ఉపకులపతులు ఉన్నతులేనా..!

by Ravi |   ( Updated:2024-06-29 01:00:36.0  )
ఉపకులపతులు ఉన్నతులేనా..!
X

విశ్వవిద్యాలయాల్లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉపకులపతుల (వీసీ) పాత్ర కీలకం. ఇలాంటి ప్రతిష్టాత్మక పదవుల్లో నియమించబడేవారు. ప్రతిభావంతులు, వృత్తిరీత్యా కళంకం లేనివారు, మేధావులై ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, కేవలం కాలయాపన కోసం ప్రత్యేకాధికారులను నియమించి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా రెండేళ్ల పాటు వీసీల నియామకం జరగలేదు. అనేక పోరాటాల అనంతరం కొత్త ప్రభుత్వం తిరిగి దీనిపై కసరత్తు మొదలుపెట్టింది.

వాస్తవానికి ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ ముగ్గురిపేర్లను ప్రతిపాదించి గవర్నర్‌కు పంపిస్తే, అందులో ఒకరిని ఆమోదిస్తూ వీసీగా నియమిస్తారు. కానీ, గత ప్రభుత్వ పాలనలో ఇది అమలు కాలేదు. ‘నిర్ణీత అర్హత’ లేకపోయినా కేవలం ప్రభుత్వ విధేయులన్న కారణంతో కొందరిని అందలమెక్కించారు. వీరిలో పలువురు పదవీకాలం పూర్తయ్యేవరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం గమనార్హం. గౌరవప్రదమైన పదవికి వీరు కళంకం తీసుకొచ్చారు. ఒకరు అనిశాకు చిక్కితే, మరొకరిపై విజిలెన్స్ విచారణ చేపట్టడం పరిస్థితికి అద్దం పడుతోంది. యూనివర్సిటీల్లో పాలకవర్గ ప్రమేయం లోపించడం, రాజకీయ జోక్యం పెరగడంతో వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారుల అవినీతి చర్యలు, వీసీ పాలకవర్గాల మధ్య గొడవలు.. ఇలా పలు ఆరోపణలతో నిత్యం వార్తల్లో నానుతున్నాయి.

సమర్థవంతమైన కార్యచరణ చేయాలి!

వీసీ (వైస్ చాన్సలర్) అంటే... ప్రభుత్వం- సమాజ భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయ పాత్రను ప్రతిబింబించేలా కొత్త ఆలోచనలు చేయాలి. నవీన ఆవిష్కరణలతో ఉన్నత విద్యలో సాంకేతికత పాత్రను సంస్థాగత అభివృద్ధి కోసం వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. అదే సమయంలో గ్లోబల్ ఉన్నత విద్యా ధోరణులను అర్థం చేసుకోవడం, విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ వేదిక పైకెక్కించే సామర్థ్యం ప్రదర్శించాలి. విద్యార్థి కేంద్రీకృత దృష్టి నైపుణ్యం కలిగి ఉండి, బలమైన విద్యా నేపథ్యం, ఆర్థిక చతురత, బోధన, అధ్యాపకుల అవసరాలు, సవాళ్లను అర్థం చేసుకోవడంలో అనుభవం, పారదర్శకమైన జవాబుదారీతనం, సమర్థవంతమైన కార్యాచరణ నైపుణ్యంతో విశ్వవిద్యను పరుగులు పెట్టించే ఉన్నతమైన గుణం కలిగి ఉండాలి. అప్పుడే ఆ విశ్వవిద్యాలయం ఆశించిన ఫలితాలనిస్తుంది. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత పదేళ్ళలో వీసీలుగా ఎంపిక అయిన అనర్హులు అవినీతి మరకలతో ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు కోకొల్లలు. తగిన పరిపాలనా నైపుణ్యం, వ్యూహాత్మక నైతిక నాయకత్వం కొరవడిన వారికి అవకాశమివ్వడంతో ఈ దుస్థితి దాపురించిందనేది నిర్వివాదాంశం.

ఎంపికలో గవర్నర్ సూత్రధారి..

విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఎంపికలో గవర్నర్ విధులే కీలకం. విశ్వవిద్యాలయాల లక్ష్యం, రాష్ట్రం లేదా ప్రాంతం విస్తృత విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఎంపిక ఉండాలి. న్యాయమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన ఈ ఎంపిక ప్రక్రియలో సంబంధిత చట్టాలు, నిబంధనలు, సంస్థాగత విధి విధానాలకు అనుగుణంగా లోబడి ఉండేలా గవర్నర్ దృష్టి కేంద్రీకరించాలి. ఇందులో పర్యవేక్షణ, ఆమోదం, సంప్రదింపులు ప్రక్రియ అంతటా సమగ్రతకు చెందిన ఉన్నత ప్రమాణాలను నిర్వహించడం వంటి అంశాలు ఉండాల్సిందే. ఉన్నత విద్యా సంస్థలతో సమన్వయం కలిగి ఉండి, ప్రత్యేకించి గవర్నర్ బోర్డులో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా పనిచేసే విశ్వవిద్యాలయాలలో బాధ్యతతో తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. సెర్చ్ కమిటీలు సిఫార్సు చేసిన అభ్యర్థుల తుది జాబితాను సమీక్షించవచ్చు. వైస్ చాన్సలర్ల నియామకం ప్రాముఖ్యతను, సమాజం ఆశించిన ప్రభావాన్ని నొక్కి చెప్పాల్సిన బాధ్యత కూడా గవర్నర్ పైనే ఉంటుంది.

