- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆదివాసీల దీపావళి..
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖమైన ఆదివాసి తెగ రాజ్‌గోండ్‌లు. వీరు దీపావళి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వీరు తమ గూడేలలో నెలరోజుల ముందు నుండి సంబరాలు మొదలుపెడతారు. దీపావళికి కొద్దిరోజుల ముందు గుస్సాడీ, దండారి కళా బృందాలు వివిధ గ్రామాలలో ప్రదర్శనకు వెళతాయి. ఈ ప్రాంతం అంతా డప్పులు, డోలు, గుమేలా, పార, కాలికొం తదితర సంగీత వాయిద్యాల చప్పుళ్లతో మార్మోగుతుంది. బారులు తీరిన జన సమూహం ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రదర్శనకై తరలి వెళ్తుం టారు. ప్రర్దాన్ తెగవారు కాలికొమ్ (బాక లాంటిది) ఊదుతుంటే రెండు, మూడు కిలోమీటర్ల అవతల దూరం వరకు వినపడుతుంది. ఈ శబ్దాన్ని బట్టి వారు వస్తున్నట్టు కబురు అందుతుంది. ముందర డప్పులు మోగిస్తుంటే వెనక చక్కటి స్వచ్ఛమైన తెల్లటి పంచె, చొక్కా, కండువా, తలపాగా, కళ్లకు అద్దాలు ధరించి రాజఠీవీతో గోండులు వెనక నడచి వెళ్తుంటే వీరి వెనకాల గుస్సాడీ బృందం వస్తుంది. ఈ గుంపు బృందాన్ని ‘దండారి’ అంటారు.
ఈ నెలలోనే ఎందుకు?
ఈ సమయంలో పొడి వాతావరణం పంటలు (తృణ ధాన్యాలు, మొక్కజొన్న) వరి వంటివి కోస్తారు. ఇతర వర్షాధార పంటలు చేలలో ఉంటాయి. ఈ పంటలు దీపావళికి ఇంటికి చేరుతాయి. ఇదే సమయంలో దండారి గుస్సాడీ సమయం కూడా. ఇదే సమయంలోనే ఆదివాసీలకు ఆహారం అందుబాటులో ఉంటుంది. చేతిలో డబ్బులు కూడా ఉంటాయి. చల్లటి చల్లటి వాతావరణం మొదలవుతుంది. చల్లటి రాత్రుల తర్వాత వచ్చే గాలులు వీచే ఉదయాలు ధాన్యపు నిల్వలపై మంచు కురవడం అలాగే నీలిరంగు మబ్బు లోయల్లో నుండి పైకి రావడం ఆకుపచ్చని అడవి తల్లి, పంటలు కొద్దిగా ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ చలికాలం ఒళ్లు గగుర్పొడిచే వాతావరణం గోండు ప్రజలపై అసలు ఎలాంటి ప్రభావం చూపదు. దసరా పండగ తర్వాత రెండు, మూడు వారాలు పూర్తిగా గ్రామంలోని (గోండుల వారి)పాటలు, నృత్యాలు' సంగీత వాయి ద్యాలు చప్పులతో ఆనందంగా గడుపుతారు. యువ కుల బృందాలు ఆనందంతో ఒక గ్రామం నుండి మరో గ్రామానికి నృత్య ప్రదర్శనకు అతిథిగా వెళ్లి ప్రదర్శించి మానవ సంబంధాలు పెంపొందించుకుంటారు. బంధుమిత్రులు ఇక్కడ కలుసుకుంటారు. ఒక్కోసారి వివాహ సంబంధాలు కూడా చూస్తారు..
సంగీత వాయిద్యాలకు పూజ..
పౌర్ణమికి ముందుర ఒక మంచి రోజు చూసి ఆకాడి డప్పులు ఆటక మీద నుండి దింపి శుభ్రం చేసి కోడిని బలి ఇచ్చి డప్పులపై రక్తం చల్లుతారు. దండారి పండుగ అయ్యేవరకు అందరూ బాగుండాలని ''రౌర్'' అన్నదమ్ములను ప్రార్థిస్తారు. ఈ ప్రారంభ రోజును ''భోగి'' అని సాంప్రదాయ పూజలతో మొదలవుతుంది. భోగి రోజున సంగీత వాయిద్యాలు పారా, గమేల, మద్దెలకు పూజతో మొదలై గుస్సాడీ దండారి ముగింపును 'కోలభోడి' అనే కార్యక్రమంతో దీపావళి అనంతరం ముగిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం తమ ప్రముఖ దైవమైన గోదావరి నది ఒడ్డున గల ‘పద్మల్ పురి కాకో’ ఆలయానికీ గుస్సాడీలతో వెళ్లి నృత్యాన్ని ప్రదర్శించి తమ కులదైవాన్ని ప్రార్థిస్తారు.
