సింహం సింగిల్ గానే... పాలనలో సినిమా డైలాగులెందుకు

by Ravi |   ( Updated:2023-11-24 00:45:18.0  )
సింహం సింగిల్ గానే... పాలనలో సినిమా డైలాగులెందుకు
X

సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయ్.! ఇదో సినిమా డైలాగ్. దీన్ని రాజకీయాలకు అన్వయించి ‘ సింహం సింగిల్ గానే వస్తుంది, తోడేళ్ళు గుంపుగా వస్తాయి, మీ బిడ్డకు పొత్తు మీతోనే' అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శ ఒక నాన్సెన్స్! రాజకీయమంటే ఏంటి, ప్రజా సేవ.! రాజకీయ పార్టీ అంటే .. అదొక సమూహం! ఏ రాజకీయ నాయకుడైనా తన ప్రభుత్వ పనితీరుతో ప్రజల మన్ననలు పొందాలి కానీ సినిమా సంభాషణలతో కాదు. ఏపీలో, భారతదేశంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాల విషయంలో ఇసుమంత కూడా అవగాహన లేనివారు మాత్రమే ఇటువంటి విమర్శలు చేస్తారు.

తాతకు దగ్గు నేర్పుతారా?

భారతదేశంలో ఎన్నికల వ్యూహం మారుతోంది. ఒంటరిగా పోటీ చేసే ఆలోచన తగ్గుతోంది. పొత్తుల కోసం ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి. రాజకీయ పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సవాళ్లు వింటుంటే తాతకు దగ్గులు నేర్పినట్లుంది. తెలుగుజాతి ఆత్మ గౌరవం నినాదంతో నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 1983లో తన తొలి ఎన్నికల సమయంలోనే ఇందిరాగాంధీ తీరును వ్యతిరేకిస్తూ సంజయ్ విచార్‌ మంచ్ ను ఏర్పాటు చేసిన మేనకాగాంధీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ మొత్తం 294 సీట్లకు గాను 289 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 46.03 శాతం ఓట్లతో 201 సీట్లల్లో విజయభేరీ మోగించింది. మరోవైపు సంజయ్‌ విచార్‌ మంచ్‌ ఐదు సీట్లల్లో పోటీ చేసి నాలుగింటిలో గెలిచింది. ఫలితంగా టీడీపీ కూటమికి 205 సీట్లు వచ్చాయి. పార్టీ పుట్టిన 9 నెలల కాలంలోనే అఖండ విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఒక చిన్న పార్టీతో పొత్తు కట్టిన తెలుగుదేశం ఆ తర్వాత కూడా అదే పంథాను అనుసరించింది. కొన్నిసార్లు పొత్తులు అనివార్యం కాగా.. మరికొన్ని సార్లు బలం ఉన్నా పొత్తులకు దిగిందనే చెప్పాలి.

1984లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఉదంతంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తనకు అండగా నిలిచిన బీజేపీ, వామపక్షాలు రెండింటితోను 1985 ఎన్నికలలో రాష్ట్ర స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి తిరిగి రెండు వందలకు పైగా సీట్లు గెలుచుకుంది టీడీపీ. ఇక 1989లో వామపక్షాలతో పొత్తు పెటుకున్న టీడీపీ 74 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ గెలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓటు బ్యాంక్ 36.54 శాతం మాత్రమే. వామపక్షాలతో పొత్తు కొనసాగించిన తెలుగుదేశం 1994లో ఎన్నడూ లేని విధంగా 216 సీట్లు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత అత్యధిక సీట్లు వచ్చింది అప్పుడే. మొత్తం 44.14 శాతం (మిత్రపక్షాలు మినహా) ఓట్లతో మరోసారి అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఇక 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం 43.87 శాతం ఓట్లతో 180 సీట్లు గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. మళ్లీ 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. కేవలం 47 సీట్లే టీడీపీకి వచ్చాయి. ఇక 2009 ఎన్నికల్లో వామపక్షాలు, టీఆర్ఎస్‌తోను పొత్తు పెట్టుకున్నా టీడీపీకి పరాజయం తప్పలేదు. ప్రముఖ నటుడు చిరంజీవి కొత్తగా పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పోటీ చేయడంతో విపక్ష ఓట్లల్లో వచ్చిన చీలిక కాంగ్రెస్‌కు కలిసి రాగా ..టీడీపీని దెబ్బతీసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 156 సీట్లు, టీడీపీకి 92 సీట్లు, ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి. 2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి (జనసేన మద్దతు) ఏపీలో 45 శాతం ఓట్లతో 175 సీట్లకు గాను..102 సీట్లు సాధించి అధికారంలోకి రాగా, తెలంగాణలో 21.77 శాతం ఓట్ షేర్ 15 సీట్లు దక్కించుకుని తన ఉనికిని చాటుకుంది.

టీడీపీ పుట్టింది పొత్తులతోటే...!

