నీటిని నిల్వ చేసే చెట్టు

by Ravi |   ( Updated:2024-04-03 00:45:27.0  )
నీటిని నిల్వ చేసే చెట్టు
X

సమీప భవిష్యత్తులో జల యుద్ధాలు తప్పదనిపిస్తున్న సందర్భంగా నీటిని నిల్వ చేసి ఉంచుకునే చెట్టు ఉందని మీకు తెలుసా? వేసవిలో లీటర్ల కొద్దీ నీటిని తన మొదలులో నిల్వ చేసే చెట్టు భారతదేశంలో ఉందంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది నిజం.

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంప ఏజెన్సీలోని పాపికొండ నేషనల్ పార్క్‌లో ఈ చెట్టు విశేషాలు ఇటీవలే బయటపడ్డాయి. ఈ అరుదైన విషయం మనకు తెలియకపోవచ్చు కానీ గోదావరి ప్రాంతంలోని పాపికొండల కొండ శ్రేణిలో నివసించే గిరిజన సమూహమైన కొండారెడ్డి తెగ ప్రజలకు దీని గురించి చాలా కాలంగా తెలుసు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంప ఏజెన్సీలోని పాపికొండ జాతీయ ఉద్యానవనంలో కనిపించే భారతీయ లారెల్ చెట్టు (టెర్మినాలియా టోమెంటోసా) బెరడును గత శనివారం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు కట్ చేసి ఈ సత్యాన్ని కనుగొన్నారు. ఈ చెట్టు వేసవిలో నీటిని నిల్వ చేస్తుందని గిరిజనులు పేర్కొంటున్నట్లుగా, నిజంగా, ఈ చెట్టు నీటిని నిల్వ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి అటవీ అధికారులు ప్రయోగం చేశారు.

చెట్టు నుంచి ఫోర్స్‌గా నీరు..

జాతీయ ఉద్యానవనంలో వారి సాధారణ సందర్శనలో భాగంగా ప్రయోగాన్ని నిర్వహిస్తున్న బృందానికి రంపచోడవరం డివిజనల్ అటవీ అధికారి జి.జి. నరెంతెరన్ నాయకత్వం వహించారు. “మేము పాపికొండ నేషనల్ పార్క్‌లోని బెరడును తొలగించినప్పుడు ఇండియన్ లారెల్ చెట్టు నుండి నీరు ఫోర్స్‌గా బయటకు చిమ్మింది. వేసవి కాలంలో, భారతీయ లారెల్ చెట్టు బలమైన వాసన, పుల్లని రుచిని కలిగి ఉండే నీటిని నిల్వ చేస్తుంది. భారతీయ అడవులలోని చెట్లలోని అద్భుతమైన అనుసరణను ఈ నీటిని నిల్వ చేసే చెట్టు ద్వారా గమనించవచ్చు, కొండా రెడ్డి తెగ వారు ఈ చెట్టు గురించి వారి స్థానిక జ్ఞానాన్ని అధికారులతో పంచుకున్నారని ఆయన వివరించారు.

దశాబ్దాల పాటు నీటిని దాచుకుంటుంది.

ఈ అరుదైన చెట్టును ఇండియన్ సిల్వర్ ఓక్ (మస్తీక వృక్షం) అని పిలుస్తారు. ఈ చెట్టు కలప గొప్ప వాణిజ్య విలువను సైతం కలిగి ఉంది. అయితే, అటవీ అధికారులు, జాతుల పరిరక్షణ చర్యలో భాగంగా ఈ చెట్టు ఖచ్చితమైన స్థలాన్ని వెల్లడించలేదు. ఈ చెట్టు దశాబ్దాలపాటు ఈ చెట్టు ఇలా లీటర్ల కొద్దీ నీటిని తన మొదలులో దాచుకుంటుందట. ఇది ఈ చెట్టును ఆశ్రయించే కీటకాలకు ఉపయోగపడుతుందని ఒక అభిప్రాయం. అలాగే వేసవిలో నక్సలైట్లు తాగునీటి కోసం ఈ చెట్టుపై ఆధారపడతారని మరో అభిప్రాయం కూడా ఉంది.

వృక్ష శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, ఇండియన్ సిల్వర్ ఓక్ చెట్టు (వెండి ఓక్ చెట్టు) తన మొదలులో నీటిని నిల్వ చేసే విచిత్రమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఈ నీరు తాగడానికి యోగ్యమైనది. ఔషధ కోణం నుండి కూడా ఈ నీరు మంచిదని ఇది వ్యాధి నివారణ విలువను కలిగి ఉంటుందని, కడుపు నొప్పిని నయం చేయడంలో కూడా సహాయపడుతుందని నిపుణుల మాట. ప్రధానంగా దీని బెరడు అగ్ని నిరోధక లక్షణాలను కూడా ప్రదర్శిస్తుంది, అయితే దాని కలపను ఫర్నిచర్, సంగీత వాయిద్యాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

జలయుద్ధాలు తప్పదనిపిస్తున్న పరిస్థితుల్లో..

నల్ల మద్ది అనే పేరు కూడా ఉన్న ఈ చెట్టు ఆకులు ఆంథెరియా పాఫియా అనే శాస్త్రీయ పేరున్న సిల్క్‌వార్మ్‌లకు ప్రాథమిక ఆహార వనరుగా పనిచేస్తాయి, టస్సార్ సిల్క్ అని పిలువబడే వాణిజ్యపరంగా విలువైన అడవి పట్టును కూడా ఈ చెట్టు అందిస్తుంది. క్రొకోడైల్ బార్క్ ట్రీ (Crocodile Bark Tree) అనే పేరు కూడా ఉన్నటువంటి, తాగునీటిని వేసవిలో అందించే ఇలాంటి చెట్లు భారతదేశంలోని అటవీ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉన్నాయని వీడియోలు చెబుతున్నాయి. ప్రకృతి అందిస్తున్న అరుదైన చెట్లుగా ఇవి శాస్త్రపరంగా గుర్తింపు పొందాయి కూడా.

భారతదేశంలోని అన్ని నగరాల్లోనూ ఈ సిల్వర్ ఓక్ చెట్టును యుద్ధ ప్రాతిపదికన నాటాలని, నీటి కరువుతో అల్లాడుతున్న బెంగళూరు వంటి నగరాలకు ఇలాంటి చెట్టు ఎంతో అవసరమని నెటిజన్లు పేర్కొంటున్నారు. మాపుల్ చెట్ల (maple trees) నుంచి వచ్చే నీరు కూడా తాగడానికి బాగుంటుందని మరో వార్త. ఏదేమైనా భవిష్యత్తులో జల యుద్ధాలు తప్పదనిపిస్తున్న సందర్భంగా నీటిని నిల్వ చేసి ఉంచుకునే చెట్ల గురించిన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది.

ప్రత్యూష

79893 74301

Advertisement

Next Story