కృష్ణ ఖుల్ దిల్‌వాలే అల్విదా...

by Ravi |   ( Updated:2022-11-15 18:46:26.0  )
కృష్ణ ఖుల్ దిల్‌వాలే అల్విదా...
X

విజయానికి గర్వపడడం, అపజయానికి కుంగిపోవడం ఆయన నైజం కాదు. ఎప్పుడూ ఒకేలా, ఒక నిండు మనిషిగా తనకు తోచిన విధంగా సహాయం అందించే మనస్తత్వం, గుణం ఉన్న కృష్ణకు నేనూ అభిమానినే. అల్లూరి సీతారామరాజు, ఈనాడు, తెలుగువీర లేవరా, ప్రజారాజ్యం, మోసగాళ్లకు మోసగాడు, మంచివాళ్లకు మంచివాడు, పాడిపంటలు, గూడుపుఠాని, పండంటి కాపురం, అవే కళ్లు, మండే గుండెలు, ఏజెంట్ గోపి, దేవదాస్, అంతం కాదిది ఆరంభం, అగ్నిపర్వతం, పచ్చని సంసారం, అన్నదమ్ముల సవాల్, మాయదారి మల్లిగాడు, దేవుడు చేసిన మనుషులు, గంగ మంగ, అమ్మకోసం, భలే దొంగలు, మీనా, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి చిత్రాలు అఖిలాంధ్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తెలుగు తెరకు కౌబాయిని పరిచయం చేసింది కూడా కృష్ణనే. కేఎస్‌ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ అధికంగా యాక్షన్ చిత్రాలలో నటించారు. ఫైటింగ్ దృశ్యాలు, అన్యాయాలను ఎదిరించి మాట్లాడే దృశ్యాలు బాగా నచ్చేవి. జనాలను ప్రభావితం చేసేవి, బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేందర్‌తో కృష్ణను ఎక్కువగా పోల్చుకునేవారు.

ఖులే దిల్‌వాలే, ఖులే హాత్‌వాలే, టాలీవుడ్‌కా సర్‌తాజ్ (ఓపెన్ హార్ట్, ఓపెన్ హ్యాండ్స్, టాలీవుడ్ కీర్తి కిరీటం) హీరో కృష్ణ వెళ్లిపోయారు. సౌత్ ఇండియాకు నూతన టెక్నాలజీని వెంటవెంటనే పరిచయం చేసిన ధీరుడు కృష్ణ. హాలీవుడ్ తర్వాత దేశంలోనే మొట్టమొదటి జేమ్స్‌బాండ్ సినిమా గూడచారి-116 హీరో కృష్ణ తన 80వ యేట ఊపిరి వదిలారు. తెలుగు సినిమాకు టెక్నాలజీ వాడకంలో ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘనతను కృష్ణ స్వంతం చేసుకున్నారు. తనకంటే సీనియర్ నటులు ఎన్‌టీ‌ఆర్, ఏ‌ఎన్‌ఆర్ చేయలేని ఎన్నో ధైర్యసాహసాలను కృష్ణ చేసారు. 'అల్లూరి సీతారామరాజు' చిత్రం ద్వారా సినిమాస్కోప్‌ను, 'సింహాసనం' సినిమా ద్వారా 70 ఎంఎంను తెలుగు తెరకు పరిచయం చేశారు. డీటీఎస్, ఈస్ట్‌మన్ కలర్‌ను కూడా కృష్ణనే పరిచయం చేసారు.

తెలుగు సినిమారంగంలో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం ద్వారా కౌబాయ్ చిత్రాలకు ఆద్యుడయ్యాడు. ఈ చిత్రం హాలీవుడ్‌కు కూడా ఇంగ్లిష్ డబ్బింగ్ ద్వారా వెళ్లింది. దాదాపు 15 ప్రపంచ భాషలలో డబ్ చేసారు. దీనిని 'మెకాన్నస్ గోల్డ్' సినిమాతో పోలుస్తూ రివ్యూలు వచ్చాయి. సీన్ కెనరీ నటించిన జేమ్స్‌బాండ్ చిత్రం 'డాక్టర్ నో'తో గూఢాచారి-116ను పోల్చారు. కృష్ణ సాహసాలు దేశంలో చర్చనీయాంశాలు అయ్యాయి. 'పద్మభూషన్'లాంటి ఎన్నో అవార్డులను ఆయన స్వంతం చేసుకున్నారు. ప్రేక్షకులు మాత్రం అభిమానంతో ఆయనను సూపర్ స్టార్, నటశేఖరుడు అని పిల్చుకున్నారు. 350కి పైగా చిత్రాలలో నటించారు, మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించి శోభన్‌బాబు, ఎన్‌టీ‌ఆర్, కృష్ణంరాజు, ఏఎన్‌ఆర్‌లాంటి హీరోలతో కలిసి నటించారు. ఆయన నటించిన 18 చిత్రాలు ఒకే యేడాదిలో విడుదల కావడం విశేషం. ఇది ఇప్పటి వరకూ ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలలో నటించిన మలయాళ నటుడు ప్రేమ్‌నజీర్ కూడా ఒక యేడాదిలో అన్ని చిత్రాలలో నటించలేదు.

