రైతు రాజు కాలేదు..

by Disha edit |
రైతు రాజు కాలేదు..
X

దేశంలో ప్రభుత్వాలు మారుతున్నా రైతుల బతుకులు మాత్రం మారడం లేదు. రైతులకు పంట సాగుకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయి.. దిగుబడి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అసలు పంట మొదలు నుంచి చివరి వరకు పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. విత్తనాల కల్తీతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. విత్తనాలు ఐఎస్ఐ మార్కు పొందినవి కాకుండా మార్కెట్‌లో విచ్చలవిడిగా విత్తనాలు విక్రయిస్తున్నారు. రేటు విషయంలో కూడా ఒక దుకాణానికి మరో దుకాణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రకరకాల కంపెనీ పేర్లతో విత్తనాలు సరఫరా మార్కెట్‌లో అవుతుంటే రైతులకు ఏవి అసలువో ఏది నకిలీవో తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. పంటకు వాతావరణం సహకరించక పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ 10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి తీరా చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వాలు నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిస్తున్నా వ్యవస్థలో మాత్రం మార్పు కనిపించడం లేదు. రైతే రాజు అనే కొటేషన్ తప్ప నిజమైన రైతు పంటలు పండించి రాజుగా మాత్రం లేడు.

అనేక కంపెనీలు వచ్చి..

మన దేశంలో వ్యవసాయానికి ప్రస్తుతం ఆర్గానిక్ కన్న ఎక్కువగా పెస్టిసైడ్స్ వినియోగిస్తున్నారు. కూరగాయల మొదలు నుంచి ప్రతి పంటకు పెస్టిసైడ్స్ ఔషధాలను పిచికారి చేయనిదే పంట చేతికొచ్చే పరిస్థితులు లేవు. ప్రతి పంటకు నాలుగైదు సార్లు ఆ మందులను పిచికారి చేయడం ద్వారా రైతులకు అదనపు భారం పడుతుంది. తీరా పంట చేతికి వస్తే గిట్టుబాటు ధర తక్కువ ఉండడంతో రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. దీనిని ఆసరాగా చేసుకున్న రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలిపిస్తే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకుంటున్నారు. తీర గెలిచాక ముఖం చాటేస్తున్నారు. వ్యవసాయ స్థితిగతులపై అధ్యయనం చేసిన స్వామి విశ్వనాథం కమిటీ ప్రభుత్వానికి పంటకి ఖర్చయ్యే వ్యయంతో పాటు అదనంగా యాభై శాతం మద్దతు ధర కల్పించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం మాత్రం ఆ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. పంటకు మద్దతు ధరలు పెంచితే తప్ప ముందుముందు వ్యవసాయం చేయడమే ఇబ్బందికరంగా మారుతుంది. రసాయనిక మందులు, అనేక కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. ఏ కంపెనీ ఒరిజినల్ ఏది నకిలీదో రైతులకు అంతుచిక్కడం లేదు. విపరీతమైన రేట్లతో పూటకో కంపెనీ పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. తీరా కొనుగోలు చేసి పంటకు పిచికారి చేస్తే ఆ మందు పనిచేస్తుందో లేదో అన్న భయం రైతుల్లో కలుగుతుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి సర్టిఫైడ్ చేసిన కంపెనీ విత్తనాలు కానీ, రసాయనాలు కానీ అందుబాటులోకి తీసుకువచ్చి రైతులు అప్పుల పాలు కాకుండా చేయాలి.

- సింగిరెడ్డి అశోక్ రెడ్డి

76618 01107



Next Story