తెలుగుదేశం పార్టీది అక్షరాల నాలుగు దశాబ్దాల పైగా చరిత్ర. అంతే కాదు 2019 ఎన్నికల్లో 40 శాతం ఓటు షేర్ సాధించిన పార్టీ. ఈ రోజుకీ ఏపీలో ప్రతి బూత్ స్థాయిలో పటిష్టంగా ఉన్న పార్టీ. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలకు నాంది పలికిన పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో వామపక్ష సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా జాతీయ స్థాయిలో రాజకీయ పొత్తులకు అంకురార్పణ చేసింది ఎన్టీఆర్. 1984 ఎన్నికల అనంతరం 30 మంది ఎంపీలతో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా రికార్డు సృష్టించిన తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించింది. తత్ఫలితంగా ఎన్టీఆర్ నాయకత్వం వహిస్తున్న నేషనల్ ఫ్రంట్ 1989లో వి.పి.సింగ్ ప్రధానిగా కాంగ్రెసేతర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.1996 నుండి 1998 వరకు యునైటెడ్ ఫ్రంట్, 1998 నుండి 2004 వరకు, తిరిగి 2014 నుండి 2018 వరకు ఎన్.డి.ఏ ప్రభుత్వాల ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏదేమైనప్పటికీ పొత్తులు సవాళ్లు లేకుండా ఉండవు. వివిధ పార్టీల ప్రయోజనాలు మరియు బహుళ సిద్ధాంతాల సమతుల్యత సంక్లిష్టంగా ఉండి తరచుగా అంతర్గత విభేదాలకు దారి తీస్తుంది. ఇవే కారణాలతో 1977లో మూడింట రెండు వంతుల మెజారిటీతో విజయం సాధించిన జనతా ప్రభుత్వం 1979లో కుప్పకూలి పోయింది. టిడిపి భాగస్వామిగా నేషనల్ ఫ్రంట్ ఏర్పడిన తరువాత నుండి కేంద్రంలో ఏర్పడినవన్నీ దాదాపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న యూపీఏ లేదా భారతీయ జనతా పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఎన్.డి.ఏ సంకీర్ణ ప్రభుత్వాలే. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీఆర్, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామిగా చంద్రబాబు నాయుడు అత్యంత బలమైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించడం ద్వారా జాతీయ రాజకీయాలలో బలమైన ప్రభావం చూపగలిగారు. ప్రస్తుతం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ సంకీర్ణ ప్రభుత్వం. జాతీయ స్థాయిలో, అనేక రాష్ట్రాలలో వివిధ పార్టీల మధ్య పొత్తులు కొనసాగుతున్న తరుణంలో 'సింహం సింగిల్ గా వస్తుంది, తోడేళ్ళు గుంపుగా వస్తాయి' అనడం సమంజసమా కాదా అనేది రాజకీయ విశ్లేషకులు విమర్శ చేయాలి. సంకీర్ణ ప్రభుత్వాలలో, రాజకీయ కూటములలో భాగస్వాములైన రాజకీయ ఉద్దండులు నందమూరి తారక రామారావు, అటల్ బిహారీ వాజపేయి, జ్యోతి బసు, నరేంద్ర మోడీ, ఎంజీఆర్, కరుణానిధి, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వంటి నాయకులు తోడేళ్లు, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సింహమా? మాట్లాడే మాటకు అర్థం, చేస్తున్న విమర్శకు విశ్వతనీయత ఉందా!

ఓటరు పునాదిని తేల్చేవి పొత్తులే!

రాజకీయ పార్టీల మధ్య పొత్తులు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడంలో, పరిపాలనా గతి, విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇటువంటి రాజకీయ పొత్తులు తరచుగా భాగస్వామ్య పక్షాల సిద్ధాంతాల సారూప్యం, సమిష్టి లక్ష్యాల సాకారం లేదా పరస్పర ప్రయోజనాల సాధన కోసం ఉద్భవిస్తాయి. పొత్తుల ఏర్పాటు పార్టీల సమిష్టి బలాన్ని, విస్తృత ఓటరు పునాదిని పెంపొందిస్తుంది. విభిన్న దృక్కోణాలు, ఆసక్తి ఉన్న ప్రజలకు పార్టీలు మరింత దగ్గర కావచ్చు. బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు సహజం. పొత్తులు అప్పటి రాజకీయ పరిస్థితులకు వ్యూహాత్మక ప్రతిస్పందనగా కూడా ఏర్పడతాయి. ప్రబలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి లేదా జాతీయ సమస్యను పరిష్కరించడానికి పార్టీలు ఏకం కావచ్చు. దీనికి ఉదాహరణ 1975లో ప్రధాని ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితి విధించి ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులను కాలరాసినపుడు, భిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన రాజకీయ పక్షాలు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో జనతా పార్టీగా ఏర్పడి అత్యంత బలమైన కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించాయి. సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులను అధిగమించడానికి, మరియు భాగస్వామ్య లక్ష్యాలను సాధించడానికి ఈ పొత్తులు ఉపయోగపడతాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులకు భంగం వాటిల్లి తిరిగి అలనాటి అత్యయిక పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. తన అవినీతి, అరాచక, ప్రజావ్యతిరేక విధానాలతో, రాజ్యాంగ వ్యవస్థలను భృష్టు పట్టిస్తున్న అధికార వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన పోరాడుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఇన్నాళ్లు అవగాహన రాజకీయమే నడిచింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మూడేళ్లుగా పొత్తు ప్రతిపాదనల్లో ఉన్న టీడీపీ, జనసేన ఓ స్పష్టతకు వచ్చేశాయి. ఆరు నూరైనా.. నూరు ఆరైనా కలిసేవుంటామని, ఉభయ పార్టీల మధ్య సీట్ల పంపకాలు పెద్ద సమస్య కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని తేల్చి చెప్పేశాయి. అంతేకాదు ఉమ్మడి కార్యాచరణతో ప్రభుత్వంపై పోరాడనున్నాయి. ఉభయ పార్టీల మధ్య పొత్తు తన అధికారానికి ఖచ్చితంగా ప్రమాదకారి అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే మిత్ర భేదం కోసం విఫల యత్నాలు, అవాకులు చవాకులు. ఏదేమైనా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.

లింగమనేని శివరామ ప్రసాద్

79813 20543

Advertisement

Next Story