మాతృభాష అంతరిస్తే ఏమవుతుందో తెలుసా?

by Ravi |   ( Updated:2023-02-20 18:45:44.0  )
మాతృభాష అంతరిస్తే ఏమవుతుందో తెలుసా?
X

క జాతి నాగరికత, సంస్కృతి, జీవన విధానాన్ని వారి మాతృభాషే ప్రతిబింబిస్తుంది. శిశువు పెరుగుదలకు అమ్మ పాలు ఎంత అవసరమో, వికాసానికి మాతృభాష అంత అవసరం. 'నిజమైన భావ ప్రేరణ, ప్రగతి మాతృభాష వలనే లభిస్తాయి' అన్న గాంధీ మాటలు మాతృభాష ప్రాముఖ్యత చాటి చెబుతుంది. నాటి పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉన్న తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్ )వాసులు తమ మాతృభాష పరిరక్షణకు ఉద్యమించారు. అక్కడి పాలకులు ఒప్పుకోకపోవడంతో పోరాటం ఉధృతం చేశారు ఈ పోరాటంలో నలుగురు విద్యార్థులు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం తగ్గి ఉర్దూతో పాటు బెంగాల్ వాసుల మాతృభాషను అధికారిక భాషగా ప్రకటించింది. ఇది జరిగిన కొన్నేళ్ల తరువాత యునెస్కో మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో మాతృభాష పరిరక్షణ కోసం ఉద్యమించిన బెంగాల్ విద్యార్థుల త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరపాలని 1999లో నిర్ణయించింది.

మొదట్లో మాతృభాషకు ప్రాధానమిచ్చినా..

మాతృభాష పరిరక్షణ అనేది ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం. భాషాను కాపాడుకోవడం ద్వారానే మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని ప్రకటించింది. మన భావోద్వేగాలను, జ్ఞానాన్ని, సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడంలో మాతృభాష గణనీయమైన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రపంచీకరణ తరువాత జరుగుతున్న సామాజిక మార్పుల వలన నలభై శాతం మేర మాతృభాషలు అంతరించే స్థాయికి చేరినట్టు భాషా నివేదికలు తెలుపుతున్నాయి. దీనికి కారణం విద్య, ఉపాధి, సాంకేతికతలో ఆయా జాతి ప్రజల మాతృభాషకు ప్రాధాన్యం లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఒక భాష అంతరించిపోతే ఈ జాతి చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళారంగాల వైశిష్ట్యం కోల్పోవడమే. ప్రపంచంలో ఎవరైనా ఏదైనా విషయాన్ని మొదటగా అర్థం చేసుకునేది, ఆలోచించేది మాతృభాషలోనే. తల్లి భాషలో ఉండే నుడికారాన్ని, పలుకుబడిని, వక్రోక్తిని, ఆర్ద్రతను మరో భాషలోకి అనువదించలేం. ఒకవేళ పదాలను అనువదించినా, ఆ పదాలను అంటిపెట్టుకొని ఉండే భావోద్వేగాన్ని అనువాదం చేయలేం. అందుకే మాతృభాష ప్రాముఖ్యతను గుర్తించిన యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు, భాషా శాస్త్రవేత్తలు మాతృభాషలో విద్యాభ్యాసం బహుళ ప్రయోజనకరమని పదేపదే ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే మాతృభాషలో విద్యను అభ్యసిస్తున్న జపాన్, జర్మనీ, స్వీడన్, ఫిన్ లాండ్, చైనా వంటి దేశాలు సాంకేతికత పరంగా ముందు ఉండటం గమనార్హం. మన దేశంలో సైతం మొదట్లో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి పెద్దపీట వేసినా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరైనా భాషాభిమానులు మాతృభాషలో విద్యాభ్యాసం చేయాలని కోరితే మీ పిల్లలకు ఆంగ్లమాధ్యమాలు... మా పిల్లలకు మాతృభాషా మాధ్యమాలా? అని ఎదురు తిరిగే పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వ విధానాలే కారణం. విద్యను వ్యాపారీకరణ చేసిన విద్యా వ్యాపారవేత్తలు, వారికి వంత పాడుతున్న పాలకులు కలిసి సమాజంలో ఆంగ్లం తప్ప వేరే భాష లేదనేట్లు చేసి మొత్తం సమాజాన్ని మాతృభాషకు దూరం చేశారు.

మాతృభాషను దానికే పరిమితం చేసి

దేశంలో స్వాతంత్య్రం వచ్చాకా ఏర్పడ్డ విద్యాకమిటీలన్ని మాతృభాషలో విద్యాబోధన ప్రాధాన్యతను తెలుపుతూ కనీసం ప్రాథమిక విద్యనైనా మాతృభాషలో బోధించాలని సూచించాయి. కానీ అవేవి ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురాలేకపోయాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ తమ పిల్లల విద్యభ్యాసం తెలుగు మాధ్యమాలలో కంటే ఆంగ్ల మాధ్యమాలలో కొనసాగించడానికే ఇష్టపడుతున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడమంటే తెలుగును పట్టించుకోకపోవడం కాదు, చిన్న వయసులో పిల్లలు ఆలోచించేది కలలు కనేది అమ్మభాషలోనే. ఆ భాషకు మనసుకు దగ్గరి సంబంధం ఉంది. మాతృభాష ద్వారానే ఇతర భాషలు నేర్చుకోగలుగుతున్నారు. బహుభాషల విధానాన్ని ప్రోత్సహిస్తూనే మాతృభాషను కాపాడుకోవాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే జ్ఞానవంతులవుతారనీ, ఉపాధి దొరుకుతుందని వారి మనుసులో బలంగా నాటుకుపోయింది. చివరికి వారి పిల్లలను అమ్మా నాన్న అని పిలిపించుకోవడానికి ఇష్టపడటంలేదు. ప్రభుత్వాలు సైతం మాతృభాషను ఒక సబ్జెక్టుకు పరిమితం చేసి మాతృభాష పరిరక్షణకు తామెంతో కట్టుబడి ఉన్నట్టు ప్రకటించుకుంటున్నాయి.

మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు మాత్రమే మాతృభాష విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తోంది. తెలుగులో చదివి అత్యుత్తమ స్థాయిలో ఉన్న వారెందరో ఉన్నారు. తెలుగును విస్మరించకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. తెలుగు రాష్ట్రాలలో అధికార భాషా సంఘాలు అలంకారప్రాయంగా మిగిలిపోకుండా చొరవ తీసుకొని ప్రజల నిత్య వ్యవహారాలన్నీ తెలుగులో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. తెలుగు మాధ్యమంలో చదివే వారికి వెయిటేజీ కల్పించాలి. అలాగే తెలుగు బోధిస్తున్న భాషా పండితుల సమస్యలను పరిష్కరించి వారిని గౌరవించాలి.తెలుగు భాష తియ్యదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకు తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా! తెలుగు మరచిపోతే వాళ్ళను నువ్వు మరచినట్టురా!" అన్న సినీ కవి మాటలు తెలుగు వారికి మేలుకొలుపు, మాతృభాషకు మంగళహారతులు.

ఏ.వి సుధాకర్

90006 74747

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story