గిరిజనుల ప్రత్యేక పండుగ తీజ్ ఎలా జరుపుకుంటారో తెలుసా?

by Ravi |   ( Updated:2022-09-03 14:00:07.0  )
గిరిజనుల ప్రత్యేక పండుగ తీజ్ ఎలా జరుపుకుంటారో తెలుసా?
X

ఈ తొమ్మిది రోజుల అమ్మాయిలకు కఠిన నియమాలు ఉంటాయి ఉప్పు, కారం లేని భోజనం తినాలి. అత్యంత పవిత్రంగా ఉండాలి. భక్తితో దేవతలను పూజించాలి. తండా నుంచి బయటకు వెళ్లకూడదు. మాంసం నిషేధం. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను నేలపై పెట్టకుండా నేరుగా పందిరిపై నీరు పోయాల్సిందే. నృత్యాలు చేసినంత సేపు బిందెను నెత్తిపై పెట్టుకొని నిలబడాల్సిందే. యేటా ఆగస్టు రెండో వారం శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఇంత గొప్పగా జరుపుకునే సీత్లా భవాని, తీజ్‌ను ప్రభుత్వం అధికారిక పండుగలుగా ప్రకటించాలని లంబాడీలు కోరుతున్నారు.

గిరిజన తండాలలో అవివాహిత ఆడపిల్లలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ తీజ్. కాలం మారుతున్నా లంబాడీలు మాత్రం తమ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. తీజ్ పండుగలో కఠోర నియమాలు, డప్పుల మోతలు, కేరింతలు, ఆటపాటలు, నృత్యాలు, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలు, బావామరదళ్ల అల్లరి చేష్టలు ఉంటాయి. తొమ్మిది రోజుల పాటు వేడుకలు జరుగుతాయి, ఈ పండుగ 'బతుకమ్మ'ను పోలి ఉంటుంది. గోధుమ మొక్కలను ఎనిమిది రోజులపాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్ఞనం చేస్తారు. ఉత్సవాలను పెళ్లి కాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండా పెద్దలు, సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ఎర్రని ఆరుద్ర పురుగు వచ్చే సమయానికి పండుగ జరుపుతారు. గోధుమ మొలకలను 'తీజ్' గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే గోధుమలను నానబెట్టి తీజ్ మొలకలను పూజించడం ఆనవాయితీ.

తొమ్మిది రోజుల పాటు

వరి నాట్లు వేయడం పూర్తి కాగానే తండా పెద్ద అనుమతి తీసుకొని ఆడపిల్లలు పండుగకు సన్నాహాలు చేసుకుంటారు. ఇంటింటికీ వెళ్లి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. విరాళాలు సేకరిస్తారు. అంగడికి వెళ్లి గోధుమలు, శనగలు, ఇతర సామగ్రి తెచ్చుకుంటారు. గోధుమలను నానబెట్టడానికి దుస్సేరు తీగలతో బుట్టలను అల్లుతారు. పుట్ట మట్టిని తెచ్చి అందులో మేక ఎరువు కలుపుతారు. మెదట తండా నాయకుడి చేత ఎరువు కలిపి మట్టిని పోయించి గోధుమలను చల్లిస్తారు. తండాలో పాడి పంటలు పచ్చగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, సీత్లా మేరమా మాతతో పాటు, తిరుపతి బాలాజీ, హాథీరాం బాలాజీ, వేములవాడ రాజన్న, తుల్జా భవానీని కొలుస్తారు. తండాలను ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకంగా కాపాడుతుందని నమ్ముతారు.

తొమ్మిది రోజులు బుట్టలో నీళ్లు పోస్తారు. గోధుమలను నానబెట్టాక రేగు ముళ్లు గుచ్చుతారు. ఈ సమయంలో వరసకు బావ అయ్యేవారు వాటిని కదిలిస్తారు. అయినా ఆడపిల్లలు సహనంతో ఉంటారు. గోధుమలు మంచిగా మొలకెత్తితే పంటలు బాగా పండుతాయని తండా పెద్దలు భావిస్తారు. ఏడో రోజు 'ఢమోళి' జరుపుతారు. చుర్మోను (రొట్టెలను బెల్లంతో కలిపి చేసే ముద్ద) మేరామా భవానికి సమర్పిస్తారు. జంతువులను బలి ఇస్తారు. దీన్నే 'అకాడో' అంటారు. బలి ఇచ్చిన మేక మాంసాన్ని ప్రతి ఇంటికి పంపిస్తారు. తీజ్ వద్ద ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు.

కఠిన నియమాలు

ఎనిమిదో రోజున మట్టితో చేసిన ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను పూజించి వాటికి పెళ్లి చేస్తారు. తమను డోక్రీలుగా ఊహించుకొని, పెళ్లి అయితే పుట్టిల్లు వదిలివెళ్లాల్సి వస్తుందని ఏడుస్తారు. సోదరులు ఓదార్చుతారు. తొమ్మిదో రోజున తీజ్ నిమర్జనానికి బంధుమిత్రులను ఆహ్వానించి వేడుకలు జరుపుతారు. తండా నాయక్ బుట్టలను ఆడపిల్లలకు అందిస్తారు. అన్నదమ్ములు బుట్టనెత్తుకున్న ఆడపిల్లల ఆశీర్వాదం తీసుకుంటారు. (ఇది రాఖీ పండుగను పోలి ఉంటుంది). తరువాత నిమజ్జనానికి బయలుదేరుతారు. ఇది అద్భుత సన్నివేశం.

ఈ తొమ్మిది రోజుల అమ్మాయిలకు కఠిన నియమాలు ఉంటాయి ఉప్పు, కారం లేని భోజనం తినాలి. అత్యంత పవిత్రంగా ఉండాలి. భక్తితో దేవతలను పూజించాలి. తండా నుంచి బయటకు వెళ్లకూడదు. మాంసం నిషేధం. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను నేలపై పెట్టకుండా నేరుగా పందిరిపై నీరు పోయాల్సిందే. నృత్యాలు చేసినంత సేపు బిందెను నెత్తిపై పెట్టుకొని నిలబడాల్సిందే. యేటా ఆగస్టు రెండో వారం శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఇంత గొప్పగా జరుపుకునే సీత్లా భవాని, తీజ్‌ను ప్రభుత్వం అధికారిక పండుగలుగా ప్రకటించాలని లంబాడీలు కోరుతున్నారు.

లకావత్ చిరంజీవి నాయక్

కేయూ, వరంగల్

99630 40960

Advertisement

Next Story