- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అజరామరం ఆ గానం
సాంప్రదాయ సంగీతానికి భంగం వాటిల్లనీయకుండా, సామాన్య సంగీత ప్రియులకు సైతం హృదయరంజకంగా పాడిన శేషశైలావాసా, ఏడు కొండలా స్వామి, రహస్యం, లవకుశ, నర్తనశాల తదితర పాటలు పండిత పామరులను అలరించాయి. జన్మతః లభ్యమైన సుమధుర గంభీర గాత్రంతో గానం చేసిన 'భగవద్గీత' అజరామర సుస్వరాన్ని కలిగిన ఘంటసాలను అనునిత్యం స్మరణీయునిగా చేస్తూనే ఉంది.
భారతావనిలో ఎందరో గాయకులు ఉద్భవించారు. ఎందరో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. కానీ, సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన ఘనత ఘంటసాల మాస్టారుకే దక్కుతుంది. ప్రముఖ గాయకులుగా, తెలుగు సినీ సంగీత దర్శకులుగా, జైలుకెళ్లిన స్వాతంత్ర్య సమర యోధుడిగా ఎనలేని కీర్తినార్జించిన గాన గంధర్వుడు మన తెలుగువాడు కావడం గర్వకారణం. 1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ-రత్నమ్మ దంపతులకు జన్మించిన వేంకటేశ్వరరావు బాల్యం నుంచే సంగీతం పట్ల మక్కువ కలిగి ఉన్నారు. కచేరీలలో తండ్రి మృదంగం సహకారం అందించడానికి వెళుతూ, కుమారుడిని భుజంపై ఎత్తుకుని పాటలు పాడుకుంటూ తీసుకెళ్లేవారు.
ఘంటసాల కచేరీలలో నాట్యం చేస్తూ బాల భరతుడు అనిపించుకున్నారు. తను 11వ యేట ఉండగానే తండ్రి మరణించారు. తాను గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కోరిన తండ్రి ఆకాంక్షను సాకారం చేసేందుకు సంకల్పించుకున్నారు. ఒకసారి ఒక సంగీత కచేరీలో పోటీ పడి ఓటమి చెందగా, పట్టుదల మరింతగా పెరిగింది. సంకల్పం నెరవేర్చకునేందుకు గురుకులాలలో చేరినా, కట్టుబాట్లకు తట్టుకోలేక తిరిగి వచ్చేసారు.
బట్టలుతికి, వంట చేసి
అయినా, ఘంటసాల తన పట్టు వీడలేదు. కొందరు విద్వాంసుల ఇళ్లలో బట్టలుతికి, వంటచేసి, సంగీతాభ్యాసం చేసారు. తర్వాత తన దగ్గరున్న 40 రూపాయల విలువైన బంగారు ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకే విక్రయించి, ఆంధ్ర రాష్ట్రంలోని ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరానికి చేరుకున్నారు. రోజుకో ఇంటిలో భోజనం చేసుకుంటూ ఎల్లమ్మ గుడిలో తల దాచుకుంటూ కాలం గడిపారు. అలాంటి సమయంలో పట్రాయని సీతారామశాస్త్రి యాదృచ్ఛికంగా ఆయనను చూడడం, తన ఇంట ఉచితంగా శిక్షణ నివ్వడానికి అంగీకరించడం ఘంటసాల జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన.
పేదవాడైన శాస్త్రి ఘంటసాలకు అన్నం పెట్టలేక మధూకర వృత్తి నేర్పించారు. తర్వాత ఘంటసాల కళాశాలలో చేరి, నాలుగేళ్ల కోర్సును రెండేళ్లకే పూర్తి చేశారు.కొన్నాళ్లు విజయనగరంలో కచేరీలు చేసి, అనంతరం స్వగ్రామం చౌటపల్లికి చేరుకున్నారు. అక్కడ ఉత్సవాలలో, వివాహాలలో గాన కచేరీలు చేసారు. పిల్లలకు సంగీత పాఠాలు నేర్పారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, రెండేళ్లు అలీపూర్ జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1944 మార్చి 4న తమ మేనకోడలు సావిత్రిని పరిణయమాడారు. తమ వివాహ సందర్భంలో స్వయంగా సంగీత కచేరీ చేశారు. అత్తవారి ఊరిలో సముద్రాల రాఘవాచారిని కలవగా, ఆయన సూచన మేరకు రెండు మాసాలు కచేరీలు చేసి సమకూర్చుకున్న డబ్బుతో, మరింత అప్పు చేసి మద్రాసుకు చేరుకున్నారు.
