ప్రతి పేగును కదిలించిన ఉద్యమ పాట రాసిన గూడ అంజయ్య గురించి తెలుసా?

by Ravi |   ( Updated:2022-10-31 18:46:16.0  )
ప్రతి పేగును కదిలించిన ఉద్యమ పాట రాసిన గూడ అంజయ్య గురించి తెలుసా?
X

మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో అంజయ్య పాటలు ప్రతి పల్లెను కదిలించాయి. ప్రతి హృదయాన్ని తడిపాయి. ఉద్యమానికి రమ్మని చేయి పట్టుకుని నడిపించాయి. ఉత్తేజాన్ని తీసుకువచ్చాయి. అణువణువునా తెలంగాణ ఆకాంక్షను రేకెత్తించాయి. 2002లో కామారెడ్డి లో జరిగిన 'ధూంధాం' మొదటి బహిరంగ సభలో 'అయ్యోనివా నీవు అవ్వోనివా' అంటూ పాడిన పాట ఆంధ్ర పెత్తనం దోపిడీ వ్యవస్థ మీద నిగ్గదీసి అడుగుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి, ఉచ్ఛదశకు చేర్చింది. తొలి పాట దగ్గర నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమ గీతాల వరకు తెలుగు అత్యంత ప్రేరణను ఇచ్చిన పాట 'ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా' తెలంగాణ రాష్ట్ర పొలిమేర దాటి 16 భాషలలోకి అనువదించబడింది. అడవి మైదానం నుంచి అంతర్జాతీయ వేదికల మీద కవులు, కళాకారులు, ప్రజలను ఉర్రూతలూగించిన పాట ఇది. ఆయన పాటలలో కుటుంబ కష్టాలు, కడు పేదరికం, మధ్యతరగతి బలహీనతలు, బాధలు ఉంటాయి.

తెలంగాణ తొలి దశ పోరాటం నుంచి మలిదశ పోరాటం వరకు తన కలంతో, గళంతో తెలంగాణ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజాకవి గూడ అంజయ్య. కాలం వెంట చాలా మంది కవులు పరుగెడతారు కానీ, కాలాన్ని తన వెనకాల నిలబెట్టుకొని సమాజంలో తన పాటలతో, రచనలతో, కవితలతో, గానంతో సమాజాన్ని కదిలించి, దోపిడీని ప్రశ్నించిన ఉద్యమ కవి ఆయన. ఆయన చూసిన బతుకులు, ఆయన బతికిన బతుకు ఇవే ఆయన పాటలకు ప్రేరణలు.

పాట వలన సమాజం మారిపోతుందా? అంటే, ఒక పాట ప్రభావం ప్రజలపై తప్పకుండా ఉంటుందని అంటాడు.పాట ఒక ప్రశ్నకు సమాధానం కాకపోవచ్చు. కానీ, జవాబు రాబట్టే మార్గాన్ని నిర్దేశిస్తుందని ఆయన నమ్మకం. సామాన్యుల బతుకులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయో జీవితానుభవం ద్వారా తెలుసుకొని ప్రజలను జాగృతం చేసే దిశగా ఆయన రచనలు కొనసాగించాడు. దొరల, భూస్వాముల దోపిడీని ప్రశ్నిస్తూ అన్ని పనులు మనమే చేస్తే మధ్యలో దొరల పెత్తనమేందంటూ ప్రశ్నించాడు. జనంలోంచి వచ్చిన జానపదమే తన ప్రాణప్రదమని నమ్మి తన కలంలో పేదల కన్నీళ్లను సిరాగా పోసి మలిదశ ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారు. తెలంగాణ పోరాటం ఉచ్ఛదశకు చేరడానికి కారణమయ్యాడు.

ఉద్యమ సాహితీ శిఖరం

దొరల గడీలకు దూరంగా బానిసత్వంలో బతుకీడుస్తున్న ప్రజల కష్టాలను చూసి, అనుభవించి, కన్నీరు పెట్టుకొని, చలించిపోయి రాసిన పాటలను గుండెలలో నింపుకొని పాడిన గూడ అంజయ్య మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో లక్ష్మయ్య-లక్ష్మమ్మ దంపతులకు 1955 నవంబర్ ఒకటిన జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం లింగాపూర్, లక్సెట్టిపేటలో జరిగింది. 1970లో హైదరాబాద్‌కు వచ్చి ఇంటర్, బీఫార్మసీని పూర్తి చేసారు. అనంతరం ఫార్మసిస్టుగా ఉట్నూరులో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఇంటర్ చదివే సమయంలోనే నక్సల్బరీ ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఆ క్రమంలో అరుణోదయ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులలో ఒకడిగా ఉన్నారు. గ్రామీణ ప్రజల దుస్థితి, బాల్యంలో ఎదురైన సంఘటనలన్నీ ఆయనలో ఆవేశాన్ని రగిలించాయి. ప్రజలను చైతన్యపరచాలనే బలమైన కోరికను కలిగించాయి. దానికి సరైన మాధ్యమం పాటే అని నిర్ణయించుకున్నారు.

