వీరి పోరాటం వ్యక్తిగతం కాదు..

by Ravi |   ( Updated:2024-10-22 01:01:14.0  )
వీరి పోరాటం వ్యక్తిగతం కాదు..
X

అప్పుడెప్పుడో నవలలు విపరీతంగా చదువుతున్న కాలంలో యండమూరి రాసిన ఒక నవలలో ఒక పాత్ర ఇలా అంటుంది . 'రచయితలను, మేధావులను భౌతికంగా హింసించాల్సిన అవసరం లేదు. దూరందూరంగా రెండు మూడు చోట్ల కేసులు బుక్ చేసేసి పడేస్తే చాలు. ఆ కోర్టుల చుట్టూ ఆ రచయితలు, ఆ కార్యకర్తలు తిరుగుతారు. దాంతో, ఆ వ్యక్తులు అక్కడే అంతమైపోతారు.' నవలల్లో ఏదో ఊహాజనిత పాత్రల్లో ఇలా జరుగుతుందేమో అని ఆనాడు అనిపించింది. కానీ, నిజజీవితంలో రచయితల, కార్యకర్తలకు సంబంధించిన వార్తలు చదువుతున్నప్పుడు, సరిగ్గా ఇది నిజమే అనిపిస్తుంది. కేసులే కాదు జైలు నుంచి బయటికి రాలేని ఉపా కేసులు కూడా నేడు సాధారణం అయిపోయాయి.

బ్రిటిష్ వారి కాలంలో మనం లేమా? అని ఒక్కోసారి సందేహం ఎవరికైనా రాక మానదు. ఇటీవల జి.ఎన్ సాయిబాబా మరణం, అంతకుముందు స్టాన్ స్వామి మరణం విన్నప్పుడు ఈ విషయం నిజమే అనిపిస్తుంది. అత్యంత దారుణమైన పరిస్థితిలో వృద్ధాప్యంలో స్టాన్ స్వామి చనిపోయారు. నీళ్లు తాగడానికి ఒక స్ట్రా కూడా దొరక్కుండా నలిగిపోయారు. తొంభై శాతం పనిచేయలేని శరీరంతో కనీస వసతులు లేకుండా జి. ఎన్. సాయిబాబా కూడా జైల్లో అత్యంత బాధాకరంగా మానసిక హింసకు గురయ్యారని తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడి మన రిపబ్లిక్‌ను తయారుచేసుకున్న మనం మన దేశంలో అసమానతలను తగ్గించి, సామాజిక న్యాయం అందించాల్సిన అవసరం ఉంది. రచయితలూ, మానవ హక్కుల కార్యకర్తలూ దేశంలో సమానత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం రాజ్యాంగంలో రాసుకున్న హక్కులనైనా కాస్తా గౌరవించండని నిలదీస్తున్నారు. కానీ, వ్యవస్థ ను ప్రశ్నించిన మానవ హక్కుల కార్యకర్తలను భీమా కోరేగావ్ అని ఒక తప్పుడు కేసులో ఇరికించి జైల్లోకి తోసేయడం, జైల్లో నుండి బయటకు రానంత పకడ్బందీగా ఉపా చట్టాల్లో వారిని ఇరికించడం చూశాం.

భీమా కోరేగావ్ సాకు మాత్రమే!

భీమా కోరేగావ్ పేరు మీద ఈ కేసు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. ఆయా కార్యకర్తలు వాడే కంప్యూటర్లలో, ల్యాప్టాప్‌లలో దేశ ద్రోహానికి సంబంధించిన సామాగ్రి దొరికినట్టు మహారాష్ట్ర పోలీసులు ఆరోపణలు చేశారు. ఒక సైబర్ ఎక్స్పర్ట్ పరిశోధన ప్రకారం, వీరి కంప్యూటర్లలో ఒక మాల్వేర్ పంపించడం జరిగిందనీ, కంప్యూటర్లు వాడుతున్న ఆయా వ్యక్తులకు కూడా తెలియకుండానే వారి కంప్యూటర్లలో వారికి అర్థం కాని ఫోల్డర్లలో ఈ మాల్వేర్ ఎన్నెన్నో డాక్యుమెంట్లను భద్రపరిచిందని అన్నారు. నిపుణుల అంచనా ప్రకారం, ఇలాంటి పెద్ద స్థాయి మాల్‌వేర్లను సాధారణ వ్యక్తులూ, సాధారణ కంపెనీలూ పంపించలేవు. వందలు, వేలు, లక్షలు ఖర్చు కాదు. దీని వెనక, కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టే అవసరం, మానవ హక్కుల కార్యకర్తల కంప్యూటర్లలో, లాప్టా ప్‌లలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మాల్వేర్లను పంపించే అవసరం, పెగాసెస్‌లను పంపించే అవసరం సాధారణంగా ఏ ఒక్క వ్యక్తికైనా ఉంటుందా? ఏ ప్రయోజనాలను ఆశించి ఇలాంటి కుట్రలు పన్నుతారు? అల్పాషా రాసిన 'ఇన్‌కార్సిరేషన్స్' పుస్తకంలో ఈ కేసుకు సంబంధించి చాలా వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.

ఖనిజాల వెలికితీతకు ఆదివాసీలు బలి!

