- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజావేగుల రక్షణ చట్టం అవశ్యం!
‘గయ’ పట్టణంలో 2003 నవంబర్ 27 తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన హత్య మామూలుగా అయితే అత్యధిక నేరాల రేటు నమోదు అయ్యే బీహార్ రాష్ట్రంలో ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. కానీ ఈ హత్య మాత్రం దేశ, విదేశాలలో పత్రికల పతాక శీర్షికల్ని ఆక్రమించింది, భారత పార్లమెంట్‌ను సైతం కుదిపేసింది. కారణం హతుడు 30 ఏళ్ళ వయస్సు గల ‘సత్యేంద్ర దూబే’
ఆయన పని చేస్తున్న ‘బంగారు చతుర్భుజి’ ప్రాజెక్ట్‌లో జరుగుతున్న అవినీతిపై అప్పటి ప్రధాని వాజపేయికి ఫిర్యాదు చేసిన వాడు కావడమే. సత్యేంద్ర ఐఐటీ పట్టభద్రుడు, భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్నతాధికారి. ‘సత్యేంద్ర హత్య’ ఈ దేశంలో మొట్టమొదటి ‘ప్రజా వేగు హత్య’గా అధికారికంగా నమోదు అయ్యింది.
ఐతే సత్యేంద్ర ప్రాణత్యాగం వలన ఏదైనా మంచి జరిగిందని అనుకుంటే మాత్రం అది ‘విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్’ రూపొందించబడడమే. అసలు విజిల్ బ్లోయర్స్ సంరక్షణ చట్టం అంటే ఏమిటి ఆ చట్టం ప్రస్తుతం అమలులో ఉన్నదా? చట్టం ప్రస్తుత స్థితి ఏమిటి, దాని పరిమితులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర విషయాలు చర్చిద్దాం. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ ఆమోదించిన చివరి బిల్లులలో ఒకటి ‘ప్రజా వేగుల పరిరక్షణా చట్టం, (ప్ర.వే ప). దీనిని కేంద్రం 2014 మే నెలలో నోటిఫై చేసింది. దీని ప్రకారం ప్రభుత్వంలో ఉన్న వారు అవినీతి, అధికార దుర్వినియోగం లేదా చట్టం ప్రకారం గుర్తించబడిన నేరాలకు పాల్పడిన లేదా నేరాలు చేయడానికి ప్రయత్నించిన సందర్భాలను ప్రజా వేగులు నివేదించే అవకాశం కల్పిస్తుంది. చట్టప్రకారం తప్పు జరిగిన ఏడేళ్ల లోపు ఫిర్యాదులను సమర్పించవచ్చు. ఈ ఫిర్యాదులపై నిర్దేశించిన ఏజెన్సీకి చెందిన అధికారులు విచారణలు నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటారు.
పకడ్బందీగా చట్టం అమలు
ఈ ఏజెన్సీ మూడు నెలల్లో అధికారిక విచారణలను ప్రారంభించమనీ, లేదా నేరారోపణలను దర్యాప్తు చేయమనడంతో సహా వివిధ చర్యలను సిఫార్సు చేయవచ్చు. సిఫార్సులను ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా పాటించాలి లేదా పాటించకపోవడానికి సహేతుకమైన కారణాలను చూపాలి. విచారణలకు సహకరించని పక్షంలో జరిమానాలు విధించే అధికారం చట్టం ఇస్తుంది. ప్రజా వేగులను, సాక్షులను రక్షించడానికి కావాల్సిన చర్యలు చట్టంలో పొందుపర్చారు. అలానే చట్టం అమలుపై వార్షిక నివేదికలను తప్పనిసరిగా ఉన్నత అధికారులకు సమర్పించాలి.
