ఇజ్రాయెల్ లో తయారు చేసిన టైమ్ మెషీన్.. 60 ఏళ్ల నుంచి పాతికేళ్లకు తీసుకెళ్తామని చెప్పి..

by Y.Nagarani |
ఇజ్రాయెల్ లో తయారు చేసిన టైమ్ మెషీన్.. 60 ఏళ్ల నుంచి పాతికేళ్లకు తీసుకెళ్తామని చెప్పి..
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్కడ చూసినా ఏదొక స్కామ్. పదులు, వందల సంఖ్యలో మోసపోతుంటారు. లక్షలు, కోట్లలో డబ్బు పోగొట్టుకుని.. లబోదిబోమంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే కదా మరి. పెట్టుబడి పేరుతో మోసాలు జరుగుతున్నాయన్న వార్తలు చూస్తూనే ఉంటాం. ఇలాంటి వార్తలెన్ని చూసినా.. ఇంకా మోసాలు చేసేవారిని నమ్మి మళ్లీ మళ్లీ మోసపోతుంటారు.

తాజాగా.. నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. "60 ఏళ్ల మిమ్మల్ని 25 ఏళ్ల యువతలాగా మార్చేస్తాం.. మా దగ్గర ఇజ్రాయెల్ లో తయారు చేసిన టైమ్ మెషీన్ ఉంది" అని చెప్పి డజన్ల మందిని నమ్మించిందో జంట. వారి నుంచి ఏకంగా రూ.35 కోట్లను వసూలు చేసింది.

పోలీస్ అధికారి అంజలి విశ్వకర్మ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్ కుమార్ దూబె, అతని భార్య రష్మి దూబె కాన్పూర్ లోని కిడ్వాయి నగర్ లో థెరపీ సెంటర్ - రివైవల్ వరల్డ్ పేరిట ఒక క్లినిక్ ఓపెన్ చేశారు. అక్కడికి వచ్చినవారికి ఒక మెషీన్ ను చూపించి.. అది టైమ్ మెషీన్ అని.. ఇజ్రాయెల్ నుంచి తెప్పించామని, అరవైఏళ్ల నుంచి 25 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తామని చెప్పి నమ్మించారు. ఆక్సిజన్ థెరపీతో ఇది సాధ్యమవుతుందని నమ్మబలికారు.

పొల్యూషన్ కారణంగా పాడైన స్కిన్ ను కూడా యవ్వనంగా, తేజోవంతంగా మార్చే శక్తి ఆ మెషీన్ (time machine)కు ఉందని, కొన్ని నెలల్లోనే మార్పును చూడవచ్చన్నారు. 10 సెషన్లకు రూ.6 వేలు, 3 సంవత్సరాలకు రూ.90 వేలు చొప్పున డబ్బులు వసూలు చేశారు. వారి మాటలను నమ్మి డబ్బులు కట్టిన రేణు సింగ్ అనే మహిళ మోసపోయానని గ్రహించింది. ఏజ్ రివర్సల్ కోసం ఆమె ఏకంగా రూ.10.57 లక్షలు సమర్పించుకుంది. ఎంతకీ రిజల్ట్ రాకపోవడంతో స్కామ్ చేస్తున్నారన్న అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ ఉదంతం వెలుగుచూసింది.

రేణు సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజీవ్ - రష్మి దంపతులు డజన్ల కొద్దీ కస్టమర్ల నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. వారిద్దరిపై సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిద్దరూ విదేశాల్లో ఉన్నారని తెలియడంతో.. అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశామని పోలీస్ అధికారి అంజలి వెల్లడించారు.

Next Story

Most Viewed