దళితుల్ని వెంటాడుతున్న పూనా ఒప్పందపు ఇనుప సంకెళ్లు!

by Ravi |
దళితుల్ని వెంటాడుతున్న పూనా ఒప్పందపు ఇనుప సంకెళ్లు!
X

“చరిత్ర అనేది నిందలు, పొగడ్తలతో కూడిన ఘటనల కథాహారం” అంటాడు అమెరికన్ రచయిత కాటన్ మాథర్, కానీ ఆ నిందలు పొగడ్తలు ఆయా వ్యక్తుల సంఘటనల సామాజిక నేపథ్యాన్ని బట్టి ఉంటాయనేది కాదనలేని మాట. స్వాతంత్రోద్యమంలో తన పాత్రకు, తానెంచుకున్న అహింసా శాంతి మార్గాలకు గాను మహాత్ముడన్న కీర్తిని దక్కించుకున్నాడు గానీ, తన రెండు దశాబ్దాల దక్షిణాఫ్రికా జీవితంలో నల్ల జాతీయుల పట్ల వివక్షాపూరిత వైఖరిని కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఒకవైపు నుంచి, భారత్‌లో అంటరానివారి (దళితుల) రాజకీయ హక్కులను, అస్థిత్వాన్ని ధ్వంసం చేశాడనే ఆరోపణ మరోవైపు నుంచి మహాత్మా గాంధీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) ని వెంటాడుతూనే ఉంది.

భారత ప్రభుత్వ చట్టం-1935 ద్వారా తీసుకువచ్చే రాజ్యాంగ సంస్కరణలు, ఎన్నికల విధానం గురిం చి 1931లో బ్రిటిష్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌‌లో మైనారిటీలు, అణగారిన వర్గాల రక్షణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే చర్చ జరిగిం ది. అదే రెండో రౌండ్ టేబుల్ సమావేశం.

గాంధీ, అంబేద్క‌ర్ విభేదాలకు మూలం

ఈ సమావేశంలో డా. బి.ఆర్ అంబేద్కర్ దళితులకు కావాల్సిన ప్రత్యేక రాజకీయ రక్షణలు హక్కు ల అవసరం గురించి తన వాదనను వినిపిస్తూ హిందూమత చట్రం అవతల ఉన్న అంటరానివారి రక్షణకు కేవలం మతపరమైన సంస్కరణలు సరిపోవని కులాన్ని, దాని దాడిని ఎదుర్కోవాలంటే న్యాయబద్ధమైన రాజకీయ విధానాలు, చట్టాలు కావాలని కోరుతూ వాళ్లకు కూడా మిగితా మైనా రిటీ వర్గాల మాదిరిగానే వారి ప్రతినిధులను వారే ఎన్నుకునే విధంగా ప్రత్యేక నియోజకవర్గాలను ప్రకటించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాం‌డ్ చేశారు. గాంధీ ఆ వాదనను వ్యతిరేకిస్తూ అసలు దళితులకు ప్రత్యేక రాజకీయ రక్షణలు నియోజకవర్గాలు అవసరం లేదని అగ్రకులాల మనసుల్ని మార్చడం మాత్రమే హరిజనుల సమస్యకు పరిష్కారమని, అందుకు కాంగ్రెస్ తగు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వానికి తెలియజేశారు.

కుల వ్యవస్థ చెక్కుచెదరని స్వాతంత్య్రం కావాలనేది గాంధీ కోరిక, స్వాతంత్య్రంతో పాటు సమానత్వం రావాలని, కుల‌వివక్ష, అంటరానితనం, బానిస త్వం పోవాలనేది అంబేద్కర్ పోరాటం. ఈ ఘర్షణలో భాగంగా గాంధీ - అంబేద్కర్‌ల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. మరుసటి సంవత్సరం, 1932 ఆగస్టు 4 నాడు ప్రధాన‌మంత్రి రాంసే మెక్‌డోనాల్డ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ డిమాం డ్లకు అనుకూలంగా కమ్యూనల్ అవార్డు పేరు మీద ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించింది.

అంబేద్కర్‌కి వ్యతిరేకంగా నాయకులను పోగేసి..

ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, అంటరానివారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వటం హిందూ సమాజాన్ని అస్థిరం చేస్తుంది కాబట్టి ఉమ్మడి నియోజకవర్గాల్లో భాగంగానే వారిని ఉంచాలని కోరుతూ పూనా జైలు నుంచి లేఖలు రాసి అక్కడే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు గాంధీ. బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం అంటరానివారికి కనీస రక్షణలు కొంత కాలానికైనా అవసరమని తాము భావిస్తున్నట్లు తెలపటం గాంధీని, కాంగ్రెస్ శ్రేణులను కలవరపెట్టింది. గాంధీ ఆరోగ్యం క్షీణిస్తుందని అందుకు జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత అంబేద్కర్ వహించాలని కాంగ్రెస్ నాయకులు తమ మీడియా ద్వారా అంబేద్కర్‌ను దళితుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. అటు ఆ ప్రచారం చేస్తూనే ఎంసీ రాజా లాంటి దళిత నాయకులను అంబేద్కర్‌కు వ్యతిరేకంగా పోగేసి ప్రత్యేక నియోజకవర్గాలు అవసరం లేదని ఒత్తిడి చేశారు.

