రకటిస్తారు?

అధికార ముద్ర కోసమేనా?

రాజుల కాలంలో శిలాశాసనాలను బట్టి ఆయా రాజుల పరిపాలన విధానం ప్రజా కార్యక్రమాలను అంచనా వేస్తారు, కానీ ప్రస్తుతం మన దేశంలోని ప్రభుత్వాల తీరు చూస్తే ప్రతి కార్యక్రమంలోనూ తమ ముద్ర కనిపించాలని, తమ ఆధిపత్యం కొనసాగాలని ఆశిస్తున్నట్లుగానే ఉంది. దానికి నిదర్శనంగా తెలంగాణలో సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంలో గవర్నర్‌ని, ఇతర ప్రతిపక్షాలను ఆహ్వానించలేదని అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాధినేత అయినటువంటి రాష్ట్రపతి ప్రమేయం లేకుండా నూతన భవనాన్ని ప్రారంభించడంతోపాటు, రాజదండం పేరుతో నమ్మబలికే ప్రయత్నం చేసింది. ఈ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను పట్టించుకోని ప్రభుత్వాలు తమ పని తాము చేసుకు పోతామన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

వడ్డెపల్లి మల్లేశం

90142 06412

Also Read: తొమ్మిదేండ్ల తెలంగాణకు ఒరిగిందేమిటి..?

Advertisement

Next Story

Most Viewed