మసక బారిన వర్సిటీల ప్రతిష్ట

యూనివర్సిటీల ఆస్తులను పరిరక్షించలేదనే విమర్శలు, విద్యార్థుల ఆందోళనలు, ఉద్యోగుల సమస్యలను విస్మరించారు. ఉద్యమాలకు ఊపిరిపోసిన విశ్వవిద్యాలయాల్లో అధికారుల అప్రకటిత నిషేధాజ్ఞలు, విద్యార్థుల హక్కుల హననంపై ప్రశ్నించిన వారిపై పోలీసు అవుట్ పోస్టుల్లో ఖైదు చేయడం, కేసుల నమోదు వంటి చర్యలతో అణచివేత ధోరణికి పాల్పడ్డారు. చివరకు అవినీతి మరకలతో పదవీ విరమణ పొంది తప్పించుకున్నారు. సరస్వతీమాత ఒడిలో మరణమృదంగంలా విద్యార్థుల ఆత్మహత్యలు, అసౌకర్యాలు, ఆరోపణలు, నిరసన ఉద్యమాల మధ్య ‘బాసర ఆర్జీయూకేటీ’ ప్రాశస్త్యం దెబ్బతింటున్నా.. ఇన్చార్జి వీసీతో నెట్టుకొచ్చారే తప్ప శాశ్వత చర్యలను విస్మరించారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల ప్రతిష్ట క్రమేపీ మసకబారుతోంది.

'పేద' విద్య బతికేనా..

గత పదేళ్లుగా నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ చర్యలు కంటితుడుపు చర్యగా మారాయి. వీటిని అధిగమించేందుకు పాదర్శకంగా ప్రతిభావంతులైన వీసీల నియామకం జరిగేలా చూడాలి. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేలా, విద్యాప్రమాణాలు పెంపొందించేలా బోధకుల నియామకం చేపట్టాలి. ప్రత్యేక నిధుల కేటాయింపుతో మౌలిక వసతులు ఊపందుకోవాలి. పరిశోధనలకు ఊతమివ్వాలి. కొనఊపిరితో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోడైతే, యూజీసీ నుంచి నిధుల వరద పెరిగి ప్రోత్సాహకాలు అందుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. వీటిపల్ల ‘న్యాక్ అక్రిడేషన్లు’ దక్కడమే కాదు, అంతర్జాతీయంగా విదేశీ యూనివర్సిటీలకు దీటుగా మన విశ్వవిద్యాలయాలు ఎదుగుతాయి. తద్వారా..పేద, మధ్యతరగతి విద్యార్థులు ‘ఉచితంగా ఉన్నతవిద్య’ను అందుకునేందుకు రాజమార్గం ఏర్పడుతుంది. ఈ దశలో ఉన్నతవిద్యలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులకు, నూతన ఆవిష్కరణలకు, సంస్కరణల అమలుకు అనుగుణంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు వేగంగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.

ప్రక్రియలో చొరవే కీలకం..

వైస్ చాన్సలర్ల పదవీకాలం పూర్తవడంతో నూతన ప్రభుత్వం తాత్కాలికంగా మళ్లీ ఇంచార్జ్‌ల పాలన చేపట్టింది. అదే సమయంలో నూతన వీసీల నియామక ప్రక్రియనూ వేగవంతం చేసింది. పలు ప్రభుత్వ విభాగాలు సేకరించి సమర్పించిన నివేదికలతో దాదాపుగా ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లుగా ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే ఈ నెల చివరి వారంలో గవర్నర్ నూతన వైస్ చాన్సలర్లను ప్రకటించే అవకాశం ఉంది. నిర్వీర్యమైన విశ్వవిద్యాలయాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయిలో నూతన పాలకవర్గాలను ఏర్పాటుకు చొరవ చూపాలి. అదే సమయంలో గత అనుభవాల పరంపరలో గవర్నర్(కులపతి) పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. రాజకీయాలకు అతీతంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అవకాశం లేకుండా, సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని విశ్వవిద్యాలయాలకూ ‘సమన్యాయం’ చేస్తూ ప్రతిభావంతులైన వారిని నూతన వీసీలుగా నియమిస్తే, ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తే విశ్వవిద్యాలయాల పూర్వవైభవానికి మార్గం సుగమం అవుతుంది.

నంగె శ్రీనివాస్

ప్రిన్సిపాల్, విద్యా విశ్లేషకులు

94419 09191

Advertisement

Next Story

Most Viewed