రెండింటికి మధ్యలో నలిగిపోయి..

“ఆ నిరాహారదీక్షలో ఆదర్శమేమీ లేదు, అదొక హీనమైన చర్య, అది ముమ్మాటికీ అంటరానివారి ప్రయోజనాలకు వ్యతిరేకం. అణిచివేతకు గురవుతున్న వారికి రాజ్యాంగ బద్దంగా రావాల్సిన హక్కు ల్ని వదులుకుని హిందువుల దయాదాక్షిణ్యాల మీద బతకమని చేసిన క్రూర బలప్రయోగ”మని గాంధీ దీక్షను ఖండిస్తూ తన రాజకీయాలు గాంధీకి వ్యతిరేకంగానే కొనసాగించాడు అంబేద్కర్. ఒక‌వైపు దళితుల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే హక్కులు, మరో‌వైపు క్షీణిస్తున్న గాంధీ ఆరోగ్యం రెండింటిలో నలిగిపోయి అంబేద్కర్ తన పోరాటాన్ని పక్కనపెట్టి పూనా జైలులో 1932 సెప్టెంబర్ 24 నాడు జరిగిన ఒడంబడికతో గాంధీ దీక్ష విరమణకు కారణమయ్యాడు. ఫలితంగా ప్రత్యేక నియోజకవర్గాల స్థానంలో రిజర్వుడు నియోజకవర్గాలు వచ్చాయి అదే విధానం ఇప్పటికీ కొనసాగుతున్నది.

మా చేతులతో మా గొంతులు కోసుకున్నాం..

అంబేద్కర్ ఊహించినట్లుగానే దళితుల కోసం గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ చేస్తుందన్న పోరాటం మసకబారింది, ఆలయ ప్రవేశం కోసం మద్రాసు కేంద్రంగా తెచ్చిన చట్టాలను దళిత నాయకులే వ్యతిరేకించేటట్టు స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఎత్తుగడలు వేశారు. జరిగిన నష్టం తెలుసుకున్న ఎంసీ రాజా లాంటి నాయకులు “మేము కాంగ్రెస్ అగ్రకుల నాయకులతో ఉమ్మడి నియోజకవర్గాల ప్రతిపాదనకు ఒప్పుకుని మా స్వాతంత్య్రాన్ని ధ్వంసం చేసుకున్నాం మా చేతులతో మా గొంతులు కోయించే కుట్రలకు బలయ్యాం” అని అన్నారు. ఉమ్మడి నియోజకవర్గాల విషయంలో గాంధీ పంతం నెగ్గింది కానీ ఆయన చెప్పిన మానసిక మార్పు ఎటూ సాగటం లేదు, ఆయన ప్రతినిధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా, ఆయనను చంపినవాళ్ల వారసులుగా ముందుకొచ్చిన పార్టీ అయినా దళితుల పట్ల ఇప్పటికి అదే వైఖరిని చూపిస్తున్నాయి. ఏ పార్టీ కూడా కులం మీద గానీ అది వేసుకున్న సంస్కృతి ముసుగు మీద గానీ చిత్తశుద్ధితో దాడి చేయలేదు.

నాటి ఇనుప సంకెళ్లు ఇంకా తెగలేదు..!

రిజర్వుడు స్థానాల్లో నుంచి ఎన్నికయ్యే నాయ కులు, వారి పార్టీల ప్రయోజనాలు మాత్రమే కాదు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న దళితేతర హిందూ ఓటర్ల ప్రయోజనాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటది. వాళ్ళను నొప్పించే పని ఏది చేయకూడదు. ఆఖరుకు అది ఆ నాయకుల వ్యక్తిగత లేదా దళితుల కనీస మాన వ మర్యాదను కాపాడే పని అయినా సరే. ఆధ్యా త్మిక స్థలాలను సందర్శించాలంటే ఇప్పటికీ దళి తుల వెంట జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎస్సీ కమిషన్ల ప్రతినిధులు ఉండాల్సిన పరిస్థితే ఉన్నది. సాక్షాత్తు పార్లమెంట్ సభ్యులను ఆపివేసిన ఘటనలు, దళితులు పెళ్లి చేసుకున్న ఆలయాలను మూసివేయటం లాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. హిందూ మతం పేరు మీద 92 ఏళ్ల క్రితం పూనా జైలు కేంద్రంగా గాంధీ వేసిన ఇనుప సంకెళ్లు ఇప్పటికీ దళితులు విముక్తి, ఆత్మగౌరవం, స్వతంత్ర సామాజిక రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటాలను కట్టడి చేస్తూనే ఉన్నాయి.

పెద్దబూరి చరణ్ తేజ

జర్నలిస్ట్, చరిత్ర పరిశోధకులు

[email protected]

Next Story

Most Viewed