సమస్యల వలయంలో రెసిడెన్షియల్ పాఠశాలలు

by Ravi |   ( Updated:2023-02-24 01:37:59.0  )
సమస్యల వలయంలో రెసిడెన్షియల్ పాఠశాలలు
X

మ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో సరైన సదుపాయాలు కల్పించడంలో నాటి ప్రభుత్వం విఫలం అయింది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా వీరికి సౌకర్యాలు కల్పిస్తుందేమోనని అనుకుంటే ఇప్పటికీ ఆ పాఠశాలల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటోది. ప్రభుత్వానికి వారు చదువుకోవడం ఇష్టం లేదా? వారిని ఇంకా బానిసలుగానే చూడటమే ప్రభుత్వ ఉద్దేశమా? ఈ నిర్లక్ష్యం దేనికి సంకేతం? రాష్ట్రంలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించామని గొప్పగా చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆ పాఠశాలలకు వసతులు సరిగా ఏర్పాటు చేయనవసరం లేదా? కొన్ని పాఠశాలల్లో స్కూల్ తెరిచే సమయానికి అందరికి సరిపోయినన్ని పుస్తకాలు, యూనిఫాం, నోట్‌పుస్తకాలు అందించడంలో విఫలం అవుతుంది. అలాగే ఆ పాఠశాలల్లో పరిశుభ్రమైన వంటశాల, మరుగుదొడ్లు, టాయిలెట్స్ లేవు, కొన్ని పాఠశాలల్లో లైబ్రరీ, కంప్యూటర్లు లేవు. సౌకర్యాల లేమితో ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాల్సిన పిల్లలు అసౌకర్యానికి గురవుతున్నారు.

ఇటీవల ఒక ఎస్సీ సోషల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించిన నేను అక్కడ పదినిమిషాలు కూడా ఉండలేకపోయాను దానికి కారణం, అక్కడ డ్రైనేజీ పొంగి దుర్గంధం రావడమే. అక్కడున్న పిల్లలను అడిగితే 15 రోజుల నుండి ఆ సమస్య అలాగే ఉందనే సమాధానమొచ్చింది. అలాగే క్లాస్‌రూంకి, డార్మెట్రీకి కిటికీలు లేవు, క్లాస్‌రూంలో ఫ్యాన్లు లేవు సరైన వసతులు కల్పించలేనప్పుడు ఆగమేఘాల మీద పాఠశాలలు ఎందుకు ప్రారంభించినట్టు? స్వార్థం కోసం కమీషన్ల కోసం కొన్ని పాఠశాలలను విశ్వవిద్యాలయాల స్థాయిలో కట్టించిన ప్రభుత్వం మిగతా పాఠశాలలను ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట నిర్ణయించిన మెస్ చార్జీలను ఇప్పటికి కొనసాగిస్తున్నారు. ఇప్పటికి, అప్పటికి ధరలు పెరగలేదా? ప్రస్తుత ధరలకు ఆ మెస్ చార్జీలు సరిపోతాయా? ఆ చిన్నారులపై కక్ష ఎందుకు? లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం, కొత్త సెక్రటేరియట్ కడుతున్న ప్రభుత్వానికి ఈ సమస్యలు తెలియదా? రెసిడెన్షియల్ పాఠశాలలోని సమస్యలు తీర్చడానికి వారికిచ్చే నిధులను ఇకనైనా పెంచాలి.

మల్ల్కేడి‌కార్ కొండల్

90107 79981

Also Read...

Team George: ఎన్నికలను ప్రభావితం చేసే సాఫ్ట్‌వేర్!


Advertisement

Next Story

Most Viewed