రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమైక్యత దినోత్సవం జరపడం వెనుక కథేంటి?

by Ravi |   ( Updated:2022-09-16 03:16:08.0  )
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమైక్యత దినోత్సవం జరపడం వెనుక కథేంటి?
X

భారత దేశ స్వాతంత్ర్యోద్యమం త్యాగాలు, బలిదానాల పునాదులపై నిర్మితమై ఉన్నది. 1947 ఆగష్టు 15న దేశం మొత్తం స్వాతంత్య్రం పొంది ఉత్సవాలలో మునిగి తేలుతుంటే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం దాస్య శృంఖలాలలో చిక్కి నలిగిపోతున్నారు. భారత దేశ జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేసే అవకాశం లేకుండా పోయింది. భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని కలపడానికి నిజాం విముఖత వ్యక్తం చేసి సర్వ స్వతంత్రతను ప్రకటించుకోవడం దేశ ప్రజలను కూడా విస్మయపరిచింది. నిజాంకు వ్యతిరేకంగా, రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడిన హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా తమ భవిష్యత్‌‌కు భరోసా పొందలేకపోయారు.

నిజాం పోలీస్‌, మిలిటరీ, రజాకారులకు నియమాలు ఉండేవి కావు. బలవంతంగా మతం మార్చడం, ఇండ్లు తగలబెట్టడం, దోపిడీలు చేయడం, మహిళలను బానిసలుగా చేయడం, అమాయకులను కాల్చి చంపడం లాంటివి నిత్యకృత్యాలు గా మారాయి. చివరకు ప్రజలు ప్రాణత్యాగాలకు సిద్దమై 'ఇక చాలించండి మీ రాజరికం. మేము స్వతంత్రులమయ్యాం. మమ్ముల మేమే పాలించుకుంటాం. మీ పాప కూపం నుండి బయట పడి స్వేచ్చ గాలులను పీల్చుకుంటాం' అని నినదించారు. సర్దార్‌ వల్లభ్ భాయ్‌ పటేల్‌ చొరవతో 17 సెప్టెంబర్‌ 1948న హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు నిజాం పాలన నుండి విముక్తి పొంది భారత దేశంలో విలీనం అయ్యారు. మరాఠ్వాడా ప్రాంతాలు మహారాష్ట్రలో, కన్నడ ప్రాంతాలు కర్ణాటకలో కలిశాయి. తెలంగాణ ఆంధ్రలో కలిసిపోయింది. కర్ణాటక, మహారాష్ట్రలో సెప్టెంబర్‌-17 ఉత్సవాలు నిర్వహిస్తుంటే తెలంగాణలో మాత్రం ఈ ఆచారం పాటించడం లేదు.

సబ్బండ వర్గాల పోరాటం

హైదరాబాద్‌ భారతదేశంలో విలీనం అయిన తర్వాత అప్పటి హోమ్‌ మంత్రి సర్దార్‌ వల్లభ్ భాయ్‌ పటేల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేవలం రాజకీయ కోణంలో అలోచించి అధికారికంగా నిర్వహించలేదు. రజాకారుల చేతిలో దారుణ హత్యకు గురైన షోయబుల్లాఖాన్‌ ఏ మతానికి చెందినవాడో ఆలోచించలేక పోయారు. బాధాకర విషయం ఏమిటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం.

నిజాం పాలనలో హైదరాబాద్‌ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న హిందువులు ఎలా అభద్రతా భావంలో జీవించారో ఇప్పుడు కేసీఆర్ పాలనలో కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే నెలకొని ఉంది. ముస్లింల ఓట్లు పొందాలనే రాజకీయంలో భాగంగానే ఇలా చేస్తున్నారు. స్వపరిపాలన కోసం, సంస్కృతి, సంప్రదాయం, ఆచారాల, పరిరక్షణ కోసం, ఆత్మ గౌరవం కోసం జరిగిన తెలంగాణ పోరాటంలో, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని సబ్బండవర్గాలు గొంతెత్తి ప్రశ్నించాయి. ఆ సమయంలో కేసీఆర్ కూడా ఉమ్మడి ఆంధ్ర పాలకులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాగానే ఎంఐఎం ప్రాపకం కోసం మాట మార్చారు.

జాతీయవాదుల ఉద్యమం

తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ, ఏబీవీపీ లాంటి జాతీయవాద సంస్థలు ఉద్యమ బాట పట్టాయి. జాతీయ జెండా పట్టుకుని పోరాడాయి. ప్రభుత్వం వారి మీద అక్రమ కేసులు పెట్టింది. లాఠీలతో దమనకాండ జరిపింది. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుని అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్‌ చేయడం వరకు తెలంగాణ ప్రజల ప్రతి పోరాటంలో జాతీయ సంస్థలు ముందుండి కొట్లాడాయి.

ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి పోరుయాత్ర చేసి తెలంగాణ ప్రజలను సంఘటితపరిచారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా అతిథిగా వస్తారని ప్రకటించగానే, కేసీఆర్, ఆయన మిత్రపక్షం ఎంఐఎం గుండెలు అదిరి కొత్త నాటకానికి తెర లేపారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరిట ఉత్సవాలు నిర్వహించాలని అసదుద్దీన్‌ సూచించిన వెంటనే కేసీఆర్ దానిని ఆమోదించారు.

సంబరాలు చేసుకుందాం

కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆహ్వానాన్ని మన్నించి విమోచన దినోత్సవంలో పాల్గొనాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ స్టీరింగ్‌ వేరేవారి చేతులలోనే ఉందని భావించాల్సి వస్తుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ బీజేపీ చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నారు.

కేసీఆర్ ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గుర్తిస్తూ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో కేంద్ర హోమ్‌ మంత్రి అతిధిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం గర్వకారణం. 'మన విశ్వాసాలను, మన మాతృమూర్తులను అవమానపరిచిన వారు తలదించుకునేలా సంబరాలు చేసుకుందాం. తెలంగాణ మట్టి పోరాట చరిత్రను నలుదిశలా చాటుదాం. నిజాం దుర్మార్గ పాలన నుండి విమోచనం కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన వీరులకు నివాళులు అర్పిద్దాం.

Also Read : తెలంగాణ సాయుధ పోరులో సింగరేణి పాత్ర ఎంతంటే?


కేశప్ సోనీ, కన్వీనర్‌

రైట్‌ థింకర్స్‌ ఫోరమ్‌

99893 41766

Advertisement

Next Story