ఐతే ప్రధాన మంత్రి, ముఖ్యమంత్త్రులతో సహా కీలకమైన అధికార స్థానాలలో ఉన్న వ్యక్తులు చట్ట అధికార పరిధి నుండి మినహాయించబడ్డారు. అలానే ప్రైవేటు రంగంలో జరిగే అవినీతిని చట్ట పరిధిలోకి తీసుకురాకపోవడం మరొక కీలక లోపం. అంతేకాకుండా, సమాచార హక్కు చట్టం కార్యకర్తలను తగినంత రక్షణ కల్పించడంలో చట్టం విఫలమైంది. ఈ స్థితిలో దేశం మొత్తం ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమ స్ఫూర్తితో అవినీతి నిర్మూలన కోసం మాట్లాడుతున్న తరుణంలో 2014 ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలో రావడంతో ‘ప్ర.వే.ర ’ లో ఉన్న లోపాలను సవరిస్తారని పలువురు భావించారు.
కొత్త చట్టం కోరలు పీకేసి...
కొత్తగా ఏర్పడిన మోడీ ప్రభుత్వం ‘ప్ర.వే.ర’ లో గల లోపాలను సవరించకపోగా 2014 చట్టం స్థానంలో సవరించిన కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఐతే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా ఈ సవరించిన కొత్త చట్టంలో చట్ట పరిధిని మరింత తగ్గించడం జరిగింది. సవరణలతో ‘ప్ర.వే.ర’ చట్టం మరింత బలహీన పడుతుందని పౌర సమాజం చేసిన వాదనల్ని అర్థం లేని భయాలుగా ప్రభుత్వం కొట్టి పడేసింది. ఐతే ఇంతా చేసి చివరికి చట్టానికి పార్లమెంటులో ఆమోదం తెలిపి కూడా దానిని రాజపత్రంలో ప్రచురించకపోవడంతో చట్ట పరిస్థితి ‘తాళం వేసితిమి-గొళ్ళెం మరచితిమి’ అన్న చందంగా తయారయ్యింది. 2014 చట్టం ఐతే రద్దయ్యింది కానీ దాని స్థానే కొత్త చట్టం మాత్రం అమల్లోకి రాలేదు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకారం అవినీతిలో ప్రపంచంలో 180 దేశాలలో మనం 93 స్థానంలో ఉన్నామంటే చట్టం మనకు ఎంత అవసరమో తెలుసుకోవచ్చు.
ప్రజావేగులపై దాడులు చేస్తే
ఈ స్థితిలో ‘ప్ర.వే.ర’ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ సమాచార హక్కు చట్టం వినియోగదారులు, మానవ హక్కుల రక్షకులు, పర్యావరణ కార్యకర్తలు, పరిశోధనాత్మక జర్నలిస్టులు, సామాజిక ఆడిటర్ల రక్షణ చట్ట పరిధిలోకి తీసుకురావాలి. ప్రజావేగులపై దాడులు, హత్యలు జరిగిన పక్షంలో ఆ కేసులు వేగంగా పరిష్కరించడానికి ఫాస్ట్-ట్రాక్ కోర్టులు అవసరం. అలానే సామాజిక తనిఖీ వ్యవస్థలను పటిష్ట పరచి అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి సామాజిక తనిఖీలను సంస్థాగతీకరించాలి. వివిధ రంగాలలో జవాబుదారీతనం-పారదర్శకత సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా చట్టం రూపొందించాలి.
ఎన్నికలు రానున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలూ తమ మానిఫెస్టోలో ప్రజా వేగుల రక్షణ చట్టాన్ని తీసుకువస్తామని వాగ్దానం చేయాలి. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇక ప్రధాని మోడీ ఈ చట్టం విషయమై చొరవ తీసుకోవాలి. లేదంటే ఆయన నిత్యం వల్లించే ‘న ఖావుంగా-న ఖానే దూన్గా’ అనే మాటల చిత్తశుద్ధిని ప్రజలు అనుమానించే అవకాశం ఉంది.
చక్రధర్ బుద్ధ
పరిశోధకులు, లిబ్టెక్ ఇండియా
92465 22344