- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువతా.. కేసీఆర్‌ను గద్దె దింపండి!
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ఏళ్లుగా కేసీఆర్ చేస్తున్న నియంత పాలన, కుటుంబ పాలన, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది. మూడోసారి అధికారం ఇవ్వండి అంటూ మాయమాటలతో, కట్టు కథలతో, డ్రామాలతో ఓట్లకు వస్తున్న బీఆర్ఎస్‌కి ఓటు వేస్తే మళ్ళీ అయిదు సంవత్సరాలు ఆగం కావాల్సి వస్తుంది. అలోచించండి, ఆలోచింపచేయండి, మనం కళలు కన్నా తెలంగాణ ఏంది? ఉద్యమ ఆకాంక్షలు, నినాదాలు ఏమయ్యాయి? నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఏందో? వచ్చిన ప్రత్యేక తెలంగాణలో రెండుసార్లు గెలిచి అధికారం చేపట్టిన కేసీఆర్ ఏ విధమైన ప్రజా, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలు అవలంబించిండో మనమందరం చూసిందే, ఇబ్బందులు అనుభవించిందే.
నియంత పాలన సాగించి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడితే.. పదేళ్ళలో అప్పుల రాష్ట్రంగా మార్చి ప్రతి తెలంగాణ పౌరుని మీద అప్పు పెట్టిన ఘనత కేసీఆర్‌దే! గత ఎన్నికల్లో అనేక హామీలు వాగ్దానాలు ఇచ్చిన కేసీఆర్, రెండుసార్లు అధికారం చేపట్టిన హామీలు అమలు కాలేదు, మొదటిసారి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ఒకేసారి అన్ని చేస్తామా? ఇప్పుడే పుట్టిన బిడ్డ లాంటి రాష్టం కదా ఇంకోసారి అధికారం ఇయ్యండని కట్టుకథలు చెప్పి, రెండోసారి అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్ నిధులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, అందరికీ దళిత బంధు, అర్హులందరీకి బీసీ బంధు, కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు వంటివేవి ఇవ్వలేదు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం జరగలేదు.. కానీ తెలంగాణను బంగారు తెలంగాణ చేశామంటున్నారు. వారి బంగారు తెలంగాణ నినాదం కేసీఆర్, బీఆర్ఎస్ పాలైంది తప్ప, ప్రజల జీవన ప్రమాణాలు మారలేదు, ఇంటికో ఉద్యోగం లేదు.. కానీ కేసీఆర్ ఇంట్లో అయిదు ఉద్యోగాలు ఉన్నాయి. పైగా ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు తీరని అన్యాయం చేశారు. అమరవీరుల కుటుంబాలకు పట్టించుకోలేదు, ప్రజా సమస్యలపై వినతి పత్రాలు కూడా తీసుకోకుండా ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, ఉద్యోగ సంఘాలను ముందస్తు అరెస్టులు చేయించి జిల్లాల పర్యటనలు చేసి నియంత పాలన చేశారు.
ఆలోచించి ఓటు వినియోగించండి!
పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు చేసి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం చేసినారు, నాణ్యత లేకుండా ప్రాజెక్ట్‌లు కట్టడం వల్ల నీటిని గోదావరి పాలు చేశారు. రెండుసార్లు అధికారంలో ఉండి ఒక్కనాడు కూడా ప్రజలను ప్రగతి భవన్‌కి రానివ్వని వారు నేడు ఓట్లకోసం తిరగని చోట తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారు. తొమ్మిది ఏళ్లుగా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎన్నికలు రాగానే మల్లోసారి అధికారం ఇస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అంటూ కోచింగ్ సెంటర్లకు వస్తున్న కేటీఆర్ గారికి తొమ్మిది ఏళ్లుగా ఎందుకు నిరుద్యోగులు గుర్తుకు రాలేదు? కానిస్టేబుల్, గ్రూప్స్ పరీక్షల్లో తప్పులు లీకేజీలు జరిగాయని రోడ్ ఎక్కి ఉద్యమిస్తే కేసులు పెట్టించింది మీరే కదా! తొమ్మిది ఏళ్లుగా అప్రజాస్వామిక పాలన చేసిన కేసీఆర్ పార్టీనీ ఓడించడానికి తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువత సిద్ధం కావాలి! మళ్ళీ కేసీఆర్ చెప్పే మాయమాటలను నమ్మి బీఆర్ఎస్‌కి ఓటు వేస్తే 5 సంవత్సరాలు, 1825 రోజులు బతుకులు మళ్ళీ ఆగం అవుతాయి. ఓటర్లు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ పాలనలో యువతకు ఎంత అన్యాయం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు విద్యార్థులకు కలిగాయో, ఎన్ని హామీల అమలు విస్మరించారో.. గుర్తుకు తెచ్చుకొని ఓటు వేయండి. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం.
కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
75695 48477