ఒక్కసారి మనం 1990ల తర్వాత భారత దేశంలో ముంచుకొచ్చిన ప్రపంచీకరణ పవనాలను పరిశీలించగలిగితే మనకు చాలా విషయాలు స్పష్టం అవుతాయి. ఆర్థిక సరళీకరణలు, ప్రైవేటీకరణ, నయా ఉదారవాదం అని అందమైన, కొత్త కొత్త పదాలతో పాత పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత కొత్త ప్యాకింగ్‌లతో దేశంలోకి జొరబడింది. ఒకవైపు దేశాన్ని విధ్వంసక అభివృద్ధితో విపరీతమైన అప్పుల్లో ముంచేసే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆరం భం అయింది. పబ్లిక్ సెక్టార్ బలహీనం అయింది. జాతీయ బ్యాంకులు నీరవ్ మోదీల వంటి వారు దోచుకున్నారు. ఏ హక్కులూ లేని కాంట్రాక్టు ఉద్యోగులు విపరీతంగా పెరిగారు. మరోవైపు, దేశంలో అటవీ ప్రాంతాల భూముల్లోపల నిక్షిప్తమై ఉన్న వేల, లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాల వెలికితీత కార్పొరేట్లకు అవసరం. అయితే, అలా అడవు ల లోపల విలువైన ఖనిజ సంపద పక్కనే నివసించే ఆదివాసీలు ఈ వర్గానికి తలనొప్పి. ఆదివాసీల మీద కొనసాగే అత్యాచారాలను ప్రశ్నించే కార్యకర్తలు మరో తలనొప్పి. రాజ్యాంగంలో రాసుకున్న కనీస నియమాలు పాటించండని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఎంతోమంది అమాయక ఆదివాసీలు జైళ్ళలో మగ్గిపోవడం చూసిన స్టాన్ స్వామి మొత్తం జైళ్ళలో ఇలా ఇరుక్కున్న ఆదివాసీల వివరాలు సేకరించాడు. కోర్టులో కేసు పెట్టి ఎంతో మంది అమాయకుల విడుదలలో శ్రమిం చాడు. ఇలా అన్యాయానికి ఎదురుతిరిగి రాజ్యాంగబద్దంగా ప్రశ్నించే అందర్నీ కట్టకట్టి భీమా కోరేగావ్ కేసులోకి ఇరికించేశారు.

వాళ్లు కోల్పోయిన జీవితం మాటేంటి?

భీమా కోరేగావ్ అనేది మహారాష్ట్రలోని ఒక ప్రాంతం. గతంలో పీస్వాలకు వ్యతిరేకంగా అణగారిన దళితులు పోరాడి గెలిచిన ఆ సంద ర్భాన్ని వేడుక జరుపుకుంటారు ఆ ప్రాంతంలో ఉన్న దళితులు. దీన్ని హర్షించని హిందుత్వ వాదులు ఒకరిద్దరు నాయకుల ఆధ్వర్యంలో హింసను కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. బలమైన వ్యతిరేకత రావడంతో, దాన్ని పక్కకు జరిపి కేసుని తప్పుదారి పట్టించి ఎల్గార్ పరిషద్ కేసుని ముందుకు తెచ్చి, హక్కుల కార్యకర్తలు హింసకు ప్రణాళికలు వేశారనీ, అలానే దేశంలో అలజడిని సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారనీ తప్పుడు ఎఫ్‌ఐఆర్‌‌ లు బుక్ చేసి ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన వారినీ, చేయని వారినీ కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరిగింది. జీఎన్ సాయిబాబాలు, స్టాన్ స్వామీలు ఇలా అంతరించిపోవడం వెనక ఏ వర్గం ప్రయోజనాలు ఉంటాయి? ఇలా ఎంతోమంది మేధావులు జైళ్లలో మగ్గిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఆధారాలు లేవని కేసులు కొట్టేస్తారు. మరి కోల్పోయిన పది సంవత్సరాల మాటేంటి? వాళ్ల జీవితం విలువ మాటేంటి?

వీరు పుడుతున్న నేపథ్యం..

ఈ నేపథ్యంలో, విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రపంచీకరణలో, విధ్వంసక అభివృద్ధిలో, హక్కుల ఉల్లంఘనలో సాధారణ వర్గం ప్రయోజనాలు కోరే సాయిబాబాల్లాంటి మేధా వుల, కార్యకర్తల పోరాటం వ్యక్తిగతం కాదు. సామాజికం. చారిత్రకం. ప్రగతిశీల వాదుల్లో నేడు ఎన్నో రకాల గోడలు మనం చూస్తాం.. కానీ, ఆయన అందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని అనుకున్నారు. ఆదీవాసీల పట్ల అన్యాయం ప్రతిఘటించాలని అన్నారు. ఫాసి జం విశాల ప్రజా సమూహాలను తన భక్తు లుగా మార్చేసుకుంది. ఇలాంటి చారిత్రక పరిణామాలను ప్రపంచంలో చూశాం. నేడు, ఇక్కడ కూడా చూస్తున్నాం. ఆ ప్రజా సమూహాలను వారి నుంచి బయటకు తీసుకురావాల్సిన చారిత్రక బాధ్యతను ఆయన ఒక ఉపన్యాసంలో గుర్తు చేశారు. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటంలో ఇది మొదటి మెట్టు అని ఆయన అన్నారు. ఇలాంటి చారిత్రక పరిస్థితుల్లోనే ఇలాంటి వ్యక్తులు పుడతారు. దిశానిర్దేశం చేస్తారు.

- కేశవ్, ఆర్థిక సామాజిక విశ్లేషకులు

జాగృతి సమీక్ష సంపాదకులు

98313 14213

Advertisement

Next Story

Most Viewed