విద్యలో..క్రీడలు భాగం కావాలి!

by Ravi |   ( Updated:2023-08-29 00:00:52.0  )
విద్యలో..క్రీడలు భాగం కావాలి!
X

ఆకుపచ్చ మైదానాల నుంచి చిన్నారులను మెడబట్టి మార్కుల మాయా లోకంలోకి గుంజుకుపోతున్న సమకాలీన భారతంలో క్రీడలకు పూర్తిగా మంగళం పాడేసిన పాఠశాలలెన్నో వున్నాయి. వారానికి కనీసం రెండు పీరియడ్లు చిన్నారులకు వ్యాయామ విద్య నేర్పించాలన్న నిబంధన ఆచరణకు నోచుకోవడం లేదు. బట్టి చదువులతో ర్యాంకులు తెచ్చుకునే తాపత్రయంలో పిల్లలను శారీరకంగా, మానసికంగా బలిష్టంగా తీర్చిదిద్దే వ్యాయామ విద్యకు కాల నిర్ణయ పట్టికలో చోటు కల్పించడం లేదు. విద్యార్థులకు క్రీడలను ప్రాథమిక హక్కుగా గుర్తించాలంటూ 2018లో సుప్రీంకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం నేటికీ కార్యరూపం దాల్చలేదు. అలాగే దశాబ్దం క్రితం జాతీయ వ్యాయామ విద్య వినోద ప్రణాళిక రూపుదిద్దుకున్న అది దస్త్రాల్లోనే మిగిలిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.

అమలుకు ఆటంకాలెన్నో...

హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి రోజున ప్రతి ఏడాది జాతీయ క్రీడల దినోత్సవం జరుపుకుంటున్నాం. అన్నింట్లో గెలవడం ఆనందకరమే కానీ ఓటమి నుంచి నేర్చుకోవడం అంతకంటే అవసరం అన్న ఆయన స్ఫూర్తి మాటలు క్రీడాకారులందరికీ ఆచరణీయం. వ్యాయామ విద్యతో భావితరాన్ని బలోపేతం చేయాలని ఎన్నో కమిటీలు నిర్దారించిన ఆటలకు దూరమవుతున్న బాల్యం పోను పోను మానసికంగా శారీరకంగా దుర్భలమవుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో ఆట స్థలాలు, క్రీడా పరికరాలు, శిక్షకులు లేక కునారిల్లుతున్నాయి. పట్టణీకరణ పాఠశాల క్రీడా మైదానాలను మింగేస్తున్నది. దేశంలోని దాదాపుగా 40 శాతం పాఠశాలల్లో ఆట స్థలమే లేదు. పాఠశాల స్థాయిలో క్రీడలకు మార్కులు లేకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.

శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఐదో తరగతి లోపు ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులే లేవు. కొన్ని రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధి సంస్థలు, ఆయా క్రీడా సంఘాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారడం వల్ల ఆట గురించి ఏమాత్రం అవగాహన లేని వారు బంధుప్రీతి, పక్షపాతంతో దేశంలోని క్రీడలను పాతాళంలోకి తొక్కేయడానికి శాయశక్తులా కృషిచేస్తున్నారు. 2019లో ఫిట్ ఇండియా కార్యక్రమంను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించింది. మూడేళ్లు గడిచినా ఆ ఉద్యమ స్ఫూర్తిని రాష్ట్రాలు అందిపుచ్చుకోలేదు.

నివేదిక రూపొందించినా..

విద్యార్థులకు క్రీడలను ప్రాథమిక హక్కుగా గుర్తించాలంటూ న్యాయవాద విద్యార్థి క్రీడా పరిశోధకుడు కనిష్కపాండే 2018లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సీనియర్ న్యాయవాది అయిన గోపాల్ శంకర్ నారాయణను కోర్టు సహాయకుడిగా నియమించింది. ఆయన విద్యా, క్రీడలు తదితర రంగాల ప్రముఖులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలతో సమగ్ర నివేదికను రూపొందించారు. కేవలం క్రీడలు అనే పదానికి పరిమితం చేయకుండా మొత్తంగా వ్యాయామ విద్యనే ప్రాథమిక హక్కుగా గుర్తించాలని ఎక్కువమంది అభిప్రాయపడినట్లు తన నివేదికలో వివరించారు. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు ఆటలు తప్పనిసరి చేయాలని, ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, క్రీడలను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో రోజుకు 90 నిమిషాల పాటు పిల్లలతో తప్పనిసరిగా ఆటలాడించాలని, వ్యాయామ అక్షరాస్యత వృద్ధికి జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన తదితర సిఫార్సులతో ఆయన తన నివేదికను సమర్పించారు. అలాగే వ్యాయామ విద్యను విద్యా విధానంలో భాగంగా మార్చేందుకు నేషనల్ ఫిజికల్ లిటరసి మిషన్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. కానీ నేటి వరకు ఈ సిఫార్సులు అమలు కావడం లేదు.

ప్రక్షాళన అవసరం...

చదువులంటే కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు... బాలల సంపూర్ణ ఎదుగుదలకు బాటలు పరిచే ఆటలు ఆడటం ద్వారా బృంద స్ఫూర్తి, సహనం, చురుకుదనం, ఏకాగ్రత, పోరాట పటిమ, క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించడం వంటి లక్షణాలను పెంపొందిస్తాయి. మన ప్రాచీన విద్యా విధానంలో వ్యాయామ, యుద్ధ విద్యలకు ప్రముఖ స్థానం ఉండేది. విలువిద్య, వేట, కత్తి సాము, గుర్రపు స్వారి, వంటివి బాల్యం నుంచే పాఠాల్లో భాగమయ్యేవి. యోగ నేర్చుకోవడం విద్యార్థుల ప్రణాళికలో ఉండేది. ఫలితంగా పిల్లల్లో శరీరక దారుఢ్యంతో పాటు మానసిక దృఢత్వం అలవాడేవి. ప్రస్తుత విద్యా విధానంలో అవన్నీ భాగం కావాలి. నూతనంగా తయారు చేస్తున్న జాతీయ పాఠ్యప్రణాళిక చట్రంలో క్రీడలకు చోటు కల్పించి పక్కాగా అమలయ్యేలా చూడాలి. గోపాల్ శంకర్ నారాయణ నివేదిక సూచనలను దేశమంతటా అమలుపరచాలి. శరీరాన్ని అదుపులో ఉంచే శరీరక శ్రమ లోపించి ఏటా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా అర్థాంతరంగా అసువులు బాస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. రోజుకు కనీసం గంట వ్యాయామం చిన్నారులకు చాలా మేలు చేస్తుందని ఆ సంస్థ సూచిస్తుంది. ఆ మేరకు పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పన, పీఈటీల నియామకం జరగాలి. ర్యాంకులు లక్ష్యంగా సాగుతున్న మన విద్యా వ్యవస్థలో క్రీడలు, వ్యాయామ విద్యలో పూర్తి ప్రక్షాళన జరిగితే సుదృఢ భారతావని నిర్మాణ స్వప్నం సాకారమవుతుంది.

(నేడు జాతీయ క్రీడా దినోత్సవం)

అంకం నరేష్

63016 50324

Advertisement

Next Story

Most Viewed