ఒకసారి హైదరాబాద్ నుంచి లింగాపూర్ వెళ్లారు. బస్సు దిగి ఊరు వైపు నడుస్తున్న ఆయనకు ఒక ముసలాయన కనిపించాడు. అతనిని పలకరించగా చిరాగ్గా చూశాడు. ఏమైందని అడిగితే 'ఏం చెప్పమంటావు బిడ్డా, ఎప్పుడో ఆరేళ్ల కిందట దొర దగ్గర అప్పు తీసుకున్నాను. అప్పటి నుండి వెట్టి చాకిరి చేస్తూనే ఉన్నాను. ఇంకా అసలు కూడా ముట్టలేదు అని అంటున్నాడు. ఊరదలిపోవాల్నో ఊరిలోనే చావాల్నో' అంటూ ఏడ్చాడు. చలించిపోయిన అంజయ్య ఊరిడిసి నేబోదునా/ అయ్యో ఉరి పెట్టుకుని సత్తునా' అని రైతు మాటలను పాటగా రాశారు. ఇది ఆయన మొదటి పాట. ఆనాడు మొదలైన పాటల ప్రవాహం తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేంతవరకు కొనసాగింది.

Also read: తెలంగాణ కవి అందెశ్రీ గురించి తెలుసా?

ఉర్రూతలూగించిన పాటలు

మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో అంజయ్య పాటలు ప్రతి పల్లెను కదిలించాయి. ప్రతి హృదయాన్ని తడిపాయి. ఉద్యమానికి రమ్మని చేయి పట్టుకుని నడిపించాయి. ఉత్తేజాన్ని తీసుకువచ్చాయి. అణువణువునా తెలంగాణ ఆకాంక్షను రేకెత్తించాయి. 2002లో కామారెడ్డిలో జరిగిన 'ధూంధాం' మొదటి బహిరంగ సభలో 'అయ్యోనివా నీవు అవ్వోనివా' అంటూ పాడిన పాట ఆంధ్ర పెత్తనం దోపిడీ వ్యవస్థ మీద నిగ్గదీసి అడుగుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి, ఉచ్ఛదశకు చేర్చింది. తొలి పాట దగ్గర నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమ గీతాల వరకు తెలుగు అత్యంత ప్రేరణను ఇచ్చిన పాట 'ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా' తెలంగాణ రాష్ట్ర పొలిమేర దాటి 16 భాషలలోకి అనువదించబడింది. అడవి మైదానం నుంచి అంతర్జాతీయ వేదికల మీద కవులు, కళాకారులు, ప్రజలను ఉర్రూతలూగించిన పాట ఇది.

ఆయన పాటలలో కుటుంబ కష్టాలు, కడు పేదరికం, మధ్యతరగతి బలహీనతలు, బాధలు ఉంటాయి.'అసలేటి వానల్లో ముసలెడ్లు గట్టుకొని / మోకాలి బురదలో మడిగట్టు దున్నితే / గరిసె లెవరివి నిండెరా-గంగన్న గుమ్ము లెవరివి నిండెరా-గంగన్న' అంటూ రైతన్న గోసను ఎత్తిచూపుతూ తిరుగుబాటు కాంక్షను రగిలిస్తూ పీడిత,తాడిత ప్రజలలో చైతన్యాన్ని రగిలించాయి. 'భద్రం కొడుకా పైలం కొడుకా / రిక్షా ఎక్కే కాడ దిగే కాడ / తొక్కుడు కాడ / మలుపుడు కాడ / భద్రం కొడుకో / జర పైలం కొడుకో' అంటూ అమ్మ పేగు భాషను ఆర్తితో పలికిస్తూనే బడుగు జీవుల శ్రమను దోచుకోవడానికి పల్లెకు పట్టణానికి తేడా ఉండదని హెచ్చరించాడు. ఈ పాట 'రంగుల కల' సినిమా ద్వారా చాలా ప్రాముఖ్యత పొందింది. తెలంగాణ నుడికారం, దిక్కారం, కలల సాకారం కలగలిసిన పాటకు ఏ గండ పెండేరం ఎవరు తొడగకుండానే పుట్టెడు కష్టాలు, చుట్టుముట్టిన అనారోగ్యం మధ్య 2016 జూన్ 21న అంజన్న తుది శ్వాస విడిచారు.

Also read: రాష్ట్ర ఉద్యమంలో వెయ్యి సార్ల కంటే ఎక్కువ అరెస్టయిన లీడర్ ఎవరో తెలుసా?

(నేడు గూడ అంజన్న జయంతి)

అంకం నరేశ్

63016 50324

Advertisement

Next Story

Most Viewed