మనసున్న మనిషి

ఉన్నత వ్యక్తిత్వం గల మంచి మనిషిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కృష్ణ తాను నటించిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వ్యాపారం లేక నిర్మాత నష్టపోయినపుడు మద్దతుగా నిలిచేవారు. అవసరం అయితే వారికి ఉచితంగా మళ్లీ సినిమాలు చేసిపెట్టేవారు. పలువురు నిర్మాతలు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకున్నా అడిగేవారు కాదంటారు. ఇలా ఆయన చాలా మందికి హెల్ప్ చేసేవారు. ఒకానొక తరుణంలో తాను చాలా నష్టాలలో ఉన్నపుడు కూడా ఎవరినీ సాయం అడగలేదని కూడా అంటారు.

ఆయన సినిమాలలోకి రావడానికి ఎన్‌టీ‌ఆర్ స్ఫూర్తి అయితే, రాజకీయాలలోకి రావడానికి మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రొత్సహం ఉందనేవారు. 1989లో ఏలూరు ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. చాలా ఫెయిర్‌గా, ఫ్రాంక్‌గా ఉండే మన ఘట్టమనేని శివ రామకృష్ణమూర్తి రాజకీయాలలో రాణించలేకపోయారు. అటు బాలీవుడ్ లెజెండ్ హీరో కృష్ణకు సమ ఉజ్జీ అయిన 80 యేళ్ల అమితాబ్ బచ్చన్ కూడా అంతే. అయన కూడ రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యాక రాజకీయాలకు దూరమయ్యారు.

హీరోగా, దర్శకుడిగా

కృష్ణ 16 చిత్రాలకు డైరెక్టర్‌గా కూడా పని చేసారు. ఏఎన్‌ఆర్ నటించిన ఫేమస్ చిత్రం 'దేవదాసు'ను తనే హీరోగా రంగులలో రీమేక్ చేసారు. కృష్ణ ఎప్పుడు కూడా 'సంథింగ్ ఇన్నోవేటివ్'గా ఉండాలని తాపత్రయ పడేవారు. విజయానికి గర్వపడడం, అపజయానికి కుంగిపోవడం ఆయన నైజం కాదు. ఎప్పుడూ ఒకేలా, ఒక నిండు మనిషిగా తనకు తోచిన విధంగా సహాయం అందించే మనస్తత్వం, గుణం ఉన్న కృష్ణకు నేనూ అభిమానినే. అల్లూరి సీతారామరాజు, ఈనాడు, తెలుగువీర లేవరా, ప్రజారాజ్యం, మోసగాళ్లకు మోసగాడు, మంచివాళ్ళకు మంచివాడు, పాడిపంటలు, గూడుపుఠాని, పండంటి కాపురం, అవే కళ్లు, మండే గుండెలు, ఏజెంట్ గోపి, దేవదాస్, అంతం కాదిది ఆరంభం, అగ్నిపర్వతం, పచ్చని సంసారం, అన్నదమ్ముల సవాల్, మాయదారి మల్లిగాడు, దేవుడు చేసిన మనుషులు, గంగ మంగ, అమ్మకోసం, భలే దొంగలు, మీనా, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి చిత్రాలు అఖిలాంధ్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తెలుగు తెరకు కౌబాయిని పరిచయం చేసింది కూడా కృష్ణనే. కేఎస్‌ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ అధికంగా యాక్షన్ చిత్రాలలో నటించారు. ఫైటింగ్ దృశ్యాలు, అన్యాయాలను ఎదిరించి మాట్లాడే దృశ్యాలు బాగా నచ్చేవి. జనాలను ప్రభావితం చేసేవి, బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేందర్‌తో కృష్ణను ఎక్కువగా పోల్చుకునేవారు.

కృష్ణ సినిమా అనగానే మినిమం గ్యారంటీ, బాక్స్ ఆఫీస్ వద్ద పైసా వసూల్ ఉండేది, కృష్ణకు 2,500 అభిమాన సంఘాలు ఉండేవట. ఆయన చాలా మంది హీరోయిన్‌లతో నటించినా విజయనిర్మలతో ఎక్కువగా 40 చిత్రాలలో నటించారు. 1942 మే 31 జన్మించిన కృష్ణ 1962లో ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. పద్మజ, ప్రియదర్శిని, మంజుల, రమేశ్‌బాబు, మహేశ్‌బాబు. 1969లో విజయనిర్మలను వివాహమాడారు. కొద్ది నెలల క్రితం రమేశ్‌బాబు అనారోగ్యంతో మరణించారు. 2022 నవంబర్ 15 మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు నటశేఖరుడు మనలను వదిలి వెళ్లిపోయారు. ఆయన తన ప్రతి పుట్టిన రోజునూ ఊటీలో జరుపుకునేవారు. కృష్ణలాంటి మనుషులు ప్రస్తుతం టాలీవుడ్‌లో తక్కువే. హీరో కృష్ణకు హృదయ పూర్వక నివాళులు.


ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Advertisement

Next Story