- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యాశాఖలో భళారే విచిత్రం..!
ప్రవీణ్ ప్రకాష్ లాంటి వ్యక్తి విద్యా శాఖ నుంచి నిష్క్రమిస్తే ప్రభుత్వ పాఠశాలలు బతికి బట్టకడతాయని, ఉపాధ్యాయులు కొన్ని నిముషాల పాటైనా ఆక్సిజన్ పీల్చుకోవచ్చని అందరూ భావించారు. పాఠశాలల్లో విద్యాబోధన మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని భావించారు. అధికారుల మితిమీరిన జోక్యం వల్ల మరుగున పడిన బోధనను తిరిగి కొనసాగించవచ్చని ఉపాధ్యాయ లోకం కళ్లకు వత్తులు వేసుకుని చూసింది. ఐదు నెలల కిందట రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అందరూ ఆ దిశగా ఆశపడ్డారు.
అయితే పేరుకు ప్రవీణ్ ప్రకాష్ వెళ్లిపోయాడు కానీ ఆయన నాటిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తాయి. ఉపాధ్యాయులను వేపుకుతినే కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగించడానికి వారు ఉద్యుక్తులవుతున్నారు. గత ప్రభు త్వంలో పురుడుపోసుకున్న యాపులకు తోడు మరిన్ని టపాలు రావడం, పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలనకు కొత్త నిబంధనలు తీసుకురావడం, ఉపాధ్యాయులకు చట్టబద్ధంగా సంక్రమించిన క్యాజువల్ లీవుల మంజూ రులో నిబంధనలు సృష్టించడం, హైస్కూల్, ప్రైమరీ స్కూళ్ల పని గంట లను హెచ్చించడం, రెసిడెన్షియల్ శిక్షణ, వీటన్నిటికీ తోడు పైలట్ ప్రా జెక్టు కింద పాఠశాల సమయాన్ని సా యంత్రం 5 గంటల దాకా హెచ్చిం చటం వంటి తిరోగమన విధానాలు అమలు చేయబోతున్నారు.
వివిధ రాష్ట్రాల్లో పనివేళలు..
ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల పని వేళల్ని పరిశీలిద్దాం! ప్రత్యేకించి దక్షణాది రాష్ట్రాల్లోనే కాకుండా అక్షరాస్యతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కేరళలో ఉదయం 9.10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు, కొన్ని పాఠశాలలు 10 నుంచి 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలల్లో 7.30 నుంచి 1.30 వరకు నిర్వహిస్తారు. విరామ సమయం తీసేస్తే అన్ని పాఠశాలల గరిష్ట పనివేళలు ఐదు గంటలు మాత్రమే! తెలంగాణలో ఉదయం 9 నుంచి 4.15 వరకు నిర్వహిస్తున్నారు. అలాగే తమిళనాడులో ఉదయం 9.నుంచి సాయంత్రం 4.10 వరకు నిర్వహిస్తారు. విద్యార్థుల్లో గాని ఏర్పడకుండా 5 పీరియడ్లకు పరిమితం చేసారు. అంతేకాకుండా ప్రతి పీరియడ్ కు మధ్య 10 నిమిషాల విరామం ఇచ్చారు. కర్ణాటకలో 8 నుంచి 1.30 వరకు, పాఠశాలలు నిర్వహిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో 9.30 నుంచి 3.30 వరకు నిర్వహిస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన నిర్వహిస్తున్న ఢిల్లీలో కూడా ఇటువంటి విపరీత ధోరణులు లేవు.
పనివేళలు పెంచే పైలట్ ప్రాజెక్ట్
రాష్ట్రంలో ఉపాధ్యాయులను మానసికంగా ఎలా చిందరవందర చేయాలా అనే అత్యుత్సాహం తప్ప బోధనలో నాణ్యతా ప్రమాణాలు ఎలా ప్రోది చేయాలా అనే లక్ష్యాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు జరిపి పనివత్తిడి తగ్గించడమెలాగనే తార్కిక పునర్విమర్శకు బదులు గొడ్డు చాకిరిని ఎలా చేయించాలనే విధ్వంస పథక రచన జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో పని వేళలు పెంచడానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టడంలోని ఔచిత్యమేమిటి? ఇదొక భేతాళ ప్రశ్న! మానవ మేధస్సును చిదిమేసే ప్రక్రియ అది. పనివేళల హెచ్చింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తే తద్వారా సాధించదలచుకున్న లక్ష్యాలను చదువు చెప్పే ఉపాధ్యాయులకు మున్ముందు తెలియజెప్పాలి. అలా కాకుండా ఒక రహస్య అజెండాతో ముందుకెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
టీచర్లను చాకిరేవులో ఏకిపారేస్తే..
