ప్రశ్నార్థకంగా బీఆర్ఎస్‌ మనుగడ

by Ravi |   ( Updated:2024-06-07 00:46:03.0  )
ప్రశ్నార్థకంగా బీఆర్ఎస్‌ మనుగడ
X

తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 65.67 శాతం ఓటింగ్ జరగడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఈ పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలు రెండూ సమాన స్థానాలను కైవసం చేసుకున్నాయి. ముందుగానే ఊహించినట్టు బీఆర్ఎస్‌కు అనుకున్న స్థాయిలో ఓటింగ్ లేకపోవడం, సీట్లు రాకపోవడం ఒక రకంగా గట్టి దెబ్బగానే మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పాత్ర, దాని మనుగడ ఒక ప్రశ్నార్థకంగా మారబోతుంది.

ఎగ్జిట్ పోల్ అంచనాలు సైతం బీజెపీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రధానమైన పోటీ ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఫలితాలు అలానే వచ్చాయి. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అత్యధికంగా మెజారిటీ రావడం కాంగ్రెస్ పార్టీకి గర్వించదగ్గ అంశం. కానీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీజేపీ హోరాహోరి పోటీలో నిలబడి ఉండడం విశేషమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 14 స్థానాలను ఆశించగా 8 స్థానాలకే పరిమితం కావడం కాస్త ఇబ్బందికరమైన అంశం. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. ఇండియా కూటమికి తెలంగాణ నుంచి భారీ ఆశలు ఉండేవి కానీ కొంతవరకు నిరాశపరిచాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎక్కువ సీట్లు గెలవకపోవడానికి, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేకున్నా బీజేపీ ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలవడానికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ పార్టీ ఓట్లు స్పష్టంగా బీజేపీకి మళ్లడమే.

బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసి..

వాస్తవానికి బీఆర్ఎస్‌కి వచ్చిన అసెంబ్లీ స్థానాలు, ఓట్ల శాతం చూస్తే కనీసం ఏడెనిమిది ఎంపీలు కచ్చితంగా గెలవాలి కానీ ఆ స్థానాలను మొత్తంగా బీజేపీ గెలుచుకుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే బీఆర్ఎస్ పాత్ర, దాని మనుగడ ఒక ప్రశ్నార్థకంగా మారబోతుంది. కేసీఆర్ ఊహించినట్టు రేపు బలమైన ప్రతిపక్షం పాత్రను తెలంగాణలో బీఆర్ఎస్ పోషిస్తుందని కచ్చితంగా చెప్పలేం. బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వలసలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. వలసల ద్వారా బీఆర్ఎస్ మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది. రేపు తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పాత్ర గణనీయంగా పడిపోయి పట్టణ స్థానాల నుండి కూడా బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో సర్పంచులు, మండల స్థాయిలో ఎంపీపీ, ఎంపీటీసీలు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీలు తదితర బీఆర్ఎస్‌కి చెందిన ప్రజా ప్రతినిధులు స్థానిక ఎన్నికల్లోనే బీజేపీలోకి వలసపోయే అవకాశం కనిపిస్తోంది, గ్రామస్థాయిలో బలమైన కార్యకర్తలను కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఊహించని స్థాయిలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయి ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది,

మీ నాయకత్వాన్ని విశ్వసించక..

అందరూ ఊహించినట్టే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎంఐఎం, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించారు. కానీ ఎంఐఎం తన స్థానాన్ని తన నిలుపుకుంది. బీఆర్ఎస్ పార్టీ మెదక్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవడం పార్టీకి ఒక ఇబ్బందికరమైన అంశం కాగా, హరీష్ రావు, కేసీఆర్ లాంటి నాయకులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వారి నాయకత్వం పైన కూడా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసిస్తనన్న కేసీఆర్‌కి ఇప్పుడు ఎలాంటి దారులూ కనిపించడం లేదు. ఏదో ఒక కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నప్పటికీ తనకు సీట్లు లేకపోవడం వల్ల జాతీయ పార్టీలు కూడా కేసీఆర్‌ని పెద్దగా పట్టించుకునే అవకాశం కనిపించడం లేదు.

- డాక్టర్ శంకర్ కుమార్

అసోసియేట్ ప్రొఫెసర్

91107 16674

Advertisement

Next Story

Most Viewed