ఇండియాలో ప్రాచీనులు తెలుగువారే!

by Ravi |   ( Updated:2023-10-03 01:00:43.0  )
ఇండియాలో ప్రాచీనులు  తెలుగువారే!
X

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సంస్కృతీకరణలో భాగంగా నడుస్తుంది. దీనికి కారణం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌ల వారికి భారతదేశ పూర్వ చరిత్ర తెలియకపోవడమే. ఇండియన్ హిస్టరీ భారత్ పదం ఆవిర్భవించక ముందు 10 వేల సంవత్సరాల నాటిది.నాగరికతలకు సంబంధించిన అంశాలు, ఖండాల పరంగా వచ్చినపుడు మనది ‘సింధూ నాగరికత’ అంటారు. సింధూ శబ్దం అతి ప్రాచీనమైనది. శబ్దాలన్నీ నాగరికతల నుండే ఏర్పడ్డాయి. సింధూ, మెసపుటోమియా, నైలు నది నాగరికతలు ఏర్పడ్డాయి. ప్రాచీన చరిత్రకు మూలమైన నాగాలు, శాసనాలు, వ్రాత ప్రతులు వంటి వాటిని పేర్కొనకుండా కేవలం వేదాల మీద ఆధారపడి చరిత్రను, సంస్కృతిని నిర్మించాలనుకుంటున్న సనాతన భావజాల కర్తలు... కేవలం వేదాల దగ్గరే ఇండియన్ హిస్టరీ ఉందనుకుంటున్నారు. అందువల్లే వారు భారతదేశ చరిత్రను కుదించాలి అనుకుంటున్నారు. దక్షిణ భారత భాషల్లో ఏ భారతీయ భాషలోను భారత శబ్దం లేదు. ఇండియన్ లాంగ్వేజస్ పుట్టు పూర్వోత్తరాల మీద కృషి చేసిన వారెవ్వరూ భారత్ శబ్దాన్ని పేర్కొనలేదు.

21 భాషలకు మూలం..

నిజానికి ఇక్కడి భాషలకు మూలం ద్రావిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధి చెందాయి. బ్రాహ్మయీ, మాల్తో, కూడుభ్, గోండి, కొండ, కోయి, మండ, పర్జి, గదబ, కోలామీ, పెంగీ, నాయకీ, కువి, తెలుగు, తుళు, కన్నడం, కొడుగు, తొద, కోత, మలయాళం, తమిళం మధ్య ద్రావిడ భాషల్లో తెలుగు వుంది. దక్షిణ ద్రావిడ భాషల్లో తమిళం వుంది. వాఙ్మయ దృష్టితో చూడకుండా భాషా చారిత్రక దృష్టితో చూస్తే మధ్య ద్రావిడ ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాడు మూల ద్రావిడ భాష నుంచి ఈ భాషలు స్వతంత్రతను సంతరించుకున్నాయని భాషా చరిత్రకారులు చెప్తున్నారు. ఒక స్వతంత్ర భాషగా రూపొందడానికి వీటికి వెయ్యి యేండ్లు పట్టింది. తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ తెలుగు తెగలమీద వుండటాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా కోయ భాషలో ఎన్నో తెలుగు పదాలు వున్నాయి. కోయ భాష మీద పరిశోధన చేసిన జె.కాయిన్ ఈ విషయాన్ని చెప్పారు. కోయ జాతి అతి ప్రాచీనమైనది మనకు సామాజిక శాస్త్ర చరిత్ర చెప్తున్న సత్యం. పైగా అది మాతృస్వామిక పునాది కలిగిన జాతి. ఉనికి ప్రాచీనమైంది. వీళ్ళని కోయలని, కొండులని, కూయిలని పిలుస్తారు. అతి ప్రాచీనమైన భాషా గణాల్లో కోయలు ఒకరు. అయితే ఈ కోయ భాషలో విశేషంగా తెలుగు వుండడం వీళ్ళు తెలుగు జాతి అవడం వల్ల రాతలేని తెలుగు అతి పురాతన కాలంలోనే వుందని మనకు అర్థమవుతుంది. తెలుగు భాష ప్రాచీనతను తెలుసుకోవాలంటే మనం ఇప్పటికీ తెలుగులో అతి ప్రాచీనులైన తెగల గురించి మనం పరిశీలించవలసిందే. ఇప్పటికి కోయల పాటల్లో తెలుగు శృతి, తెలుగు పదజాలం వుంది. వాళ్ళ నృత్యాలు కూడా మనం పరిశీలించవలసి ఉంది. భాషా చరిత్రకి, భాషా చరిత్రను మనం పరిశీలించినప్పుడు అది సామాజిక చరిత్ర నుండి రూపొందింది. లిపిలేని భాషలను వదిలివేస్తూ వెళ్లినంత కాలం అవి మౌలిక దశలో అంతరించే ప్రమాదం వుంది. తెలుగులో అతి ప్రాచీన జాతుల్లో సవరలు కూడా ఒకరు. వారి పాటలు మనకు ఆర్యులకు పూర్వం నాటివి.