పాఠశాల పనివేళలు ఎలా ఉండాలనేది విద్యార్థుల్లో అభ్యసన సంసిద్ధత, మానసిక పరిపక్వత, స్థానిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ప్రజల జీవన విధానం వంటి అనేక అంశాలు ప్రతిక్షేపిస్తాయి. 70 శాతానికి పైబడి గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రామాణికంగా తీసుకుని ప్రయోగాలు చేయాలి తప్ప అన్ని వసతులు కలిగిన పట్టణ ప్రాంతాలను బేరీజు వేయకూడదు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమ ప్రభావంతో తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల విజ్ఞానం సన్నగిల్లి వస్తున్న అత్తెసరు ఫలితాలకు విరుగుడు కనుక్కోవాలి. పరిశోధన, విశ్లేషణ ఉత్తమ ఫలితాలకు మార్గం సుగమం చేస్తాయి తప్ప ఉపాధ్యాయులను చాకిరేవులో ఏకి పారేస్తే సాధ్యం కాదు.
సెలవు కూడా అధికారుల వరమేనా?
ఏడున్నర దశాబ్దాల కాలంలో ఇలాంటి విపత్కర పరిస్థితిని విద్యారంగం చవిచూడలేదు. ఇదొక అప్రకటిత ఎమర్జెన్సీ. ఉపాధ్యాయులపై ముప్పేట దాడి. అనుకూలమైన బోధనా సమయాన్ని యాపుల నిర్వహణకు, ట్రెయినింగులకు కుదువబెట్టి విద్యా బోధనను కుంగదీసే వ్యవహారానికి మంగళం పడాల్సిన అవసరం వుంది. మీదు మిక్కిలి ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత అవసరాలకు సెలవు తీసుకునే అవకాశాన్ని కూడా అధికారుల చెప్పుచేతల్లోకి తీసుకొంటున్నారు. ఉపాధ్యాయుడు కూడా ఒక సంఘజీవి. వారికి భౌతిక అవసరాలుంటాయి. వారిలో కూడా చీమూ నెత్తురు ప్రవహిస్తుంటుంది. వారికి కుటుంబాలుంటాయి. వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం, తనకు జ్వరమో, తలనొప్పి వచ్చినా సెలవు వచ్చినా సెలవు పెట్టుకోవడానికి అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు.
మొదటికి మోసం తెస్తే ఎలా?
ఇటీవల జరిగిన సమావేశంలో పాఠశాల లేదా మండలం యూనిట్‌గా తీసుకున్నపుడు 10 శాతానికి మించి సెలవు మంజురుచేయవద్దని అధికారులు ఆదేశించారు. మెడ మీద తల వుండే వారు ఇలా చెబుతారా..? ఉన్నత స్థానాల్లో వున్న వారు చట్టంతో పాటు మానవేయకోణంలోనూ ఆలోచించాలి. భౌతిక అవసరాలు ఎవరికీ చెప్పి రావు. అందుకోసమే ఆకస్మిక సెలవు (క్యాజువల్ లీవ్). అలాగని ఉపాధ్యాయులు బాధ్యతారహితంగా పాఠశాలలకు ఎగ నామం పెట్టరు కదా! మరి సెలవు హక్కు కాదనడం ఏంటి? ఉపాధ్యాయులకు కనీస మానవ హక్కులు కూడా వర్తించకుండా ప్రతిబంధకాలు సృష్టించడమేంటి? వ్యవస్థలను బలోపేతం చేసే సంస్కరణలను స్వాగతించాల్సిందే! కానీ అవి మొదటికి మోసం తెచ్చేవి కాకూడదు. అసంబద్ధ విధానాలకు స్వస్తి పలికి ఆచరణాత్మక, తులనాత్మక శాస్త్రీయ విధానాల బాటలో ముందుకెళ్లడం సర్వత్రా శిరోధార్యం!
- మోహన్ దాస్,
ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు
94908 09909