- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బోధనలో టీచర్లకు స్వేచ్ఛ ఏది?
ప్రభుత్వ బడులలో చదువుకొని అత్యున్నత స్థానాలకు చేరుకున్న వారు కోకొల్లలు. వారిలో ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మేధావులను తయారు చేసిన ఘనత ప్రభుత్వ బడులకుంది. దీనికి కారణం.. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ అందించిన అత్యుత్తమ బోధన! కానీ నేడు ప్రభుత్వ బడులలో ఆ పరిస్థితి కనబడుతుందా?
నేటి ప్రభుత్వ బడుల పరిస్థితికి కారణం ప్రభుత్వమా? ఉపాధ్యాయులా? అధికారులా? గత దశాబ్ద పాలనలో విద్యాశాఖ గాడి తప్పిందని చెప్పక తప్పదు. పాలకులు ఈ శాఖపై సమీక్ష చేసిన దాఖలాలు శూన్యం. తెలంగాణలో గత ప్రభుత్వం విద్యార్థుల సామర్థ్యం పెంచడానికి దశాబ్ద కాలంలో అనేక పేర్లతో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. అయితే, ఇది సాధించలేక పోవడానికి కారణాలు మాత్రం అనేకం! బడులలో టీచర్లు చదువు చెప్పకపోవడాన్నే సాకుగా చూపిస్తున్నారు. అయితే ఉన్నత అర్హతలు కలిగిన టీచర్లను కేవలం బోధనకే పరిమితం చేస్తే విద్యార్థులకు కనీస సామర్థ్యాలను నేర్పించడం పెద్ద కష్టమేమీ కాదని గుర్తుంచుకోవాలి.
బోధనకు సమయమెక్కడ?
కేంద్రం గత ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఎఫ్.ఎల్.యన్ (తొలిమెట్టు)కార్యక్రమాన్ని 3వ తరగతి వరకే అమలు చేయాల్సిందిగా నిపుణ్ భారత్ సూచిస్తున్నా విద్యాశాఖ 5వ తరగతి వరకు అమలు చేసింది. దీంతో ఈ కార్యక్రమంలో మల్టీ లెవల్ టీచింగ్, మల్టీ గ్రేడ్ టీచింగ్ చేయలేక టీచర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బాధ వర్ణనాతీతం. పాఠ్య ప్రణాళికలు ముద్రించి అందించినా అలైన్‌మెంట్ పేరుతో రాతపని భారం పెంచారు. ఒక ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులకు బోధనాభ్యాసన సామాగ్రిని రూపొందించడం ఏ విధంగా సాధ్యమవుతుందో అధికారులకే తెలియాలి. ఇక రికార్డుల నిర్వహణ, రకరకాల యాప్‌లలో హాజరు నమోదు చేయడానికే సమయం సరిపోతుందని, బోధనకు టైం ఎక్కడుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
సిలబస్ ప్రకారం బోధన పరీక్షల నిర్వహణ జరిగే హైస్కూల్లలో సిలబస్ తో పాటు బేసిక్స్ నేర్పమని నిర్దేశిస్తూ ఉన్నతి కార్యక్రమం ఉపాధ్యాయులకు కొరకరాని కొయ్యగా తయారయ్యింది. నిర్దేశించిన సోపానాల ప్రకారం బోధనకు సమయం సరిపోక, విద్యార్థులను గ్రూపుల వారీగా విభజించి వారందరికీ బోధించడం సాధ్యపడడం లేదు. వార్షిక, పాఠ్య, పీరియడ్ ప్రణాళికలు, టీచింగ్ డైరీ ద్వారా టీచర్లకు రాతపని భారం మరింత పెరిగింది. ఇంకా ప్రతినెలా పరీక్ష నిర్వహించి, యాప్‌లలో వాటి ఫలితాలు నమోదుచేయడంలోనే పుణ్యకాలం గడిచిపోతోందని బోధన గూర్చి ఆలోచించే సమయమే చిక్కడం లేదనేది మెజారిటీ టీచర్ల వాదన.
నిర్దేశించడం సరికాదు..
ఒక టీచరుకు తన పిల్లల స్థాయి ఏమిటో తెలుసు. తన పిల్లల స్థాయిని బట్టి బోధన ఎలా చేయాలో టీచరు నిర్ణయించుకోవాలి. ఆ స్వేచ్ఛ టీచరుకు ఉండాలి. అంతేకానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే రకమైన ప్రణాళిక రూపొందించి ఇలాగే చేయండి, ఇంతే చెప్పండి, ఇన్ని పీరియడ్లు బోధించండి, పరీక్ష ఇలాగే పెట్టండి అని నిర్దేశించడం సరికాదు. అది టీచరుకున్న బోధనా పరమైన హక్కును హరించడమే. ఒక్క పక్క సిలబస్ చెప్పుకుంటూ మరొక పక్క బేసిక్స్ నేర్పుతూ మల్టీలెవల్ టీచింగ్ చేయడమనేది చెప్పుకోవడానికి చాలా బాగుంటుది కానీ అది ఆచరణ సాధ్యం కాని పని! ఇదే పదవ తరగతి విషయంలోనూ జరుగుతుంది. ఎస్సీఈఆర్‌టీ పదవ తరగతికి ఎలా బోధించాలో, ఎలా అభ్యాసాలు చేయించాలో, పరీక్షలు ఎప్పుడు ఎలా పెట్టుకోవాలో, పరీక్ష పేపర్లు ఎలా దిద్దాలో నిర్దేశిస్తూ, ఫలితాల సాధన పేరుతో 10వ తరగతి బోధించే టీచర్లకు లక్ష్య పేరుతో ఒక ప్లాన్ రూపొందించి అమలు చేస్తుంది. మరి ఈ కార్యక్రమం లేనప్పుడు కూడా టీచర్లు, హెడ్మాస్టర్లు వారి వారి పిల్లల స్థాయిని బట్టి వారే సొంతంగా ప్రణాళిక చేసుకుని మంచి ఫలితాలు సాధించలేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే చేయండి. ఇదే చేయండి. ఇలాగే పరీక్షలు నిర్వహించండి. స్పెషల్ క్లాసుల్లో ఇదే చేయండి అని ఎస్సీఈఆర్టీ నిర్దేశించడం సరికాదు. ఎటువంటి ప్రణాళికలు అమలు చేసుకోవాలో జిల్లా అధికారులకు, పాఠశాల హెడ్మాస్టర్లకు, టీచర్లకు స్వేచ్ఛ ఉండాలి.
అందుకే ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎస్సీఈఆర్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలి. ఇటువంటి వినూత్న కార్యక్రమాల రూపకల్పన పర్యవేక్షణే కాకుండా, పరిశోధనలపై దృష్టిసారించే విధంగా రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ (ఎస్సీఈఆర్టీ)ను పటిష్టం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఒక బాధ్యత కలిగిన సంఘంగా ఇప్పటికే దీనిపై మా సంఘం అధికారులకు వివరించింది. పదేళ్ల పాలనలో నిరాదరణకు గురైన విద్యారంగాన్ని నూతన పాలకులు ఒక గాడిన పడేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా నూతన ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.
- సుధాకర్ ఏ.వి
రాష్ట్ర కార్యదర్శి, STUTS
90006 74747