నాగులే ఆంధ్రులు

ఇకపోతే దక్షిణ ఇండియా చరిత్రలో మహోన్నతమైన రాజ్యాలు విలసిల్లాయి. గుప్తుల కాలంలో హిందూ భావజాలానికి గురైనా బౌద్ధ సంస్కృతి వికాసం దక్షిణ ఇండియాలో నిరంతరంగా వర్థిల్లింది. అశోకుని ప్రభావం దక్షిణ ఇండియాలో చారిత్రకంగా పడింది. మరి ముఖ్యంగా మైసూరులో అశోకుని ప్రభావంతో బౌద్ధ సంస్కృతి విలసిల్లింది. ఈనాటి చారిత్రక తాత్విక, సాహిత్య, కళా కేంద్రంగా ఉన్న దక్షిణాది భాషలు ప్రజల జీవన సంస్కృతి నుండి పుట్టినవి. మౌలికమైన దక్షిణాది భాషల్లో కూడా ఎన్నో దక్షిణాది రాష్ట్రాలలో పొంగి పొర్లింది. జైన, బౌద్ధ, తాంత్రిక, సాంఖ్యయోగ వైవిధ్యం కూడా అసమానమైంది. ఇకపోతే ఆంధ్రజాతి నాగులుగా పిలవబడింది. నాగజాతికి ఆర్య జాతికి వున్న వైరుధ్యం భారతంలో వర్ణించారు. ఆర్యులకు నాగులు బద్ధ విరోధులని, నాగ సంతతిని నాశనం చేయడానికి వారు ఖాండన వనదహనం చేశారని, ఆ నాగులే కర్ణుడి అస్త్రంగా రూపొంది అర్జునుడిని హతమార్చాలని ప్రయత్నం చేశారనే భారత కథనం వల్ల ఆర్యులకు నాగులకు బద్ధ వైరం అనేది మనకు అర్థమవుతుంది. నాగులు బౌద్ధాన్ని ఆదరించినట్లు అంబేద్కర్ తన గ్రంథాల్లో పేర్కొన్నాడు. ఆంధ్రులు ఉత్తరాది భూముల్లో నివసించారనే వాదం కూడా వుంది. ‘వాయు బ్రహ్మాండాది పురాణాల్లో హిమాలయాలకు అవతలి ఉత్తర భూముల్లో నదీ తీరంలో ఆంధ్రులు నివసించిన సూచనలున్నాయి. మధ్య ఆసియాలోని ఆక్సన్ నదియే పురాణాల్లోని వక్షు (చక్షు) నది. ములకలు, దురదులు, పారములు, పహ్లాదులు మొదలైన తెగలు ఆంధ్రుల ఇరుగు పొరుగున ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