నృత్య కళా ప్రదర్శన
నృత్య బృందంలో ప్రదర్శించే గుస్సాడీ వారి వేషధారణలో శరీరానికి పూర్తిగా తెలుపు లేదా నల్లని రంగుని పూసుకుంటారు. విభూతి, సుద్ద మన్ను, సున్నాన్ని రాసుకుంటారు లేదా నల్లని రంగులను వేసుకుంటారు. ఈ వేషం ధరించిన గుస్సాడీ వ్యక్తి నియమనిష్టలను పాటిస్తూ వ్యవహరిస్తుంటారు. ఈ వేషం వేసుకున్న నాటి నుండి దేవతలు వారి మీద వాలుతారని వీరి నమ్మకం. వీరు తలపై ధరించి నెమలి కిరీటాన్ని నెమలి ఈకలతో గట్టిగా తయారుచేస్తారు. గొర్రె కొమ్ములతో వీటిని పటిష్టంగా తయారుచేస్తారు. ఈ నెమలి ఈకలకు రంగులు, పూసలు, అద్దాలు వివిధ అలంకరణ సామాగ్రితో అలంకరించుకుంటారు. గుస్సాడీ మెడనిండా పూసాలు, ఒంటి నిండా బూడిద, నత్త గుల్లల గవ్వల దండలు, నడుముకు ఎండు గడ్డి విత్తనాలు, వివిధ రకాలైనటువంటి వాటిని ధరిస్తారు. నడుముకు జింక చర్మం, కాళ్లకు గజ్జలతో గుస్సాడీ కళాకారుడు చేతిలో దండంతో అలంకరించిస్తారు. అయితే వీళ్ళని దేవతల ప్రతినిధులుగా భావిస్తారు. అందుకని వేరే గ్రామం నుండి వచ్చిన గుస్సాడీ ప్రదర్శనకు వచ్చే గుస్సాడీలను వారు ఆ గ్రామ దేవతలను తీసుకువస్తారని వీరి నమ్మకం. ఆతిథ్యం ఇస్తున్న గ్రామాలు గుస్సాడీలు దేవతలతో కలిసి నృత్యం చేసి తమను ఆశీర్వదిస్తారని భావిస్తారు. ఎన్ని గ్రామాల నుండి దండారీలు బృందాలు వారి గ్రామానికి వస్తే అంత మంచిదని శుభంగా భావిస్తారు.
ఈ నృత్యాన్ని బతికించడానికి..
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుస్సాడీ నృత్యాన్ని బతికించడానికి ప్రముఖులు కృషి చేస్తున్నారు. చాలా మంది ఈ నృత్యానికి వన్నె తెచ్చారు. వారిలో ఊట్నూరు ఐటీడీఏ ఏపీవోగా పనిచేసిన ఆదివాసి ఐఏఎస్ మడావి తుకారం చాలా కృషి చేశారు. ఈ నృత్య ప్రదర్శన కళాకారుడైన మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజుకి 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. అలాగే ఊట్నూర్‌లోని కొమరం భీం కాంప్లెక్స్‌లో కనకరాజు గుస్సాడీ కళా శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. యువతి, యువకులకి నృత్యం నేర్పించడం, నెమలి కిరీటాల్ని తయారీ, పాటలు పూర్తిగా ఉచితంగా నేర్పిస్తున్నారు. అలాగే భావితరాలకు తమ నృత్యం అందిచాలని, అలాగే కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారు. పద్మశ్రీ కనకరాజు ఈ నెల 25 న కన్నుమూశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుస్సాడి బృందాలకు 15 వేల ఆర్థిక సహాయం ఐటీడీఏ ద్వారా అందిస్తున్నారు.
(ఆదివాసీ గూడేల్లో దీపావళి సందర్భంగా)
-డా. తూము విజయ్ కుమార్
94927 00653