ప్రముఖులను కలుసుకుని
రాఘవాచారి ద్వారా నాటి సినీ ప్రముఖులు చిత్తూరు నాగయ్య, బీఎన్ రెడ్డి సమక్షంలో పాటలు పాడి, ప్రశంసాపాత్రులయ్యారు. పానగల్ పార్కులో ఉంటూనే, సముద్రాల చొరవతో మద్రాసు రేడియో కేంద్రంలో లలిత సంగీత గాయకునిగా అవకాశం పొందారు. కొన్ని గీతాలు రచించి, స్వరకల్పన చేసి పాడారు. తర్వాత కాలంలో భువన విజయం పేరుతో వాటిని గ్రంథస్థం గావించారు. సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసారు. 'స్వర్గసీమ' చిత్రంలో తొలిసారిగా నాగయ్య, బీఎన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. భానుమతితో కలిసి పాడిన పాటకు 118 రూపాయల పారితోషికం పొందారు. భానుమతీరామకృష్ణ తీసిన 'రత్నమాల' చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. తర్వాత బాలరాజు, మనదేశం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
1951లో విడుదలైన 'పాతాళ భైరవి' ఘన విజయం ఘంటసాలకు ఎనలేని పేరు తెచ్చి పెట్టింది. 1951లో మళ్లీశ్వరి తర్వాత 1953లో దేవదాసు, 1955లో అనార్కలి, 1957లో మాయాబజార్ లాంటి హిట్ సినిమాలు ఘంటసాలను సాటిలేని మేటి గాయకునిగా నిలబెట్టాయి. 1970 వరకూ హీరోలకు, విలన్లకు, కమెడియన్లకు పాడిన ప్రతి పాటా మాస్టారుదే కావడంతో ఆయన సినీ సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజయ్యారు.
విదేశీయానం, పురస్కారాలు
1970లో ఘంటసాలను పద్మశ్రీ పురస్కారం వరించింది. 1971లో ఐరోపా, ఆమెరికాలో ప్రదర్శనలు నిర్వహించారు. క్రమేపీ ఆరోగ్యం క్షీణించడంతో 1974 ఫిబ్రవరి 11న యావదాంధ్ర సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచి స్వర్గస్తులయ్యారు. కరుణశ్రీ, జాషువా, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి వారి చేత ప్రశంసలు పొందారు. వారి రచనలను వీధి పాటలుగా, నూతన ఒరవడితో పద్యాలుగా, సామాన్య జన బాహుళ్యానికి అందుబాటులోకి తెచ్చిన ఘనత మాస్టారుదే.
సాంప్రదాయ సంగీతానికి భంగం వాటిల్లనీయకుండా, సామాన్య సంగీత ప్రియులకు సైతం హృదయరంజకంగా పాడిన శేషశైలావాసా, ఏడు కొండలా స్వామి, రహస్యం, లవకుశ, నర్తనశాల తదితర పాటలు పండిత పామరులను అలరించాయి. జన్మతః లభ్యమైన సుమధుర గంభీర గాత్రంతో గానం చేసిన 'భగవద్గీత' అజరామర సుస్వరాన్ని కలిగిన ఘంటసాలను అనునిత్యం స్మరణీయునిగా చేస్తూనే ఉంది.
(నేడు ఘంటసాల జయంతి)
రామకిష్టయ్య సంగనభట్ల
9440595494