గాథా సప్తశతిలోనూ.. తెలుగు పదాలే

ఇకపోతే ప్రసిద్ధ చరిత్ర కారులు బి.ఎస్.ఎల్.హనుమంతరావు తన ఆంధ్రుల చరిత్రలో ఆంధ్రులు రుగ్వేద కాలం నాటివారని వారు నాగులుగా ఆర్యులతో పోరాడారని ఖాండవవన దహనం, సర్పయాగం తరువాత వారు వింధ్య పర్వతాల ఇవతలికి వచ్చారని, వారే ఆంధ్రులుగా పిలువబడ్డారని ఇలా నిరూపిస్తున్నారు. ‘ఋగ్వేద కాలంలో (క్రీ.పూ.2000) నాగులు పంజాబు ప్రాంతంలో నివసిస్తూ ఆర్య దండయాత్రలను తీవ్రంగా ప్రతిఘటించారు. వీరిని శశృదేవులని, ఆర్య కర్మలకు విరోధులని ఋగ్వేదం వర్ణిస్తున్నది. వీరు మదనోత్సవాలలో ప్రధానాంశమైన లింగారాధకులయినట్లు గ్రహించవచ్చు. నాగులకు, ఆర్యులకు జరిగిన తీవ్ర సంఘర్షణలో ‘ఖాండవ దహనం’ జనమేజయ ‘సర్పయాగం’ రెండు ముఖ్య ఘట్టాలు. ఈ ప్రమాదం నుండి తప్పించుకున్న నాగులు దక్షిణంగా వలస వచ్చి కృష్ణా ముఖద్వారంలో స్థిరపడి ఉంటారు. అమరావతీ శిల్పాలలోని రాజులకు రాణులకున్న సర్ప కిరీటాలు వారి జాతీయతకు చిహ్నాలే.

ఇకపోతే భారతదేశంలో రెండవ అతి ప్రాచీన గ్రంథం రెండవది గాథా సప్తశతి. సుమారు వెయ్యి సంవత్సరాలు తెలుగు వారి మీద పరిపాలన చేసిన ప్రాకృత సంస్కృత భాషల పెత్తనాన్ని తట్టుకొని అది నిలబడడం ఒక ఎత్తైతే ఆ సందర్భంగా తెలుగు వాఙ్మయం గ్రంథస్థం కాకుండా పోయింది. ప్రాకృత భాషలో వచ్చిన వాఙ్మయంలో పేర్కొనతగింది. హాలుడు శాతవాహన చక్రవర్తి. ఇతడు పండితుడు కవి. ఎందరో కవుల్ని పండితుల్ని పోషించాడు. ఎందరో కవులకు ఆశ్రయమిచ్చాడు. ఆ కవులందరి కవితలను కూర్చి శ్రీ పాలితుడు అనే కవి గ్రంథంగా చేసి గాథాసప్తశతి పేరు పెట్టి హాలుని పేర ప్రకటించాడు. ఇందులో 350 మంది కవులు వున్నారు. ఇందులో ప్రముఖంగా తెలుగు పదాలు పేర్కొనబడ్డాయి. సప్తశతిలోని కొన్ని గాథలను హాలుడే రచించాడు. హాలుని పట్టపురాణి మలయవతి. ఈ చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే భారత్ అనే కొత్త శబ్దం వాడుకలోకి తీసుకురావడం వలన ఇండియా తన ఐడెంటిటీని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది భారత దేశానికి చాలా నష్టం. భారతదేశం, హిందూ దేశం, ఇండియా అనే మూడు పేర్లలోనూ జాతి, మత, లింగ, కుల, వర్ణ ప్రాంతాలకు అతీతమైన పేరు ఇండియా. అంబేద్కర్, మహాత్మా ఫూలే, పెరియార్ ఈ దృక్పథంతోనే తమ గ్రంథాలు రాశారు.

డా. కత్తి పద్మారావు

98497 41695

Advertisement

Next Story